‘వన్‌ స్టేషన్‌.. వన్‌ ప్రొడక్ట్‌’: రైల్వేస్టేషన్లలో ‘స్థానిక’ స్టాల్స్‌ 

24 Aug, 2022 08:13 IST|Sakshi

ప్రతి రైల్వే స్టేషన్‌లో స్థానిక ఉత్పత్తుల విక్రయం 

సాక్షి, అమరావతి:  తిరుపతికి వచ్చిన భక్తులు తిరిగి వెళ్తూ శ్రీవారి లడ్డూలతో పాటు రైల్వే స్టేషన్లో శ్రీకాళహస్తి కలంకారీ చేనేతలూ కొని ఇంటికి పట్టుకెళ్లచ్చు.. విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు అక్కడే ముచ్చటైన కొండపల్లి బొమ్మలూ కొనచ్చు..  

ఇలా.. రైల్వే స్టేషన్లు ప్రయాణానికే కాదు.. స్థానిక ఉత్పత్తుల మార్కెటింగ్‌కూ వేదికగా నిలవనున్నాయి. ‘వన్‌ స్టేషన్‌ – వన్‌ ప్రొడక్ట్‌’ విధానంతో స్థానిక ఉత్పత్తుల విక్రయాలకు ప్రోత్సాహం అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందుకోసం అహ్మదాబాద్‌లోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్స్‌’ సంస్థ స్టాల్స్‌ను రూపొందించింది. తక్కువ స్థలంలో ఉత్పత్తులను ప్రదర్శించేలా స్టాల్స్‌ను డిజైన్‌ చేసింది. ఉత్పత్తుల విక్రయాలకు స్థానిక డ్వాక్రా సంఘాలు, ఇతర హస్తకళా ఉత్పత్తుల తయారీదారులతో రైల్వే శాఖ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. 

ఏపీలో 91 రైల్వే స్టేషన్లలో స్టాల్స్‌ 
‘వన్‌ స్టేషన్‌ – వన్‌ ప్రొడక్డ్‌’ విధానం కింద రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్‌ పరిధిలో 91 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసింది. ప్రధానంగా చేనేత వస్త్రాలు, హస్తకళలు, గిరిజన ఉత్పత్తులు, స్థానిక ఆహార ఉత్పత్తులకు ప్రాధాన్యమిస్తోంది. దక్షిణ భారత దేశంలోనే పైలట్‌ ప్రాజెక్ట్‌గా రోజూ సగటున 30 వేల మంది వచ్చే తిరుపతి రైల్వే స్టేషన్‌లో శ్రీకాళహస్తి కలంకారీ చేనేతలను విక్రయిస్తోంది. ఈ స్టాల్‌కు విశేష స్పందన వస్తోంది. దాంతో మిగిలిన 90 స్టేషన్లలో కూడా దశలవారీగా స్టాల్స్‌ ఏర్పాటు చేస్తోంది. మొదటి దశలో సెప్టెంబరు 20 నాటికి 20 స్టేషన్లలో స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తోంది. వీటిలో 10 స్టేషన్లలో ఇప్పటికే స్టాల్స్‌ ఏర్పాటు పూర్తయింది. 

స్థానిక వెండార్లకు రైళ్లలో విక్రయాలకు అనుమతి 
ప్రయాణిస్తున్న రైళ్లలో ఆహార పదార్థాలు, ఇతర ఉత్పత్తులను విక్రయించే చిరు వ్యాపారుల కోసం రైల్వే శాఖ కొత్త నిబంధనను అమల్లోకి తెస్తోంది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ అనుమతి ఉన్న వ్యాపారులను మాత్రమే రైళ్లలో అనుమతిస్తున్నారు. పలువురు చిరు వ్యాపారులు అనధికారికంగా రైళ్లలో ప్రవేశించి వారి ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. వారిని నిరోధించడం సమస్యగా మారింది. భద్రతాపరమైన సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. దీనికి పరిష్కారంగా వారికి కూడా లైసెన్సు ఇవ్వాలని నిర్ణయించింది. రూ.1,500 ఫీజుతో 15 రోజులకు లైసెన్స్‌ జారీ చేస్తుంది. ఈ వెండార్లు వారికి నిర్దేశించిన స్టేషన్ల మధ్య రైళ్లలో ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. వీరి కోసం ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్స్‌’ సంస్థ ప్రత్యేకంగా బాడీవేర్‌ కిట్లను డిజైన్‌ చేసింది. తక్కువ స్థలంలోనే ఆహార పదార్థాలు, ఇతర ఉత్పత్తులను రెండు ర్యాకుల్లో భుజానికి తగిలించుకునే తేలికైన కిట్‌ను రూపొందించింది. లైసెన్సు పొందిన వెండార్లకు వాటిని అందిస్తారు.  

మరిన్ని వార్తలు