ఆస్పత్రుల్లో కొనసాగుతున్న సీఐడీ సోదాలు

13 Apr, 2021 05:24 IST|Sakshi

సాక్షి, అమరావతి/కల్యాణదుర్గం టౌన్‌: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన వైద్య పరికరాల నిర్వహణ స్కామ్‌పై సీఐడీ దర్యాప్తు సోమవారం కూడా కొనసాగింది. గత సర్కార్‌ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య ఉపకరణాల నిర్వహణ కాంట్రాక్టులో జరిగిన స్కామ్‌పై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రాథమిక వివరాలు సేకరించిన సీఐడీ ఆస్పత్రుల వారీగా వైద్య పరికరాల వివరాలను లెక్కతేల్చేందుకు ఈ నెల 10న రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 1,315 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూడు రోజులుగా సోదాలు చేపట్టింది.

రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 42 ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రితోపాటు అదే జిల్లాలోని అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ సీఐడీ బృందాలు సోదాలు కొనసాగించాయి. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంతోపాటు పలు ఆస్పత్రుల్లోనూ తనిఖీలు చేపట్టాయి. 2015 నుంచి 2018 వరకు ప్రభుత్వం కొనుగోలు చేసిన వైద్య పరికరాలు, అప్పటికే ఉన్న పరికరాలు, వాటి విలువ, పనితీరు, నిర్వహణ చార్జీల పేరుతో చెల్లించిన మొత్తాలపై ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వైద్య పరికరాలకు చెందిన రికార్డులను కూడా పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు