ఇంట్లో నుంచే నచ్చిన చదువులు

15 Nov, 2020 19:22 IST|Sakshi

విద్యార్థులకు వరంగా ఆన్‌లైన్‌ కోర్సులు

వైద్య విద్య మినహా అన్ని సబ్జెక్టులలో అందుబాటులో యూజీ, పీజీ ప్రోగ్రాములు

డిజిటల్‌ బోధనతోపాటు ఆడియో, వీడియో మెటీరియల్‌ అందుబాటు

క్రెడిట్ల కేటాయింపు, బదిలీలతో ప్రయోజనం

సాక్షి, అమరావతి : ఇంట్లో ఉంటూనో.. ఉద్యోగం చేసుకుంటూనో డిగ్రీ పట్టాలను అందిపుచ్చుకునే అవకాశం ఆన్‌లైన్‌ కోర్సుల వేదికలు కల్పిస్తున్నాయి. కోవిడ్‌-19 కారణంగా తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో ఆన్‌లైన్‌ విద్యా వేదికలకు ఎంతో ప్రాధాన్యం పెరగ్గా.. విద్యార్థులకు ప్రయోజనకరంగా మారుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆన్‌లైన్‌ కోర్సులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సులు అమలు చేసేందుకు యూనివర్సిటీలకు, వివిధ అంతర్జాతీయ సంస్థల కోర్సులకు అవకాశమిచ్చింది. ‘కోర్సెరా’, ‘ఎడెక్స్‌’ వంటి సంస్థల ద్వారా పలు కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోని 100 యూనివర్సిటీల ద్వారా ఆన్‌లైన్‌ కోర్సులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ప్రభుత్వం, ఆయా కోర్సులకు గుర్తింపునిస్తూ క్రెడిట్ల కేటాయింపు, వాటి బదిలీకి అవకాశం కల్పించింది. అదే సమయంలో అంతర్జాతీయ సంస్థలు అందించే కోర్సులకు కూడా గుర్తింపునివ్వడంతో విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వచ్చింది. 

తక్కువ ఖర్చుతోనే..
తరగతి గదిలో ముఖాముఖి నిర్వహించే డిగ్రీ కోర్సులకు అయ్యే ఫీజుల కన్నా తక్కువ ఖర్చుతో ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. క్రెడిట్‌ పాయింట్ల ఆధారంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతుండటంతో క్రమేణా ఆన్‌లైన్‌ కోర్సుల వైపు అభ్యర్థులు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ ఆన్‌లైన్‌ విద్యావేదికలైన కోర్సెరా, ఎడెక్స్‌ æ లక్షలాది మందికి ఆన్‌లైన్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఖాన్‌ అకాడమీ, ఉడెమీ, స్టాన్‌ఫోర్డ్‌ ఆన్‌లైన్, ఎంఐటీ ఓపెన్‌ కోర్సు వేర్, కోడ్‌ అకాడమీ, టెడ్‌-ఎడ్, ఓపెన్‌ కల్చర్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌ వంటి సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ కోర్సులు అందిస్తున్నాయి.

యూజీసీ ఉచిత ఆన్‌లైన్‌ కోర్సులు
మరోవైపు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం పలు ఆన్‌లైన్‌ కోర్సులను ఉచితంగా విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. 
‘స్వయం’ ఆన్‌లైన్‌ కోర్సులు ఇందులో ప్రముఖంగా చెప్పదగ్గవి. విద్యార్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఈ వేదిక ద్వారా పలు కోర్సులను అభ్యసించే అవకాశం కల్పిస్తోంది. స్వయం వేదిక ద్వారా మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌ (మూక్స్‌) సాంకేతికేతర యూజీ, పీజీ కోర్సులను అందిస్తున్నారు. ‘ఈ-పీజీ పాఠశాల’ అనేది అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఇంటరాక్టివ్‌ ఈ-కంటెంట్‌తో 23వేల మాడ్యూళ్లతో వివిధ కోర్సులను విద్యార్థులకు అందిస్తోంది. సోషల్‌ సైన్సెస్, ఆర్ట్స్, ఫైన్‌ఆర్ట్స్, హ్యుమానిటీస్, నేచురల్, మేథమెటికల్‌ సైన్సు అంశాల్లో 70 పీజీ కోర్సులు అందిస్తోంది. ఇదే కాకుండా ‘ఈ-కంటెంట్‌ కోర్స్‌ వేర్‌’ ద్వారా వివిధ అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులను యూజీసీ అందుబాటులో ఉంచింది. 24,110 మాడ్యూళ్లలో 87 యూజీ కోర్సులు విద్యార్థులు నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది. 
  
వీఎల్‌ఎస్‌ఐ ఇండస్ట్రియల్‌ కోర్సు నేర్పారు 
లాక్‌డౌన్‌ సమయంలో జేఎన్‌టీయూ అనంతపురంలో తరగతులు నిర్వహించని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈసీఈ విభాగంలో ప్రత్యేకంగా వీఎల్‌ఎస్‌ఐ ఇండస్ట్రియల్‌ కోర్సును ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించారు. కరోనా, ఇతర ప్రతికూల పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ విద్యా వేదికల ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులు పూర్తిచేసే అవకాశం కలుగుతోంది. అదనపు క్రెడిట్లతో లాభం చేకూరుతుంది. - సాయికుమార్, బీటెక్‌ ఫైనలియర్, ఈసీఈ విభాగం, జేఎన్‌టీయూ అనంతపురం (ఏ) ఇంజనీరింగ్‌ కళాశాల

అధ్యాపకులూ నిరంతర విద్యార్థులే 
అధ్యాపకులూ నిరంతర విద్యార్థులే. ఆన్‌లైన్‌ కోర్సులు విద్యార్థులతో పాటు అధ్యాపకులకూ ఉపయోగపడుతున్నాయి. - డాక్టర్‌ జి.మమత, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, జేఎన్‌టీయూ అనంతపురం ఇంజనీరింగ్‌ కళాశాల

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా