పర్యావరణ నేస్తాలు ఆలివ్‌ రిడ్లేలు

11 Apr, 2022 19:08 IST|Sakshi
ఆలివ్‌ రిడ్లే పిల్లలు

సముద్రజలాలు శుద్ధిచేయడంలో కీలకపాత్ర

మత్స్య సంపద అభివృద్ధికి తోడ్పాటు

జిల్లాలో తీరం వెంబడి పునరుత్పత్తి కేంద్రాలు

అటవీశాఖ ఆధ్వర్యంలో సంరక్షణ  

విజయనగరం పూల్‌బాగ్‌: ఆలివ్‌రిడ్లేలుగా పిలిచే సముద్ర తాబేళ్లకు పర్యావరణ నేస్తాలుగా పేరుంది. తీరప్రాంతంలో పరిశ్రమలు అధికం కావడం, సముద్రంలో పెద్దబోట్లు తిరుగుతుండడంతో వీటి మనుగడ కష్టంగా మారింది. అలాంటి సమయంలో అటవీశాఖ వన్యప్రాణి విభాగం అధికారులు తాబేళ్ల సంరక్షణకు శ్రీకారం చుట్టి తీరం వెంబడి పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆరేళ్ల కాలంలో 1,52,232 గుడ్లను సేకరించారు. 1,22,658 తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలారు. జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని 28 కిలోమీటర్ల మేర సముద్రతీరంలో 2014వ సంవత్సరంలో విజయనగరం అటవీశాఖ వన్యప్రాణి విభాగం 10 ఆలివ్‌రిడ్లే పునరుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసింది.   

పెంపకం ఎలా చేపడతారంటే? 
ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో సముద్రంలోని ఆడ తాబేలు తీరానికి చేరుకుని గుడ్లు పెడుతుంది. వాటిని నక్కలు, అడవి పందులు ధ్వంసం చేయకుండా అటవీశాఖ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. తాబేళ్ల పునరుత్పత్తికి ఏ ప్రాంతం అనుకూలమో  ముందుగా గుర్తిస్తారు. ఆప్రాంతంలో మిని హ్యాచరీలు ఏర్పాటు చేసి అందులో రెండు నుంచి మూడు అడుగుల సైజు గుంతలు తవ్వి గుడ్లు ఉంచుతారు. గుంతల్లో ఉంచిన గుడ్లనుంచి పిల్లలు బయటకు వచ్చేందుకు 45 నుంచి 60 రోజుల సమయం పడుతుంది. డిసెంబర్‌ నుంచి జూన్‌ వరకు ఉత్పత్తికేంద్రాల ద్వారా తాబేళ్లను అభివృద్ధి చేస్తారు. ఈ ప్రక్రియకు ట్రీ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ సహకరిస్తోంది. ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెట్టిన గుడ్లును సురక్షిత ప్రాంతాల్లో ఉంచి 25మంది కాపలాదారులను నియమించారు. 

చంపినా, తిన్నా నేరమే 
తాబేళ్లను వేటాడి చంపినా, వాటి గుడ్లను తిన్నా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి మూడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఇవి గుడ్లు పెట్టే సమయంలో తీరం వెంబడి 500 మీటర్ల పరిధిలో పర్యావరణానికి హాని కలిగించే పనులు చేపట్టకూడదు.   

పర్యావరణ పరిరక్షణకు ఏం చేస్తాయంటే?         
తాబేళ్లు సముద్రంలోని పాచి, మొక్కలు, వివిధ రకాల వ్యర్థ పదార్థాలను తింటూ జలాలు కలుషితం కాకుండా చేస్తాయి. దీంతో తీరప్రాంతాల్లో నివశించే ప్రజలకు సముద్రపు గాలి సోకడం వల్ల అంటు వ్యాధులు రావని అధికారులు చెబుతున్నారు.సముద్రంలో ఆక్సిజన్‌ పెంచేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. అడ్డదిడ్డంగా ఉండే సీ గ్రాస్‌ను తాబేళ్లు తినడంతో సీ గ్రాస్‌ బెడ్‌ ఏర్పడుతుంది. దీంతో సముద్రంలో ఉన్న జీవరాశులు బెడ్‌పై గుడ్లు పెట్టి సంతాన ఉత్పత్తి చేస్తాయి. ఈ మేరకు మత్స్య సంపద పెరుగుతుంది.   

ఇదీ ప్రత్యేకత 
ఆలివ్‌రిడ్లే సుమారు  45 కిలోల బరువు, మూడడుగుల పొడవు, ఒకటిన్నర అడుగు వెడల్పు ఉంటుంది. పుట్టిన పిల్ల మూడు సెంటీమీటర్ల పొడవు, అరంగుళం వెడల్పు ఉంటుంది. ఆడ తాబేలు ఒడ్డుకు వచ్చి 60 నుంచి 150   వరకు గుడ్లు పెడుతుంది. మగ తాబేలు 25–30 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆడ తాబేలు 30–32 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే బయటకు వస్తాయి. ఆడ తాబేళ్లు పిల్లలుగా ఉన్నప్పుడు ఏ తీరం నుంచి సముద్రంలోకి వెళ్తాయో పెద్దయ్యాక అదే తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. తాబేలు 300 నుంచి  400 సంవత్సరాల వరకు జీవిస్తుంది.  

ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు 
ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆలివ్‌రిడ్లేలను సంరక్షించే బాధ్యతను తీసుకున్నాం. తాబేళ్ల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. భోగాపురం, పూసపాటిరేగ మండలంలోని సముద్ర తీర ప్రాంతంలో 1,69,509 గుడ్లను సేకరించి పునరుత్పత్తి కేంద్రాల ద్వారా 1,38,738 పిల్లలను ఉత్పత్తిచేసి సముద్రంలో విడిచిపెట్టాం. కాంపా బయోడైవర్సిటీ స్కీం ద్వారా వచ్చిన నిధులతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం.
– ఎస్‌ వెంకటేష్, జిల్లా అటవీఅధికారి, విజయనగరం  

మరిన్ని వార్తలు