ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్‌ టికెట్లు

7 Sep, 2022 04:45 IST|Sakshi

ఈ నెల 20 నుంచి అమలు..  భక్తులు అడ్వాన్స్‌గా టికెట్లు, గదులు బుక్‌ చేసుకోవచ్చు 

దసరా ఉత్సవాల్లో వీఐపీలూ టికెట్‌ కొంటేనే దుర్గగుడిలో దర్శనం 

వీఐపీల దర్శనాలకు టైం స్లాట్‌ 

దసరా తర్వాత దుర్గగుడిలో అంతరాలయ దర్శనానికి రూ.500 టికెట్‌ 

అక్టోబరు 10న ధార్మిక పరిషత్‌ తొలి సమావేశం  

మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడి 

సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలో ఉన్న 11 ప్రధాన ఆలయాల్లో ఈ నెల 20వ తేదీ నుంచి దర్శనం టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆలయాల వద్ద గదుల కేటాయింపు వంటి వాటిని కూడా ఆన్‌లైన్‌ పరిధిలోకి తెస్తామన్నారు. మంత్రి మంగళవారం విజయవాడలో దేవదాయ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ గుడి, పెనుగ్రంచిపోలు, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, విశాఖపట్నం కనకమహాలక్ష్మి ఆలయం, వాడపల్లి, ఐనవల్లి ఆలయాల్లో ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం తప్పనిసరి చేస్తున్నట్లు చెప్పారు.

భక్తులు అడ్వాన్స్‌గా నిర్ణీత తేదీకి ఆన్‌లైన్‌ దర్శన టికెట్లు, గదులు బుకింగ్‌ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. రద్దీ అధికంగా ఉండే మరో 12 ఆలయాల్లోనూ ఆన్‌లైన్‌ విధానం అమలుపై చర్చిస్తున్నట్లు వివరించారు. 

వారం వారం సమీక్ష 
ఇకపై ప్రతి బుధవారం దేవదాయశాఖ సమీక్ష సమావేశం నిర్వహించి, ఆలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉద్యోగుల పదోన్నతులకు అడ్డుగా ఉన్న కోర్టు కేసుల ఉపసంహరణకు ఉద్యోగ సంఘాల నేతలు ముందుకొచ్చారని, ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు. దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌లో సిబ్బంది నియామకాలను చేపట్టినట్లు వివరించారు. కొత్తగా ఏర్పాటైన ధార్మిక పరిషత్‌ తొలి సమావేశం అక్టోబరు 10న నిర్వహించనున్నట్లు చెప్పారు. 

దసరా ఉత్సవాల్లో వీఐపీలకూ టైం స్లాట్‌ దర్శనాలు 
దసరా ఉత్సవాల్లో విజయవాడ కనకదుర్గ గుడిలో వీఐపీలకు కూడా టైం స్లాట్‌ ప్రకారమే దర్శనాలు కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. వీఐపీలు కూడా టికెట్‌ కొనాలని చెప్పారు. రోజుకు ఐదు ప్రత్యేక టైం స్లాట్‌లు ఉంటాయన్నారు. రెండేసి గంటలు ఉండే ఒక్కొక్క టైం స్లాట్‌లో రెండు వేల వీఐపీ టికెట్లను ఇస్తామన్నారు. అందులో 600 టికెట్లు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలు ఉన్నవారికి  కేటాయించి, మిగిలినవి అందరికీ ఇస్తామన్నారు.

ఒక లేఖకు ఆరు టికెట్లు ఇస్తామన్నారు. సిఫార్సు లేఖలు, ఇతర వీఐపీ టికెట్ల బుకింగ్‌కు విజయవాడ కలెక్టర్‌ ఆఫీసులో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు వంటి ప్రివిలేజ్డ్‌ వీఐపీలు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉదయం, సాయంత్రం వేళల్లో అర్ధ గంట చొప్పున ఉచిత దర్శనం ఉంటుందని తెలిపారు. సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటామన్నారు.

దుర్గ గుడి ఘాట్‌ రోడ్డును పూర్తిగా క్యూలైన్‌లకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఉచిత దర్శనానికి మూడు లైన్లు, రూ.300 టికెట్‌ వారికి ఒకటి, రూ.100 టికెట్‌ వారికి మరొక క్యూ ఉంటాయని చెప్పారు. వికలాంగులు, వృద్ధులకు రోజూ ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఒకసారి, సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య మరోసారి ప్రత్యేక దర్శనాలు ఉంటాయని వివరించారు. 

మంత్రులకూ అంతరాలయ దర్శనం ఉండదు 
దసరా ఉత్సవాల సమయంలో దుర్గగుడిలో అంతరాలయ దర్శనం గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి ప్రముఖులకు మాత్రమే ఉంటుందని తెలిపారు. మంత్రులకు సైతం బయట నుంచే దర్శనాలు కల్పించాలని ఆలోచన చేస్తున్నామని వివరించారు. దసరా ఉత్సవాల తర్వాత దుర్గగుడిలో అంతరాలయ దర్శనానికి రూ. 500 టికెట్‌ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు.     

మరిన్ని వార్తలు