రైతుల్లో ‘ఈ–నామ్‌’ సంతోషం

26 Nov, 2021 16:42 IST|Sakshi

కర్నూలు మార్కెట్‌ యార్డులో విజయవంతంగా ఉల్లి క్రయవిక్రయాలు

తాడేపల్లిగూడెం కంటే మెరుగైన ధరలు

వ్యాపారుల సిండికేట్‌కు చరమగీతం

అన్నదాతకు తప్పిన వ్యయప్రయాసలు

ఇప్పటి వరకు 1.36 లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు

ఒకప్పుడు..ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకొస్తే వ్యాపారులు మోసం చేసేవారు. సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరకు దిగుబడులను కొనుగోలు చేసేవారు. ఈ–నామ్‌ అమలుతో నేడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. రహస్య టెండర్ల ద్వారా పంట కొనుగోళ్లు జరుగుతుండడంతో మంచి ధర లభిస్తోంది. రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.  
  
కర్నూలు(అగ్రికల్చర్‌): దేశంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఉల్లిని ఈ–నామ్‌ పోర్టల్‌లో టెండరు ద్వారా కోనుగోలు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఉల్లి మార్కెట్‌లు ఉన్నాయి. అలాగే హైదరాబాద్‌ మలక్‌పేటలో ఉల్లి మార్కెట్‌ నడుస్తోంది. ఎక్కడా కూడా ఈ–నామ్‌ అమలు కావడం లేదు. దేశంలో మొట్టమొదటి సారిగా ఉల్లిని ఈ–నామ్‌లో కొనుగోలు చేస్తున్న ఏకైక మార్కెట్‌ కర్నూలు కావడం విశేషం.  

అడ్డంకులను అధిగమించి.. 
ఈ–నామ్‌ అమలును మొదట్లో వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు వ్యతిరేకించారు. మార్కెట్‌ బంద్‌ చేసేంత వరకు పరిస్థితి వచ్చింది. అయితే దీని వల్ల ఎవ్వరికీ ఎటువంటి నష్టం ఉండబోదని మార్కెట్‌ కమిటీ అధికారులు అందరినీ ఒప్పించి ఆగస్టు 26వ తేదీన ఈ–నామ్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు రూ.22.16 కోట్ల విలువ చేసే 1.36 లక్షల క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేశారు. నాడు ఈ పద్ధతిని వ్యతిరేకించిన వారు నేడు జై కొడుతున్నారు.  

రహస్య టెండర్‌ విధానంలో.. 
కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గతంలో ఉల్లిని వేలంపాట ద్వారా కొనుగోలు చేసే వారు. ఈ సమయంలో వ్యాపారులు మంచి లాట్ల దగ్గర సిండికేట్‌ అయ్యేవారనే విమర్శలు ఉన్నాయి. వ్యాపారులు సిండికేట్‌ అయి ధరలను అణచివేస్తున్నారని పలుసార్లు రైతులు రోడెక్కి ఆందోళనలు నిర్వహించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ–నామ్‌ అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ విధానంలో ఆన్‌లైన్‌లో రహస్య టెండరు విధానంలో ధర కోట్‌ చేస్తారు. దీంతో వ్యాపారులు సిండికేట్‌ అయ్యే అవకాశం లేదు. ఫలితంగా ఉల్లికి మంచి ధర లభిస్తోంది.  

వంద శాతం అమలు.. 
దేశ వ్యాప్తంగా ఒకే మార్కెట్‌ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఈ–నామ్‌ అమలు చేస్తోంది. జిల్లాలో కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని మార్కెట్‌ కమిటీల్లోనే వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవలి వరకు ఉల్లి మినహా అన్ని పంటలను ఈ–నామ్‌ పోర్టల్‌లోనే కొనుగోలు చేస్తూ వచ్చారు. ఉల్లిని కూడా ఈ విధానంలోకి తేవడంతో 100 శాతం ఈ–నామ్‌ను అమలు చేసినట్లు అయ్యింది.   

మెరుగ్గా ధరలు.
కర్నూలు మార్కెట్‌లో ఈ–నామ్‌ అమలు చేయడం మొదలు పెట్టిన తర్వాత తాడేపల్లిగూడెం కంటే ఇక్కడే ధరలు మెరుగ్గా ఉంటున్నాయి. క్వింటానికి రూ.200 నుంచి రూ.400 వరకు ఎక్కువ ధర లభిస్తోంది. ఇక్కడే మంచి ధర లభిస్తుండటంతో రైతులు తీవ్ర వ్యయ ప్రయాసలకు ఓర్చి తాడేపల్లిగూడేనికి వెళ్లడం లేదు. కర్నూలు మార్కెట్‌లోనే ఉల్లి అమ్ముకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు ఎక్కువే.. 
జిల్లాలో 90 వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతోంది. సగటున ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఈ ప్రకారం ఏటా 36 లక్షల క్వింటాళ్ల ఉల్లి జిల్లాలో పండుతోంది. ఇందులో 20 శాతం వరకు తాడేపల్లిగూడేనికి వెళ్తోంది. మరో 30 శాతం రైతులు పొలం దగ్గరే అమ్ముకుంటున్నారు. 50 శాతం  కర్నూలు మార్కెట్‌కు వస్తోంది. ఈ–నామ్‌ అమలు చేసిన తర్వాత తాడేపల్లిగూడేనికి తగ్గుముఖం పడుతోంది. కర్నూలు మార్కెట్‌కు ప్రతి రోజూ 1,550 క్వింటాళ్ల ఉల్లి వస్తోంది.  తెచ్చిన రోజునే దిగుబడిని అమ్ముకొని రైతులు సంతోషంతో ఇంటికి వెళ్తున్నారు.  

వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది 
గతంలో వేలంపాట నిర్వహించే సమయంలో వ్యాపారులు మంచి లాట్ల దగ్గర సిండికేట్‌ అయ్యేవారు. ఈ–నామ్‌ వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌లో రహస్య పద్ధతిలో కొనుగోలు చేపట్టిన తర్వాత వ్యాపారుల మధ్య పోటీ కనిపిస్తోంది. మార్కెట్‌కు నేను 22 క్వింటాళ్ల ఉల్లి తీసుకొచ్చాను. క్వింటా ధర రూ.2,511 పలికింది. 
– సుంకన్న, గోరంట్ల గ్రామం, కోడుమూరు మండలం 

వచ్చిన రోజే అమ్ముకున్నాం  
గతంలో కర్నూలు మార్కెట్‌ యార్డులో ఉల్లి అమ్ముకోవాలంటే తల ప్రాణం తోకకు వచ్చేది. కనీసం నాలుగు రోజుల సంయం పట్దేది. ఈ–నామ్‌ అమలు చేసిన తర్వాత పంట తెచ్చిన రోజునే అమ్ముకునే అవకాశం ఏర్పడింది. మార్కెట్‌కు 16 క్వింటాళ్ల ఉల్లి తెచ్చాను. నాణ్యత ఒక మోస్తరుగా ఉన్నా క్వింటాలుకు రూ.1,175 ప్రకారం ధర లభించింది.  
– మద్దిలేటి, ఏనుగుబాల, ఎమ్మిగనూరు మండలం

పారదర్శకంగా కొనుగోళ్లు 
ఈ–నామ్‌లో వంద శాతం పారదర్శకంగా ఉల్లి కొనుగోళ్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయానికి ధరలు ప్రకటిస్తున్నారు. వెంటనే కాటా వేయడం మొదలవుతుంది. సాయంత్రానికి రైతులు నగదు తీసుకొని వెళ్లిపోతున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఆన్‌లైన్‌లో వచ్చిన తక్‌పట్టీలను ప్రింట్‌ తీసి ఇస్తున్నాం. తాడేపల్లిగూడెంతో పోలిస్తే కర్నూలు మార్కెట్‌లోనే మంచి ధరలు లభిస్తున్నాయి.  
– జయలక్ష్మి, సెక్రటరీ,కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ

మరిన్ని వార్తలు