ఒకే వేదికపైకి  వంద విదేశీ వర్సిటీలు 

30 Sep, 2020 04:50 IST|Sakshi

అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సు 

సీఎం సూచనలతో ప్రత్యేక చర్యలు చేపట్టిన ఉన్నత విద్యాశాఖ 

సాక్షి, అమరావతి: విద్యార్థులకు అత్యుత్తమ విద్యావకాశాలను కల్పించే దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో వినూత్న ప్రయత్నం చేపడుతోంది. విదేశాల్లో చదువుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం ఒకేసారి అమెరికాలోని 100 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలను తొలిసారి ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. ఆన్‌లైన్‌ సదస్సు ద్వారా అమెరికాలో విద్యాభ్యాస అవకాశాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు, గుర్తింపు తదితర అనేక అంశాలపై విశ్వ విద్యాలయాల అధికారులు విద్యార్థులకు నేరుగా సమాచారం అందిస్తారు. రాష్ట్రంలో విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ నేతృత్వంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి డాక్టర్‌ ఎం.హరికృష్ణ ఇతర ఉన్నతాధికారులు విదేశీ విద్యావకాశాలు కల్పించే దిశగా పలు చర్యలు చేపట్టారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల కోసం అమెరికాలోని విశ్వవిద్యాలయాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి మన రాష్ట్ర విద్యార్థులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్యా విభాగం ద్వారా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని ఆ విభాగం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కుమార్‌ అన్నవరపు తెలిపారు.  

► ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ నిర్వహించే వార్షిక యూఎస్‌ యూనివర్సిటీ ఫెయిర్‌ను ఈసారి ఆన్‌లైన్‌ సదస్సుగా నిర్వహించాలని నిర్ణయించింది. 
► ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్, అమెరికా వర్సిటీలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. 
► అమెరికాలో డిగ్రీ, మాస్టర్స్, పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరం. 
► అమెరికాలోని అకడమిక్‌ కార్యక్రమాలు, విద్యార్థులకు ఆర్థిక సహకారం, ఆ సంస్థలకు దరఖాస్తు విధానం తదితర అంశాలపై ఆ వర్సిటీల అధికారులు వివరిస్తారు. 
► ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ.. అమెరికా ఉన్నత విద్యకు సంబంధించిన అధికారిక సంస్థ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 425 అంతర్జాతీయ విద్యార్థి సలహా కేంద్రాలను నిర్వహిస్తోంది. 

ఈ లింక్‌ ద్వారా పాల్గొనవచ్చు 
► గ్రాడ్యుయేట్‌ ఫెయిర్‌ (మాస్టర్, పీహెచ్‌డీ కార్యక్రమాలు) అక్టోబర్‌ 2, 3 తేదీల్లో సాయంత్రం 5.30 నుంచి రాత్రి 10.30 వరకు. దీనికోసం ‘ bit.ly/EdUSAFair20-Bmail' ’ లింక్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు. 
► అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఫెయిర్‌ (అసోసియేట్‌ అండ్‌ బ్యాచిలర్స్‌ ప్రోగ్రామ్స్‌) అక్టోబర్‌ 9, 10 తేదీల్లో సాయంత్రం 5:30 నుంచి 10:30 గంటల వరకు. దీని కోసం   "bit.ly/UGEdUSAFair20&Bmail' ద్వారా నమోదు చేసుకోవాలి. 
► ఇతర వివరాలకోసం ‘educationalcoordinator20@gmail.com లేదా ‘usiefhyderabad@usief.org.in’ మెయిల్‌ ఐడీ ద్వారా సంప్రదించవచ్చని కుమార్‌ అన్నవరపు తెలిపారు.

మరిన్ని వార్తలు