CM YS Jagan: ఉద్యోగాల కల్పన ఓ రికార్డు

26 Jun, 2022 07:58 IST|Sakshi

రాష్ట్రంలో సచివాలయాల ఏర్పాటు, ఉద్యోగాల భర్తీ ఓ చరిత్ర

అధికారంలోకి వచ్చిన వెంటనే 1.34 లక్షల ఉద్యోగాల సృష్టి

నాలుగు నెలల వ్యవధిలోనే నియామక ప్రక్రియ పూర్తి

తొలి విడత జరిగిన పరీక్షలకు దాదాపు 20 లక్షల మంది హాజరు

అక్రమాలు, అవకతవకలకు తావు లేకుండా సజావుగా పరీక్షల నిర్వహణ\

మిగిలి పోయిన పోస్టులకు మరుసటి ఏడాదే మరో విడత నోటిఫికేషన్‌

అప్పట్లో తొలి విడత ఉద్యోగాలు పొందిన వారికి ఇప్పుడు ప్రొబేషన్‌ ఖరారు

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ ఖరారు చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో అరుదైన రికార్డు నమోదు చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసిన వైఎస్‌ జగన్‌.. ఆయా సచివాలయాల్లో ఒకేసారి ఏకంగా 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారు. అదో రికార్డు. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేసి మరో రికార్డు నెలకొల్పారు.

2019లో జూలై – అక్టోబర్‌ మధ్య జరిగిన ఈ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర వ్యాప్తంగా 21.69 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకొని, 19,50,630 మంది రాత పరీక్షలకు హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్రాల చరిత్రలో ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయడం గానీ, ఇంత భారీగా అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడం, పరీక్షలు నిర్వహించడం జరగలేదని అధికార వర్గాలు వివరించాయి. ఇంత మంది అభ్యర్థులకు కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఎటువంటి తప్పులకు తావులేకుండా అప్పట్లో ప్రభుత్వం సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించడం కూడా ఓ రికార్డే. 

రాత పరీక్ష మెరిట్‌ ఆధారంగానే నియామకాలు
1.34 లక్షల ఉద్యోగాల భర్తీలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా కేవలం అభ్యర్థులు రాత పరీక్షల్లో తెచ్చుకున్న మెరిట్‌ మార్కుల ఆధారంగానే నియామక ప్రక్రియ జరిగింది. అవినీతికి ఆస్కారం ఉండకూడదని ఈ నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూల విధానానికి సైతం ప్రభుత్వం స్వస్తి పలికింది. 

సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు విడతలుగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2019 జూలైలో తొలి విడత నోటిíఫికేషన్‌ జారీ చేసి, సెప్టెంబర్‌లో రాత పరీక్షలు నిర్వహించింది. అందులో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా జిల్లాల వారీగా జిల్లా సెలక్షన్‌ కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యంలో కలెక్టర్ల పర్యవేక్షణలో నియామక ప్రక్రియ నిర్వహించింది.

తొలి విడతలో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టులను భర్తీ చేసేందుకు 2020 జనవరిలో ప్రభుత్వం రెండో విడత నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ తర్వాత కరోనా కారణంగా 2020 సెప్టెంబర్‌లో రాత పరీక్షలు నిర్వహించి, ఆ వెంటనే నియామక ప్రక్రియను చేపట్టి, 2021 జనవరి నాటికి పూర్తి చేసింది. 

సచివాలయాల్లో పని చేసేందుకు ఎనర్జీ అసిస్టెంట్‌ ఉద్యోగాలను మరో 8 వేల దాకా కొత్తగా సృష్టించి, వాటిని విద్యుత్‌ సంస్థల ద్వారా వేరుగా భర్తీ చేశారు. 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తొలుత కొత్తగా సృష్టించిన ప్రభుత్వ ఉద్యోగాలు: 1.34 లక్షలు
విద్యుత్‌ శాఖ ద్వారా భర్తీ చేసిన ఎనర్జీ అసిస్టెంట్లు కాకుండా మిగిలిన కేటగిరి పోస్టులు: 1,26,728
2019లో తొలి విడత నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ అయినవి : 1,05,869
2020–21 మధ్య రెండో విడత నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ అయినవి: 13,136
రెండు విడతల నోటిఫికేషన్‌ తర్వాత ఖాళీగా ఉన్నవి: 8,529
తొలి విడత నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగాలు పొంది, రెండేళ్లు సర్వీసు పూర్తి చేసుకొని.. డిపార్ట్‌మెంట్‌ టెస్టు పాసైన వారికి ప్రభుత్వం ప్రొబేషన్‌ ఖరారు చేసింది. మొత్తంగా 90 శాతం మంది ప్రొబేషన్‌కు అర్హత సాధించారని అధికారులు తెలిపారు.
రెండో విడత నోటిఫికేషన్‌లో ఉద్యోగాలు పొందిన వారికి ఇంకా రెండేళ్ల సర్వీసు పూర్తి కాలేదు.  

మరిన్ని వార్తలు