దేవుడి సేవలన్నింటికీ ఆన్‌లైన్‌లో అడ్వాన్స్‌ బుకింగ్‌ 

23 Apr, 2023 05:00 IST|Sakshi

కొత్తగా వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన దేవదాయశాఖ 

ప్రముఖ ఆలయాల్లో గదులు, దర్శన, సేవాటికెట్లు 15–30 రోజుల ముందే ఆన్‌లైన్‌లో..  

ఇప్పటికే 16 ఆలయాల్లో అమలు  

సాక్షి, అమరావతి:  కుటుంబ సమేతంగా అన్న­వ­రం వెళ్లి సత్యనారాయణ స్వామి వ్రతం చేయిం­చుకోవాలని అనుకుంటున్నవారు ఇంతకు ముందులా ఎక్కువగా హైరానా పడా­ల్సిన పనిలేదు. 10–15 రోజుల ముందే వ్రతం టికెట్‌ను ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. శ్రీశైలంలో మల్లికార్జునస్వామి దర్శనానికి వెళ్లాలనుకునే వారు నెలరోజుల ముందే ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి ఆలయం వద్ద దేవదాయశా­ఖ గదులను బుక్‌ చేసుకోవచ్చు.

రాష్ట్రంలో దేవదాయశాఖ పరిధిలో పలు ఆలయాల్లో వివిధ రకాల పూజలు, దర్శన టికెట్లతోపాటు ఆయా ఆలయాల వద్ద నివాసిత గదుల బుకింగ్‌ వంటివన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌ విధానంలోకి తీసుకొచ్చింది. పూజలు, దర్శనం టికెట్లు, వసతి గదులను ఆల­యం వద్దకు వెళ్లి మాత్రమే తీసుకోవాల్సిన ఇబ్బందులు తొలిగిపోయాయి. తాము వెళ్లే తేదీని ముందే నిర్ణయించుకున్న భక్తులు ఇంటివద్ద నుంచే ముందుగానే సేవా టికెట్లను, గదులను బుక్‌ చేసుకోవచ్చు.

తమ పరిధిలోని ప్రముఖ ఆలయాలన్నింటి­లో ఈ తరహా సేవలన్నీ ఉమ్మడిగా ఒకచోట ఆన్‌లైన్‌లో పొందేందుకు దేవదాయ శాఖ కొత్తగా https://www.aptemples.ap.gov.in  వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో కొన్ని ఆలయా­ల్లో కొన్ని రకాల సేవలకు మాత్రమే దేవదాయశాఖ ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ నిర్వహించగా.. ఇప్పుడు మొదటి దశలో 175 ప్రముఖ ఆలయాలన్నింటిలో అన్ని రకాల సేవలను ఈ కొత్త వెబ్‌పోర్టల్‌ ద్వారా భక్తులు ముందస్తుగా పొందేందుకు వీలు కల్పించింది.

సింహాచలం, అన్నవరం, ద్వార­కా తిరుమల, విజయవాడ దుర్గగుడి, పెనుగంచిప్రోలు, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, మహానంది, విశాఖపట్నం శ్రీకనకమహాలక్ష్మి, అంతర్వేది, అరసవెల్లి, మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి, ము­ర­మళ్ల వీరేశ్వరస్వామి, వాడపల్లి వేంకటేశ్వరస్వామి, కసాపురం నెక్కింటి ఆంజనేయస్వామి.. మొత్తం 16 ఆలయాల్లో స్వామి సేవలు, దర్శన టికెట్లు, గదుల కేటాయింపు వంటివన్నీ ముందస్తుగానే ఆన్‌లైన్‌లో పొందేందుకు అందుబాటులోకి ఉంచింది.

అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు వివిధ ఆలయాల్లో అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి వివిధ రకాలుగా నిర్ణయించారు. మొదటి దశలో మొత్తం 175 పెద్ద ఆలయాల్లో, తర్వాత దశలో ఓ మోస్తరు ఆలయాల్లోనూ ఈ తరహా ముందస్తు ఆన్‌లైన్‌ సేవలు ఈ వెబ్‌పోర్టల్‌ ద్వారానే అందుబాటులోకి తీసుకురానున్నట్లు దేవదాయశాఖ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు