నెలన్నరలో ఉద్యోగులకు వందశాతం టీకాలు

26 Apr, 2021 03:27 IST|Sakshi

ఆర్టీసీ కార్యాచరణ

నేటి నుంచి డిపోల్లో టీకాల కార్యక్రమం

సాక్షి, అమరావతి: ఉద్యోగులు, సిబ్బందికి పూర్తిగా కరోనా వ్యాక్సిన్లు వేయించేందుకు ఆర్టీసీ యాజమాన్యం కార్యాచరణ చేపట్టింది. అందుకోసం ఆర్టీసీ డిపోల్లో సోమవారం నుంచి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మొదలుపెడుతోంది. రోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే తమ డ్రైవర్లు, కండక్టర్లు, అందుకు సహకరించే ఇతర సిబ్బందికి వెంటనే కరోనా టీకాలు వేసే ప్రక్రియ చేపట్టింది.

ఆర్టీసీలో మొత్తం 51,500 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఇప్పటివరకు 8,117 మంది అంటే 16 శాతం టీకాలు వేయించుకున్నారు. ఇంకా 43,383 మందికి టీకాలు వేయాలి. అందుకు ఉద్యోగుల కోసం ఆర్టీసీ డిపోల్లో ప్రత్యేక కేంద్రాల ద్వారా సోమవారం నుంచి ప్రత్యేకంగా టీకాలు వేసే ప్రక్రియ మొదలుపెడుతున్నారు. అందుకోసం జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఏర్పాట్లు చేశారు. మొదటి డోసుకు రెండో డోసుకు మధ్య కనీసం నాలుగువారాల వ్యవధి ఉండాలి. కాబట్టి మొత్తం ఉద్యోగులు, సిబ్బంది అందరికీ నెలన్నరలో రెండో డోసుల టీకాలు వేయడం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.  

మరిన్ని వార్తలు