మరీ ఇంత దారుణమా: ఆస్తులు రాయించుకుని..

22 Mar, 2022 11:18 IST|Sakshi
చెట్టుకింద భోజనం చేస్తున్న కవులూరు గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ దంపతులు 

సబ్‌ కలెక్టర్‌కు వృద్ధుల ఫిర్యాదు

సాక్షి, కృష్ణలంక (విజయవాడ తూర్పు): నగరంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. సబ్‌ కలెక్టర్‌ జి.ఎస్‌.ఎస్‌. ప్రవీణ్‌చంద్‌ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు ఆలకించి, అర్జీలు స్వీకరించారు. మొత్తం 97 అర్జీలు అందాయి. అనంతరం సబ్‌ కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న స్పందన అర్జీలన్నింటిని పునఃపరిశీలన చేసి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.  

‘నాకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నా. మందులు కొనేందుకు కూడా డబ్బులు లేవు. 74 సెంట్లు, 43 సెంట్ల స్థలాలను నా పెద్ద కుమారుడు బర్రె వెంకటేశ్వరరావు తన పేరుతో రాయించుకున్నాడు. స్థలాలు ఇస్తే మా బాధ్యతలు తీసుకుంటానన్నాడు. ఇప్పుడు స్థలాలు కాజేసి మోసం చేశాడు. ఆ స్థలాలను తిరిగి ఇప్పించి న్యాయం చేయండి’ అంటూ పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామానికి చెందిన వృద్ధురాలు బర్రె నాగమణి అర్జీ ఇచ్చి వేడుకున్నారు.   

బాధితుల సమస్యలను ఆలకించి, అర్జీలు స్వీకరిస్తున్న సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌

తమ కుమారుడు పొలం మీద వచ్చే పంట గానీ డబ్బు గానీ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాడని కవులూరు గ్రామానికి చెందిన వృద్ధులు నాగేంద్రమ్మ, ఆమె భర్త కలెక్టర్‌కు ఫిర్యాదుచేశారు. అనంతరం అక్కెడే చెట్టు కింద ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం చేశారు.
 
వీరులపాడు మండలం కొణతాలపల్లి గ్రామంలోని సర్వే నంబర్‌ 217/1లో తాను కొనుగోలు చేసిన 76సెంట్ల భూమికి సర్వే చేయాలని రెండు సార్లు మీ–సేవలో దరఖాస్తు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదని, తన పొలం సర్వే చేసి హద్దులు చూపించాలని కంచికచర్ల గ్రామానికి చెందిన ఎస్‌కే చాందిని అర్జీ ఇచ్చారు.  

గత వారం స్పందనలో అర్జీ ఇచ్చిన విజయవాడకు చెందిన విభిన్న ప్రతిభావంతుడైన ఎం.శ్రీనివాస్‌కు సబ్‌కలెక్టర్‌ పెన్షన్‌ మంజూరు చేసి, వీల్‌చైర్‌ అందజేశారు. సబ్‌కలెక్టర్‌ కార్యాలయ ఏఓ ఎస్‌.శ్రీనివాస్‌రెడ్డి, డీఎల్‌పీఓ చంద్రశేఖర్, వివిధ శాఖల డివిజనల్‌ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు