ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఓటీఎస్‌

16 Mar, 2022 04:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: దళితులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయం మేరకు వైఎస్సార్‌ బడుగు వికాసం పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం తాజాగా దళిత పారిశ్రామికవేత్తలకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. 2008–2020 మధ్య ఏపీఐఐసీ ద్వారా భూములు పొంది వివిధ కారణాల వల్ల పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోయిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఓటీఎస్‌ పథకాన్ని అమలు చేస్తోంది.

దళిత పారిశ్రామికవేత్తలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీఐఐసీ చైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి కోరారు. గతంలో పదేళ్లపాటు భూమిని లీజుకు కేటాయించడం వల్ల రుణ మంజూరు సమస్యలు తలెత్తి చాలామంది యూనిట్లు ఏర్పాటు చేసుకోలేకపోయిన విషయం ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో ఆయన ఆదేశాల మేరకు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు భూములను పునరుద్ధరిస్తూ జీవో నంబర్‌–7 విడుదల చేసినట్లు తెలిపారు.

తాజా నిర్ణయంతో మరింత మేలు
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మరింత మేలు చేసే దిశగా ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యం జవ్వాది వెల్లడించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పదేళ్లుగా ప్రాజెక్టులో ఎటువంటి పురోగతి లేకపోవడం, నిర్ణీత సమయంలో బ్యాంకుల నుంచి రుణాలు అందకపోవడం, ప్రభుత్వపరంగా తలెత్తిన సమస్యల పరిష్కారంలో జాప్యం, చెల్లింపులు, జరిమానాలు కట్టలేని పరిస్థితుల్లో కూరుకుపోవడం వంటి కారణాలతో పారిశ్రామికవేత్తలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ప్లాట్లు పొంది రిజిస్ట్రేషన్లు చేసుకోకపోయినా,  నగదు చెల్లించకపోయినా, తమ ప్లాటును, నగదును వెనక్కి తీసుకున్నా, ప్లాటు రద్దయినా మార్చి 31వ తేదీలోగా జిల్లాల వారీగా ఏపీఐఐసీ కార్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు వ్యక్తిగత దరఖాస్తులను నమోదు చేసుకోవాలన్నారు. లబ్ధిదారులు ప్లాట్లు పొందిన నాటి ధరలను వర్తింపజేయడమే కాకుండా ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నగదు చెల్లించుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తున్నట్లు ఎండీ పేర్కొన్నారు.

ఓటీఎస్‌ వర్తింపు ఇలా..
ఓటీఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు తిరిగి భూములను కేటాయించి అందుకు సంబంధించిన లెటర్లు ఇస్తారు. సంబంధిత మొత్తాలను 3 నెలల్లోపు వడ్డీ లేకుండా చెల్లించవచ్చు. 91వ రోజు నుంచి 180 (3 నెలలు దాటి 6 నెలల లోపు) రోజుల వరకూ 4 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. 181వ రోజు నుంచి రెండేళ్ల వరకూ 8 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు