ప్రగతి బాటలో ‘పల్లె’విస్తున్నాయ్‌

9 Feb, 2021 05:51 IST|Sakshi
నాడు – నేడు పనులతో సుందరంగా రూపుదిద్దుకున్న రాజమహేంద్రవరం రూరల్‌ మండలం శాటిలైట్‌సిటి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల

గ్రామాల ముంగిట్లోనే అందుతున్న పాలన

రూ.1,739.64 కోట్లతో అభివృద్ధి పనులు

సకాలంలో దరిచేరుతున్న సంక్షేమం

హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు  

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఏడాదిన్నర వైఎస్సార్‌ సీపీ పాలన పల్లెల ప్రగతికి బాటలు వేసింది. తూర్పు గోదావరి జిల్లాలోని పల్లెలు చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రీతిలో బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం దిశగా పయనిస్తున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచిన పల్లెల ముంగిటకే పాలన చేరడంతో గ్రామస్తుల గుండెల నిండా సంతోషం కనిపిస్తోంది. ఒకప్పుడు ఏదైనా చిన్న సమస్య పరిష్కారం కావాలంటే కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుంతో కూడా తెలియని దుస్థితి ఉండేది. ఇప్పుడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏదైనా సమస్యపై దరఖాస్తు ఇస్తే నిర్దేశించిన గడువులోపే.. అది కూడా పల్లె పొలిమేర దాటకుండానే పరిష్కారం లభిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ కార్యక్రమాలను నూరు శాతం పూర్తి చేస్తుండటంతో పల్లె ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

ఓ వైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధి
రాష్ట్ర విభజనకు పూర్వం.. విభజన తరువాత కూడా రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాగా ఉన్న తూర్పు గోదావరిలో సంక్షేమం, అభివృద్ధి పూర్తిస్థాయిలో గ్రామాల చెంత చేరుతున్నాయి. గ్రామ సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు కావడంతో సమయానికి సమయం, డబ్బుకు డబ్బు ఆదా అవుతుండటం శుభపరిణామమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అన్నిరకాల సేవలూ ప్రతి గుమ్మం ముంగిటకే చేరుతున్నాయి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు, నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల స్వరూపమే మారిపోయింది. ఏ గ్రామంలో చూసినా సంక్షేమం వాయువేగంతో పరుగులు పెడుతోంది. మొత్తంగా జిల్లాలోని గ్రామాల్లో రూ.1,739.64 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి.

రైతు ముంగిటకే సేవలు
రైతులకు గ్రామాల్లోనే అన్ని సేవలూ అందించాలనే లక్ష్యంతో రూ.264.33 కోట్లతో జిల్లాలో 1,129 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటికి పక్కా భవనాల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. గతంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కావాలంటే రైతులు మండల కేంద్రాలకు వెళ్లి గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వీటివల్ల 7.50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. జిల్లాలో 1,054 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. ఒక్కో భవనానికి రూ.17.50 లక్షల చొప్పున రూ.184.45 కోట్లు వెచ్చిస్తున్నారు. దీంతో ప్రజలకు ఇంటి ముంగిటకే మంచి వైద్యం అందుబాటులోకి వస్తోంది. జిల్లాలో 914 అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి స్థల సేకరణ పూర్తయింది. ఒక్కో భవనానికి రూ.7 లక్షల చొప్పున రూ.63.98 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

పనులు వేగంగా జరుగుతున్నాయి
సచివాలయ, రైతుభరోసా, హెల్త్‌ క్లినిక్, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు వేగవంతం చేశాం. ఈ పనులపై జిల్లా అధికారులు ఎప్పటికప్పడు సమీక్షిస్తూ పర్యవేక్షిస్తున్నారు. పలు ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తి కావస్తుండగా, మరికొన్ని వివిధ దశల్లో  ఉన్నాయి.
– ఎం.నాగరాజు, ఎస్‌ఈ, పంచాయతీరాజ్, తూర్పు గోదావరి జిల్లా

పార్టీల్లేవు.. కుల, మతాలూ లేవు
గ్రామ సచివాలయ వ్యవస్థ జిల్లాకు మణిహారంలా నిలిచింది. ప్రతి పల్లెలో ఏర్పాటైన సచివాలయం ద్వారా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ 576కు పైగా సేవలు అందుతుండటం విశేషం. ప్రజలకు సచివాలయ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులు, గ్రామ వలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు దగ్గరవడంతో సేవలు కూడా సంతృప్తికర స్థాయిలో నూరు శాతం అందుతున్నాయి. ముఖ్యమంత్రి మానస పుత్రికగా ఆవిష్కృతమైన సచివాలయ వ్యవస్థకు సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కరప నుంచి శ్రీకారం చుట్టడం విశేషం. ఒక్కో సచివాలయ భవనానికి గరిష్టంగా రూ.40 లక్షలు వెచ్చిస్తున్నారు. జిల్లాలో 1,248 గ్రామ సచివాలయాలకు పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. ఇందుకు రూ.468.12 కోట్లు వెచ్చిస్తుండగా.. పనులు చురుగ్గా  జరుగుతున్నాయి.
రాజానగరం మండలం చక్రద్వారబంధంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం 

పక్కా రోడ్డు.. సీసీ డ్రైన్లు
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 3 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణాన్ని పంచాయతీరాజ్‌ శాఖ చేపడుతోంది. 1,700 రహదారులను రూ.661 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే 700 రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఉపాధి హామీ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలు, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే 1,246 రహదారులను రూ.12.96 కోట్లతో చేపడుతున్నారు. 7,241 పక్కా రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణాలను రూ.84.80 లక్షలతో చేపట్టారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు