మూడు స్తంభాల ‘సూపర్‌ షాప్‌’

11 Oct, 2020 04:10 IST|Sakshi
కిరాణా షాపులో హోం డెలివరీకి సరుకులు కట్టించుకుంటున్న నాగూర్‌బాషా, నారాయణరెడ్డి

గ్రామీణులకు అందుబాటులో ఆన్‌లైన్‌ షాపింగ్‌  

కరోనా సమయంలో ఫ్రీ హోం డెలివరీ  

ప్రకాశం జిల్లా కొమరోలులో ముగ్గురు స్నేహితుల వినూత్న ప్రయోగం  

కరోనా విజృంభిస్తున్న సమయం.. ఇళ్లల్లోంచి అడుగు బయట పెట్టాలంటే ఆందోళన.. మార్కెట్‌కు వెళ్లి సరుకులు తెచ్చుకుందామన్నా భయం.. ఇలాంటి విపత్కర సమయాన్ని అవకాశంగా మార్చుకున్నారు ఆ ముగ్గురు యువకులు. తమ గ్రామస్తులకు ఆన్‌లైన్‌ ప్లాట్‌ ఫాంను అందుబాటులో ఉంచి, వారు బుక్‌ చేసుకున్న సరుకులను హోం డెలివరీ చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆ విధంగా అండగా ఉండటంతో పాటు.. వారూ ఉపాధి పొందుతున్నారు..  

కొమరోలు: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పామూరుపల్లెకు చెందిన నారాయణరెడ్డి, నాగూర్‌బాషా, తిరుమల కొండారెడ్డి బీటెక్‌ చదివి ఇళ్ల వద్ద ఖాళీగా ఉంటున్నారు. ముగ్గురూ కలిసి వినూత్నంగా ఏదన్నా వ్యాపారం చేద్దామనుకుంటున్నారు. అయితే ఏం చేయాలా.. అని కొద్ది రోజులుగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో కరోనా విజృంభించింది. జనం నిత్యావసర సరుకుల కోసం ఇళ్లల్లోంచి బయటకు రావడానికి ఇబ్బందిపడుతున్నారు.. ఆ సమయంలో వారికి ఓ ఆలోచన మెరిసింది. ఆ నిత్యావసర సరుకులను వారి ఇళ్లకు తామే సరఫరా చేస్తే ఎలా ఉంటుందని. వెంటనే దానిని ఆచరణలో పెట్టారు. ‘çççసూపర్‌ షాప్‌’ పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. తమ గ్రామస్తులు బుక్‌ చేసుకున్న నిత్యావసర వస్తువులను ఉచితంగా హోం డెలివరీ చేస్తున్నారు. బుక్‌ చేసిన 10 నుంచి 15 నిమిషాల్లో సరుకులతో వారి ఇళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నారు. కొమరోలు నుంచి 10 కి.మీ దూరం వరకు ఏ గ్రామానికైనా ఉచితంగా సరకులను చేరవేస్తున్నారు. 

కిరాణా, ఫ్యాన్సీ షాపులతో ఒప్పందం 
కొమరోలులోని కిరాణా, ఫ్యాన్సీ షాపులు, రెస్టారెంట్లతో ముందుగానే ఈ యువకులు ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు కస్టమర్లు కోరిన సరుకులు, కూల్‌ డ్రింక్స్, ఫుడ్‌ ఐటమ్స్‌ను తక్కువ ధరకే ఆయా షాపుల నుంచి కొనుగోలు చేస్తారు. తాము కూడా తక్కువ లాభాలు మాత్రమే తీసుకుంటూ ఎక్కువ ప్రయోజనాన్ని కస్టమర్లకే అందిస్తున్నారు. దుకాణాలకు వెళ్లి కొనుగోలు చేసే దానికంటే ఆన్‌లైన్‌లో వీరి వద్ద కొన్న వస్తువులు రెండు, మూడు రూపాయలు తక్కువకే వస్తుండటం, పైగా డోర్‌ డెలివరీ చేస్తుండటంతో గ్రామస్తులు వీరిని ప్రోత్సహిస్తున్నారు.  

అన్నీ తామై.. 
కస్టమర్లు ఆర్డర్‌ చేసిన వస్తువుల కొనుగోలు దగ్గర్నుంచి.. వాటిని హోం డెలివరీ చేసే వరకూ అన్ని పనులూ ఆ ముగ్గురే తామై చక్కబెడుతున్నారు. సూపర్‌ షాప్‌ పేరుతో యాప్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్టు వారు చెబుతున్నారు. ప్రస్తుతం తమ గ్రామం, చుట్టుపక్కల గ్రామాలకు అందిస్తున్న తమ సేవలను.. తర్వాత మండలం, ఆ తర్వాత జిల్లాకు విస్తరిస్తామని చెబుతున్నారు.  

సేవ చేస్తున్నామన్న సంతృప్తి..
గ్రామీణ ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ వంటివి విజయవంతం కావని పలువురు చెప్పారు. ఆయినా మేం నిరుత్సాహ పడలేదు. సాహసం చేసి ముందుకు సాగుతున్నాం. సత్ఫలితాలొస్తున్నాయ్‌.. మున్ముందు ఆన్‌లైన్‌ ద్వారా మరిన్ని వస్తువులను సరఫరా చేసే ఆలోచన చేస్తున్నాం. ప్రజలకు మా స్థాయిలో సేవ చేస్తున్నామన్న తృప్తితో పాటు, మా కాళ్లమీద మేం నిలబడ్డామన్న సంతృప్తి మాకుంది.  
   – నారాయణరెడ్డి, నాగూర్‌బాషా, కొండారెడ్డి  

మరిన్ని వార్తలు