అన్నిటికీ తహ‘సీల్‌’దారే !

13 Sep, 2020 11:34 IST|Sakshi
రైతు సి.నారాయణ దరఖాస్తులో వీఆర్‌ఓ, ఆర్‌ఐ సంతకాలు లేవు- సి.నారాయణ పేరుతో భూమి ఆన్‌లైన్‌ అయినట్లు 1– బి నమూనా

భూముల ఆన్‌లైన్‌ అర్జీల్లో అధికారుల సంతకాలే లేవు

వీఆర్‌ఓ, ఆర్‌ఐ విచారణ లేకుండానే పనులు కానిచ్చిన వైనం   

ములకలచెరువు: ములకలచెరువు తహసీల్దార్‌ పనితీరు వివాదాస్పదమవుతోంది. వీఆర్‌ఓలు, ఆర్‌ఐతో సంబంధం లేకుండా వెబ్‌ల్యాండ్‌లో భూముల ఆన్‌లైన్‌ ప్రక్రియ కానిస్తున్నారు. భూములకు సంబంధించి విచారణ నివేదికలు, ఫైళ్లలో సంతకాలు లేకున్నా..ఆయనే నేరుగా అన్ని పనులను చక్కబెట్టేస్తున్నారు. ఫలితంగా అధికారులు, ఉద్యోగుల మధ్య విభేదాలు బహిర్గతమవుతున్నాయి.  

జరగాల్సింది ఇలా..  
 రైతులు భూములను వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకుంటారు. వీఆర్‌ఓ, ఆర్‌ఐ క్షేత్రస్థాయిలో పరిశీలించి దరఖాస్తులోని భూములు వివాదాస్పదమైనవా, ఇంతకుమునుపు ఈ భూములు ఎవరి పేరు మీదైనా ఉన్నా యా, భాగపరిష్కారాలు అయ్యాయా లేదా.. అనే విచారణలు చేయాలి. వీఆర్‌ఓ క్షేత్రస్థాయిలో వన్‌బీలో రైతు భూమి వివరాలు పరిశీలించి నివేదిక తయారు చేస్తే ఆర్‌ఐ మరోసారి పరిశీలించి నిర్ధారించి సంతకం చేస్తారు. నివేదికను తహసీల్దార్‌కు పంపాక ఆయన సంతకం చేస్తే వెబ్‌ల్యాండ్‌లో భూమి వివరాలను ఆన్‌లైన్‌ చేస్తారు.  

చేస్తున్నది ఇలా..  
వీఆర్‌ఓ, ఆర్‌ఐ సంతకాలు లేకుండా తహసీల్దార్‌ వెబ్‌ల్యాండ్‌ దరఖాస్తులపై సంతకాలు చేస్తున్నారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ ద్వారా ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తవుతోంది. తహసీల్దార్‌కు అనుకూలంగా కొందరు వీఆర్‌ఓలు సహకరిస్తున్నారు.   

ఉద్యోగుల్లో ఆందోళన 
వీఆర్‌ఓలు, ఆర్‌ఐతో సంబంధం లేకుండా తహసీల్దార్‌ డైరెక్ట్‌గా వెబ్‌ల్యాండ్‌లో భూముల ఆన్‌లైన్‌ ప్రక్రియ కానిస్తుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ముగ్గురు వీఆర్‌ఓలతో కలిసి తహసీల్దార్‌ ఈ వ్యవహారం నిర్వహిస్తున్నారని.. ఇది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని భీతిల్లుతున్నారు. ఈ–పాస్‌ పుస్తకాలను తహసీల్దార్‌ చాంబర్‌లోని బీరువాలో పెట్టుకుని రైతులకు ఫోను ద్వారా సమాచారం అందించి పుస్తకాలను చేరవేస్తున్నట్లు సమాచారం.  

వెలుగు చూసిన దరఖాస్తులివీ
పెద్దపాళెం పంచాయతీకి చెందిన సి.నారాయణ భూమి వెబ్‌ల్యాండ్‌లో ఆన్‌లైన్‌ కోసం 451 ఖాతా నంబరు ద్వారా జూలై 7వ తేదీ దరఖాస్తు చేసుకున్నారు. 104ఏ, 106/4ఏ, 107బి, 108/1, 116ఏ, 118ఏ, 140/2, 142–4డి, 175–5, 207/2, 89ఏ, 95 సర్వే నంబర్లలో మొత్తం విస్తీర్ణం 2.3250 ఎకరాల భూమి ఉంది.

సోంపల్లె పంచాయతీకి చెందిన చిన్న కోటప్ప వెబ్‌ల్యాండ్‌లో భూమి ఆన్‌లైన్‌ చేసుకోవడానికి 122 ఖాతా నంబరు ద్వారా జూన్‌ 18వ తేదీ దరఖాస్తు చేసుకున్నారు. 1215/7, 1215–3డి, 1284–9ఏ, 291/2బి/1, 291/2బి/1, 618–1ఏ2 సర్వే నంబర్లలో మొత్తం విస్తీర్ణం 31.7500 ఎకరాల భూమి ఉంది.

దేవులచెరువుకు చెందిన వెంకటరమణారెడ్డి వైబ్‌ల్యాండ్‌లో భూమి ఆన్‌లైన్‌ కోసం 859 ఖాతా నంబరు ద్వారా జూన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. 757/5, 823, 826, 755/1 సర్వే నంబర్లలో అతని భూమి ఉంది.

నాయనచెరువుపల్లెకు చెందిన కే. రమణమ్మ భూమి వెబ్‌ల్యాండ్‌లో ఆన్‌లైన్‌ చేసుకోవడానికి ఖాతా నంబరు 27 ద్వారా జూలై 2వ తేదీ దరఖాస్తు చేసుకుంది. 34–బి, 57/డి, 59 వై, 168/1, 170–ఈ, 14 ఎన్, 25 పి, 167–3హెచ్, 140ఎన్, 10–26ఏ సర్వే నంబర్లలో భూములు ఉన్నాయి.

దేవులచెరువుకు చెందిన ఎం. నాగమ్మ 1180/2 సర్వే నంబరు ద్వారా 2.07 ఎకరాల విస్తీర్ణం ఆన్‌లైన్‌ కోసం జూలైలో దరఖాస్తు చేసుకుంది.

మొత్తం రైతుల వైబ్‌ల్యాండ్‌ దరఖాస్తుల్లో వీఆర్‌ఓ, ఆర్‌ఐ సంతకాలు లేవు. తహసీల్దార్‌ సంతకం మాత్రమే ఉంది. 

ఆ అధికారం నాకు ఉంది 
వెబ్‌ల్యాండ్‌లో డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌ చేసే అధికారం తహసీల్దార్‌గా నాకు ఉంది. వీఆర్‌ ఓలు, ఆర్‌ఐకు తెలియకుండా భూములు, స్థలాలను ఇప్పటిదాకా ఆన్‌లైన్‌ చేయలేదు.   
– తహసీల్దార్‌ మహేశ్వరీబాయి  

అలా చేయడం తప్పు  
భూములు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలంటే వీఆర్‌ఓ, ఆర్‌ఐ విచారణ నివేదికలు అవసరం. అవి లేకుండా తహసీల్దార్‌ నేరుగా నమోదుచేయడం జరగదు. అలా జరిగివుంటే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం.
–మార్కండేయులు, జాయింట్‌ కలెక్టర్, చిత్తూరు  

మరిన్ని వార్తలు