గోదావరిలో దూకిన వృద్ధుడు 

24 Aug, 2020 10:29 IST|Sakshi
గోదావరి నది మధ్య దుంగపై కూర్చొని ఉన్న అప్పారావు, (అంతర చిత్రం) వృద్ధుడు   

 రక్షించిన పోలీస్, ఫైర్‌ సిబ్బంది

రాజమహేంద్రవరం క్రైం: భార్యతో గొడవ పడి గోదావరిలోకి దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన వృద్ధుడిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కాపాడిన సంఘటన టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక తాడితోటకు చెందిన జి.అప్పారావు (73) కొంత కాలంగా భార్యతో గొడవలు పడుతున్నాడు. ఆదివారం కూడా గొడవ జరగడంతో మనస్తాపం చెందిన అతడు గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఇస్కాన్‌ టెంపుల్‌ వద్ద రేవులోకి వచ్చి గోదావరిలో దూకాడు. అయితే ఈత రావడంతో అప్పారావు ప్రవాహానికి కొట్టుకు వెళ్లసాగాడు. గోదావరి గట్టున ఆల్కాట్‌తోట రైతుబజార్‌ వద్ద ఉన్న కేతావారిలంక వద్దకు వచ్చేసరికి దుంగ కనిపించడంతో దానిని పట్టుకుని కూర్చున్నాడు.

అతడిని గమనించిన స్థానికులు హుటాహుటిన 100 నంబర్‌కు సమాచారం అందించారు. సౌత్‌ జోన్‌ డీఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు టూ టౌన్‌ మహిళా ఎస్సై జె.లక్ష్మి, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్, కానిస్టేబుల్‌ దొర సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇన్‌చార్జ్‌ అగ్నిమాపక అధికారి ఉమామహేశ్వరరావు, డ్రైవర్‌ అండ్‌ ఆపరేటర్‌ వై.అనిల్‌కుమార్, ఫైర్‌ మెన్‌ ఎస్‌.రాంబాబు, జేబీ సాగర్, జీపీఎం కుమార్‌ వెంటనే అక్కడకు చేరుకున్నారు. గోదావరి మధ్యలో దుంగపై ఉన్న అప్పారావు వద్దకు తాడుకు లైఫ్‌ జాకెట్‌ కట్టి విసిరారు. అతడు ఆ తాడు పట్టుకున్న తరువాత ఒడ్డుకు చేర్చారు. అప్పారావు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు