‘విద్యుత్‌’ పనులన్నీ ఆన్‌లైన్‌

8 Oct, 2020 03:52 IST|Sakshi

వీడియో, ఆడియో కాన్ఫరెన్స్‌ల్లోనే సమీక్షలు 

కరెంటు కొనుగోళ్లు కూడా ఆన్‌లైన్‌లోనే.. గోప్యత రక్షణకు పటిష్టమైన ఏర్పాట్లు 

సాక్షి, అమరావతి: పవర్‌ సెక్టార్‌లో ఆన్‌లైన్‌ జోరు పెరిగింది. సమీక్షలు, సంప్రదింపులు, సమావేశాలు, విద్యుత్‌ కొనుగోళ్లు అన్నీ హైటెక్‌ పద్ధతుల్లోనే నడుస్తున్నాయి. దీనికోసం ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను విద్యుత్‌ సౌధలో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆరునెలల నుంచి ఆన్‌లైన్‌ ద్వారానే ప్రజాభిప్రాయాలు సేకరిస్తోంది. డిస్కమ్‌లు వచ్చే ఏడాదికి వార్షిక ఆదాయ అవసర నివేదికలు (ఏఆర్‌ఆర్‌లు) సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి విద్యుత్‌ సౌధకు, ఏపీఈఆర్‌సీకి వచ్చే సందర్శకుల సంఖ్య 75 శాతం తగ్గింది.  

► విద్యుత్‌ సంస్థల్లో రోజూ ఉదయం విద్యుత్‌ సమీక్ష జరుగుతుంది. విద్యుత్‌ లభ్యత, డిమాండ్, థర్మల్‌ యూనిట్లలో బొగ్గు నిల్వలు, బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ ధరలు ఇలా ముఖ్యమైన అంశాలను ఇంధనశాఖ కార్యదర్శి సమీక్షిస్తారు. గతంలో అందుబాటులో ఉన్న అధికారులంతా ఆయన ఆఫీసుకు వచ్చేవాళ్లు. ఇప్పుడు వీడియో, ఆడియో కాన్ఫరెన్స్‌ల్లోనే సమీక్షిస్తున్నారు. 
► ఎస్‌ఎల్‌డీసీ ఇచ్చే విద్యుత్‌ నివేదిక ఆధారంగా బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలు ఆర్డర్లు కూడా ఈ–ఆఫీసు ద్వారానే సాగుతున్నాయి. 
► విజిటర్స్‌ను కలిసే వెసులుబాటు చాలావరకు తగ్గించారు. అనుమతి తీసుకున్న విజిటర్స్‌ను కూడా ఫోన్‌లోనే సంప్రదిస్తున్నారు. లేదా ఆన్‌లైన్‌ ద్వారా సంప్రదిస్తే అవసరమైన సమాచారం ఇస్తున్నారు. 
► కోల్‌ ఇండియా, కేంద్ర ఇంధనశాఖతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంప్రదింపులకు జూమ్‌ యాప్, గూగుల్‌ మీట్‌ ఉపయోగిస్తున్నారు.  
► కాంట్రాక్టు సంస్థలు, బొగ్గు రవాణా సంస్థలతో సమావేశాలకు జూమ్‌ యాప్, అంతర్గత సమావేశాలకు మైక్రోసాఫ్ట్‌ టీం యాప్‌ ఉపయోగిస్తున్నారు. 
► ఇంటర్నెట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ లేయర్‌ సెక్యూరిటీ (టీఎల్‌ఎస్‌) ఎన్‌క్రిప్షన్‌ భద్రత ఉండటం వల్ల ఈ యాప్‌లన్నీ సురక్షితమైనవేనని అధికారులు తెలిపారు. అవసరమైన మేర మాత్రమే వ్యక్తులు గ్రూప్‌లోకి వచ్చే వీలుంటుందని, పాస్‌వర్డ్, యూజర్‌ ఐడీ అన్నీ అడ్మిన్‌ వద్దే ఉంటాయని సాంకేతిక నిపుణులు తెలిపారు.  
► గోప్యత పాటించాల్సిన కొన్ని కీలకమైన సమావేశాల్లో అత్యంత భద్రత చర్యలు తీసుకున్నట్టు ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి చెప్పారు.   

మరిన్ని వార్తలు