‘సచివాలయ’ సిబ్బందికి శిక్షణ

19 Apr, 2022 04:01 IST|Sakshi

అనంతరం ఆన్‌లైన్‌లోనే పరీక్ష

సాక్షి, అమరావతి: ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుగా నిర్ధారించుకున్న అంశాలలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలపై బుధవారం గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏపీ ఎస్‌ఐఆర్‌డీ డైరెక్టర్‌ జె.మురళీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే దాదాపు 15 వేల మంది వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లకు బుధవారం ఉదయం 11 గంటల నుంచి 11.45 గంటల మధ్య ఆన్‌లైన్‌ విధానంలో శిక్షణ అందజేయనున్నారు.

45 నిమిషాల వీడియోను మంగళవారం సాయంత్రం నుంచే యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచుతారు. వీలున్న వారు ముందుగానే దానిని వీక్షించి, ఆన్‌లైన్‌ శిక్షణలోనూ పాల్గొనవచ్చు.  శిక్షణ అనంతరం 12.10 గంటల నుంచి 12.25 మధ్య పది ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో కనీస మార్కులు తెచ్చుకోవాలి. కనీస మార్కులు సాధించని వారికి దఫాల వారీగా శిక్షణ కొనసాగుతుందే తప్ప.. వేరే ఎలాంటి చర్యలు ఉండవు. కాగా, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులకు దాదాపు ఏడాది మొత్తం శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని జె.మురళీ ఆ ప్రకటనలో వివరించారు.  

మరిన్ని వార్తలు