ఆక్వా చెరువుల్లోకి ఓఎన్‌జీసీ వ్యర్థాలు

1 Mar, 2021 04:33 IST|Sakshi
వ్యర్థ జలాల వల్ల చెరువుల్లో చేపలు తేలియాడుతున్న దృశ్యం

తూర్పు గోదావరిలో చేపలు, రొయ్యలు మృత్యువాత 

దాదాపు 60 ఎకరాలకు కలుషిత జలాలు సరఫరా 

గోపవరం జీజీఎస్‌ వద్ద రైతుల ధర్నా 

ఉన్నతాధికారుల జోక్యంతో ఆందోళన విరమణ 

ఉప్పలగుప్తం: తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి పంచాయతీ జగ్గరాజుపేటలోని జీఎంఏఏ ఓఎన్‌జీసీ సైట్‌ నుంచి వెలువడిన వ్యర్థ జలాలు పంట కాలువలో చేరి ఆక్వా, చేపల చెరువులకు తీవ్ర నష్టం వాటిల్లటంతో రైతులు ఆదివారం ఉదయం ఆందోళన చేపట్టారు. ఓఎన్‌జీసీ సైట్‌కు వెళ్లే ఉద్యోగులను అడ్డుకుని ధర్నా నిర్వహించారు. గోపవరం గ్యాదరింగ్‌ స్టేషన్‌ (జీజీఎస్‌)గా వ్యవహరించే ఈ సైట్‌లో ముడిచమురుతో వచ్చే వ్యర్థ జలాలను సెపరేటర్ల ద్వారా శుద్ధి ప్లాంటుకు తరలిస్తారు. రెండు మూడు రోజులుగా వ్యర్థ జలాలు పంట కాలువలోకి చేరుతున్నాయి. శనివారం రాత్రి లీకేజీ ఎక్కువ కావడంతో కాలువ నిండా వ్యర్థ జలాలు చేరాయి. ఈ విషయం తెలియని ఆక్వా రైతులు కాలువలోని నీటిని చెరువుల్లోకి తోడారు.

సుమారు 3 వందల ఎకరాల ఆయకట్టున్న ప్రాంతంలో 50 నుంచి 60 ఎకరాలకు ఇంజన్లతో ఆ నీటిని తోడారు. దీంతో పలు చెరువుల్లో చేపలు చనిపోయి పైకి తేలగా రొయ్యలు మృత్యువాత పడి అడుగు భాగానికి చేరినట్లు గుర్తించారు. దీంతో రైతులు అల్లూరి రమేష్‌రాజు, సామంతకూరి జగన్‌రాజు తదితరులు స్థానిక నాయకుడు ఇసుకపట్ల రఘుబాబు ఆధ్వర్యంలో జగ్గరాజుపేటలో ధర్నాకు దిగారు. ఎకరాకు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ఆమేరకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చల్లపల్లి సర్పంచ్‌ ఇసుకపట్ల జయమణి ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో వినతిపత్రాన్ని అందించారు. ఓఎన్‌జీసీ ఇన్‌స్టలేషన్‌ మేనేజర్‌ (ఐఎం) పి.జగన్నాథరావు అక్కడకు చేరుకుని వారితో  చర్చించారు. సాంకేతిక బృందం నివేదిక మేరకు పరిహారం అందజేస్తామని చెప్పారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు