18వ రోజు కొనసాగుతున్న ఈ- రక్షాబంధన్ శిక్షణ

21 Aug, 2020 16:40 IST|Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని బాలలు, మహిళల భద్రత కోసం పోలీస్‌ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా రూపొందించిన ‘ఈ- రక్షాబంధన్‌’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సైబర్‌ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు అవగహన కల్పించేలా ఆన్‌లైన్‌ శిక్షణా తరుగతులను ప్రభుత్వం చేపడుతోంది. దీనిలో భాగంగానే విజయవాడలో శుక్రవారం 18వ రోజు  ‘ఈ రక్షా బంధన్’ శిక్షణ తరగతులు జరిగాయి.  పోలీస్‌ శాఖ, సీఐడీ విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వెబ్‌నార్‌లో వ్యక్తిగత సమాచార దోపిడి, ఉద్యోగాల మోసాలు వంటి అంశాలపై అవగహన కల్పించారు. ఈ సందర్భంగా వెబ్‌నార్‌లో పాల్గొన్న  సైబర్‌ నిపుణులు విమల్‌ ఆదిత్య, నందీశ్వర్‌ పలు కీలక సూచనలు చేశారు.

వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని, అలాగే సోషల్ మీడియాలోనూ షేర్‌ చేయవద్దని సలహాఇచ్చారు. ఆన్‌లైన్‌ జాబ్ మోసగాళ్లకు ఎలాంటి సమాచారం లేకుండా డబ్బు చెల్లించవద్దని నిరుద్యోగులకు  సూచించారు. అలాగే వ్యక్తిగత సమాచారం దోపిడికి గురైతే దానిని ఎలా కనుగోవచ్చు అంశపై సుదీర్ఘంగా చర్చించారు. ​సైబర్ స్థలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వైఖరిని పెంపొందించుకోవాలన్నారు. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లలో సర్వే ఫారాలను నింపడం ద్వారా సమాచారం దోపిడి జరుగుతుందన్న అనుమానంపై సైతం సలహాలు ఇచ్చారు. అలాగే ఆన్‌లైన్‌ ఉద్యోగ మోసాలు ,పెళ్ళి సంబంధాల మోసాల నుంచి రక్షణ పొందడానికి భద్రతా చిట్కాలను సైతం సైబర​ నిపుణులు చర్చించారు.  

కాగా తోబుట్టువుల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని సైబర్‌ నేరగాళ్ల నుంచి మహిళలను రక్షించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ- రక్షాబంధన్‌లో భాగంగా.. యూట్యూబ్‌ ఛానల్ ద్వారా స్కూళ్లు, కాలేజీలు, వర్కింగ్‌ ఉమెన్‌కు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులతో నెలరోజులపాటు ఆన్‌లైన్‌లో శిక్షణ నిర్వహిస్తున్నారు. సైబర్‌ నేరగాళ్ల వలలో పడకుండా షార్ట్ ఫిలిమ్స్‌, యానిమేషన్స్‌, రీడింగ్ మెటీరియల్‌ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వహకులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు