రైతుబజార్లలో రూ.40కే కిలో ఉల్లి

23 Oct, 2020 03:47 IST|Sakshi

నేటి నుంచి ఒక్కో కుటుంబానికి కిలో చొప్పున విక్రయం

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు 

కాకినాడ రూరల్‌/కర్నూలు (అగ్రికల్చర్‌): సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రైతుబజార్లలో శుక్రవారం నుంచి కిలో ఉల్లిని రూ.40కే ప్రజలకు అందించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో ఉల్లి పంట దెబ్బతినడంతో మార్కెట్‌లో కిలో ఉల్లిని రూ.80 వరకు విక్రయిస్తున్నారని చెప్పారు. దీంతో ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఉల్లి ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కాకినాడలో గురువారం మంత్రి వివరించారు. 5 వేల టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకునేందుకు నాఫెడ్‌ ద్వారా ఇండెంట్‌ పెట్టామని, అత్యవసరంగా 1,000 టన్నులు దిగుమతి చేసుకుంటున్నామన్నారు.

తొలి దశలో పట్టణ, నగర ప్రాంతాల్లోని రైతుబజార్ల ద్వారా ఒక్కో కుటుంబానికి కిలో చొప్పున ఉల్లిని అందిస్తామన్నారు. కాగా, కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని ఉల్లిని వెంటనే కొనుగోలు చేసి జిల్లాలకు సరఫరా చేయాలని మార్కెటింగ్‌ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తొలుత వంద టన్నుల వరకు కొనుగోలు చేసి కర్నూలు జిల్లా, వైఎస్సార్, అనంతపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సరఫరా చేయాలని సూచించింది. దీంతో కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రోఖియాబీ ఉల్లి కొనుగోలుకు గురువారం శ్రీకారం చుట్టారు. మరోవైపు పొలాల్లోకే వెళ్లి కొనుగోలు చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు