డిజిటల్‌ ‘పవర్‌’

18 Apr, 2021 05:01 IST|Sakshi

ఇక ఆన్‌లైన్‌లోనే కరెంటు బిల్లుల చెల్లింపు

బిల్లు వసూలు కేంద్రాలు క్రమంగా తగ్గింపు

క్షేత్రస్థాయి అధికారులతో కార్యాచరణ

మారుమూల గ్రామాల్లోనూ అవగాహన 

సిద్ధమైన ఏపీ డిస్కమ్‌లు

సాక్షి, అమరావతి: ఆన్‌లైన్‌ విధానంలో విద్యుత్‌ బిల్లుల చెల్లింపుకే ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. బిల్లు వసూలు కేంద్రాలను క్రమంగా తగ్గించే యోచనలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇందుకు అనువైన వాతావరణం కల్పించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు కేంద్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ పద్మా జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే ప్రతినెలా  వచ్చే బిల్లులను వినియోగదారుడికి మెసేజ్‌ ద్వారా తెలియజేస్తున్నారు. ఇక మీదట తేలికగా డిస్కమ్‌ సైట్‌కు లింక్‌ అయ్యి, గేట్‌ వే ద్వారా బిల్లులు చెల్లించే వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని అధికార వర్గాలు తెలిపాయి. 

ఇదే సులభం
► రాష్ట్రంలో 2021–22లో విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రూ.43,447 కోట్ల విద్యుత్‌ బిల్లుల వసూళ్లు జరుగుతాయి. ఇందులో రూ.26,431 కోట్లు వినియోగదారుల నుంచి వసూలవుతాయి. ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.3,102 కోట్లు, మిగతా మొత్తం ఇతర సబ్సిడీల రూపంలో డిస్కమ్‌ల ఖాతాల్లో చేరతాయి. 
► ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీ పెయిడ్‌ మీటర్లు పెడుతున్నారు కాబట్టి ఇబ్బంది ఉండదు. విద్యుత్‌ వినియోగదారుల నుంచి వసూలు చేయాల్సిన రూ.26,431 కోట్ల రెవెన్యూ సమస్యగా మారుతోంది. రెవెన్యూ కేంద్రాల నిర్వాహణకు డిస్కమ్‌లు ప్రత్యేకంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థలు ఈ ఖర్చును తగ్గించుకునే యోచనలో ఉన్నాయి.
► కరోనా నేపథ్యంలో రెవెన్యూ కేంద్రాలకు వెళ్లి బిల్లు కట్టే సంప్రదాయ వినియోగదారులు చెల్లింపులు ఆపేస్తున్నారు. ఎక్కువ సేపు లైన్లో ఉండేందుకు ఇష్టపడటం లేదు. దీనివల్ల డిస్కమ్‌ల రెవెన్యూ తగ్గిపోతున్నాయి. గడిచిన ఏడాది కాలాన్ని పరిశీలిస్తే దాదాపు 38 శాతం రెవెన్యూ వసూళ్లు తగ్గినట్టు తేలింది. 
► క్షేత్రస్థాయి విద్యుత్‌ సిబ్బందిని రంగంలోకి దించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. అవసరమైతే గ్రామ సచివాలయం వలంటీర్లను ఆన్‌లైన్‌ చెల్లింపుల ప్రక్రియపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోనున్నారు. 
► మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు పంపిణీ సంస్థల అధికారులు తెలిపారు. వచ్చే ఏడాదిలోగా పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు