కేజీ బేసిన్‌కు నాలుగు కొత్త రిగ్గులు..

4 Apr, 2022 09:31 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు: కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్‌ పరిధిలో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లోని చమురు నిక్షేపాల వెలికితీతకు ప్రభుత్వ ఆయిల్‌ రంగ దిగ్గజం ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్జీసీ) లిమిటెడ్‌ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా గుర్తించిన బావుల నుంచి గ్యాస్, చమురు వెలికితీయడానికి ఇటలీ టెక్నాలజీ రిగ్గులను వినియోగిస్తోంది. దేశం వ్యాప్తంగా ఉపయోగించడానికి 47 రిగ్గులను ఇటలీ నుంచి కొనుగోలు చేసిన ఓఎన్జీసీ అందులో నాలుగింటిని నరసాపురం, రాజమహేంద్రవరం కేంద్రాలుగా కార్యకలాపాలు సాగుతున్న కేజీ బేసిన్‌కు కేటాయించింది.

తొలివిడతగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దెయ్యాలతిప్ప వద్ద ఇటలీ టెక్నాలజీ రిగ్గును ఇటీవల ప్రవేశపెట్టారు. మరో రిగ్గును కొద్ది రోజుల్లో భీమవరం సమీపంలోని వేండ్రలో లాంచ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా కేజీ బేసిన్‌లో ఓఎన్జీసీ చమురు నిక్షేపాల కోసం తవ్వకాలను పాత యంత్రాలతోనే కొనసాగిస్తోంది. డ్రిల్లింగ్‌ సమయంలో బాంబింగ్‌ కూడా చేస్తారు. దీంతో ప్రమాదాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. పైప్‌లైన్లలో లీకేజీలతో బ్లోఅవుట్‌లు సంభవిస్తున్నాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టడానికి ఓఎన్జీసీ ఇటలీ టెక్నాలజీ రిగ్గులను వినియోగంలోకి తెచ్చింది. 

నాలుగు దశాబ్దాలుగా కార్యకలాపాలు..
నాలుగు దశాబ్దాలుగా నరసాపురం టెంపుల్‌ ల్యాండ్‌ కేంద్రంగా ఓఎన్జీసీ కార్యకలాపాలు సాగుతున్నాయి. తరువాత కాలంలో రాజమహేంద్రవరంలో ఆ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. చమురు నిక్షేపాల వెలికితీతకు సంబంధించిన యంత్రసామగ్రి మొత్తం నరసాపురం టెంపుల్‌ ల్యాండ్‌లోనే ఉంటుంది. నరసాపురం ప్రాంతంలో 40 ఏళ్లుగా అపారంగా గ్యాస్‌ నిక్షేపాలు ఇస్తున్న బావులు ఖాళీ అవ్వడంతో ఓఎన్జీసీ రెండేళ్ల నుంచి జిల్లాలో గ్యాస్‌ నిక్షేపాల కోసం పలు ప్రాంతాల్లో విస్తృతంగా సర్వే చేసింది. మార్టేరు, పెనుగొండ, మొగల్తూరు మండలం ఆకెనవారితోట, భీమవరం సమీపంలోని దెయ్యాలతిప్ప, మహదేవపట్నం, వేండ్ర ప్రాంతాల్లో కొత్త బావులను గుర్తించింది. కొత్తగా గుర్తించిన బావుల్లో వినియోగించేందుకు ఇటలీ టెక్నాలజీ రిగ్గులు కొనుగోలు చేసింది.

చమురు, గ్యాస్‌ ఉత్పత్తిలో పశ్చిమదే అగ్రస్థానం
కేజీ బేసిన్‌లో ఓఎన్జీసీ రోజుకు 33 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్, 900 టన్నుల ఆయిల్‌ను వెలికితీస్తోంది. ఇందులో పశ్చిమగోదావరి జిల్లా నుంచే 10 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్, 600 టన్నుల ఆయిల్‌ వస్తోంది. సంస్థ ఉత్పత్తిలో ఇప్పటివరకు జిల్లాదే అగ్రస్థానం. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలోని కవిటం, నాగిడిపాలెం, ఎస్‌–1 విశిష్ట బ్లాక్, 98–2 ప్రాజెక్ట్‌లోను, తూర్పుగోదావరి జిల్లా కేసనపల్లి, కృష్ణాజిల్లా బంటుమిల్లి, నాగాయలంక ప్రాంతాల్లోను కొత్తగా చేపట్టిన అన్వేషణ పూర్తయింది. ఈ కొత్త బావుల నుంచి త్వరలో ఉత్పత్తి ప్రారంభించనుంది. కొత్త బావుల్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ఎక్కువ ఉత్పత్తి రాబోతోంది. వచ్చే ఏడాది నుంచి కేజీ బేసిన్‌లో రోజుకు 40 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్, 1,400 టన్నుల ఆయిల్‌ ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే దాదాపు 25 శాతం ఉత్పత్తి పెంచాలన్నది లక్ష్యం.

సముద్రగర్భం నుంచి గ్యాస్‌..
1974లో మొదటిసారిగా నరసాపురంలో ఓఎన్జీసీ చమురు నిక్షేపాలను గుర్తించింది. అప్పటి నుంచి కేవలం ఆన్‌ షోర్‌పైనే సంస్థ దృష్టి పెట్టింది. 10 ఏళ్ల కిందట నుంచి రిలయన్స్, గెయిల్‌ వంటి సంస్థలు రంగప్రవేశం చేసి ఆఫ్‌ షోర్‌ (సముద్రగర్భం)లో డ్రిల్లింగ్‌ ముమ్మరం చేయడంతో ఆ దిశగా కూడా ఓఎన్జీసీ దూకుడు పెంచింది. 2006 నుంచి సముద్రగర్భంలో అన్వేషణ ప్రారంభించింది. ప్రస్తుతం నరసాపురం నుంచి కాకినాడ వరకు సముద్రగర్భంలో అన్వేషిస్తోంది. నరసాపురం మండలం చినమైనవానిలంక తీరానికి సమీపంలో ఆఫ్‌ షోర్‌లో గ్యాస్‌ వెలికితీత ఇప్పటికే ప్రారంభమైంది. గ్యాస్‌ వెలికితీతలో మూడేళ్ల నుంచి ఓఎన్జీసీ దేశంలో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది.

మరిన్ని వార్తలు