పెళ్లిళ్లు, ఫంక్షన్‌లలో 50 మందికే అనుమతి

27 Apr, 2021 03:18 IST|Sakshi

ముందస్తు అనుమతులు తప్పనిసరి

అంత్యక్రియలకు 20 మందే హాజరుకావాలి

నేటి నుంచి స్విమ్మింగ్‌ పూల్స్, స్పోర్ట్స్‌ క్లబ్‌లు, స్పాలు మూత

బస్సుల్లో 50 శాతం సీట్లు మాత్రమే నింపాలి

తాజాగా 376 ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్సలు

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కువగా రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల వినియోగం 

దీనిపై ప్రత్యేక ఆడిట్‌ను నిర్వ హిస్తున్నాం.. దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు

వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్‌

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. వివాహాలు, ఇతర ఫంక్షన్లకు హాజరయ్యేవారిని 50 మందికి మాత్రమే పరిమితంచేసింది. అలాగే అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదని నిబంధనలు విధించింది. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం, శానిటైజ్‌ చేసుకోవడంతోపాటు భౌతిక దూరం పాటించాలని సూచించింది. పెళ్లిళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు ముందస్తు అనుమతిని తప్పనిసరి చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచి స్విమ్మింగ్‌ పూల్స్, స్పోర్ట్స్‌ క్లబ్బులు, స్పాలను మూసివేస్తున్నామని తెలిపారు. సినిమా హాళ్లు, బస్సులను 50 శాతం సీట్లతోనే నడపాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఐదు అడుగుల భౌతిక దూరం పాటించి విధులు నిర్వహించుకోవాలన్నారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సింఘాల్‌ ఏమన్నారంటే.. 

పేషెంట్ల సంఖ్య కంటే ఇంజక్షన్ల వినియోగం ఎక్కువగా ఉంది..
ప్రైవేటు ఆస్పత్రుల్లో పేషెంట్ల సంఖ్య కంటే ఒక రోజులో వినియోగించిన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. గత 24 గంటల్లో 11,453 డోసులు వాడారు. అన్ని పడకలే లేనప్పుడు ఇన్ని ఇంజక్షన్లు ఎలా వాడారనే దానిపై ప్రత్యేక ఆడిట్‌ నిర్వహిస్తున్నాం. ఏ రోజు ఎంత స్టాకు వచ్చింది.. ఎన్ని వేశారు.. ఎవరికి వేశారు వంటి వివరాలు సేకరిస్తున్నాం. దుర్వినియోగమైనట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రులకు వచ్చిన రోగులను బయట రెమ్‌డెసివిర్‌ తెచ్చుకోండి అంటున్నారు. ఇది సరికాదు. ఇకపై ప్రైవేటు ఆస్పత్రులు ఇండెంట్‌ ఇస్తే పరిశీలించి మేమే ఇంజక్షన్లు తెప్పిస్తాం. ఇకపై ప్రతి రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ వినియోగాన్ని పబ్లిక్‌ డొమైన్‌లో పెడతాం. కోవిడ్‌ అనుమతి ఉన్న ప్రతి ప్రైవేటు ఆస్పత్రిలోనూ హెల్ప్‌లైన్‌ నంబర్‌ పెడతాం. రెండు రోజుల్లో రెమ్‌డెసివిర్‌ కొరత అనే మాట లేకుండా చేస్తాం.

ఆక్సిజన్‌ దుర్వినియోగం మా దృష్టికి వచ్చింది..
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆక్సిజన్‌ చాలా ముఖ్యం. ఎవరికంటే వారికి ఆక్సిజన్‌ పెడుతున్నారు. విజయనగరంలో 96 శాతం ఆక్సిజన్‌ శాచురేషన్‌ ఉన్న పేషెంట్‌కు ఆక్సిజన్‌ పెట్టారు. రాత్రిపూట కొన్నిచోట్ల ఆక్సిజన్‌ పెట్టి వదిలేస్తున్నారు. ఇలాంటివి ఇక జరగవు. దీనికి ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో ఆక్సిజన్‌ వినియోగంపై ఆడిట్‌ పెడతాం. దుర్వినియోగానికి అవకాశం లేకుండా చేస్తాం. ప్రస్తుతం 341 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సరఫరా అవుతోంది. గతేడాది ఇంతకంటే ఎక్కువ మంది ఇన్‌పేషెంట్లు ఉన్నప్పుడు 261 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ మాత్రమే వినియోగమైంది. ప్రస్తుతం దుర్వినియోగమైందా, బయట అమ్ముకుంటున్నారా అనేదానిపై నిఘా పెట్టాం. విజయనగరం జిల్లాలో ఆక్సిజన్‌ అందక ఎవరూ మృతి చెందలేదు.

ఆస్పత్రుల నిర్వహణ బాధ్యత జేసీలకు..
ఇప్పటివరకు గ్రామ/వార్డు సచివాలయ విధులు చూస్తున్న జాయింట్‌ కలెక్టర్లకు పూర్తిగా ఆస్పత్రుల నిర్వహణ అప్పజెప్పాం. కోవిడ్‌ విధులు మాత్రమే వాళ్లు పర్యవేక్షిస్తారు. ఆస్పత్రుల నిర్వహణ, వసతులు, సీసీ టీవీలు, 104 కాల్‌సెంటర్, రోగి బంధువులకు సమాచారం అందుతోందా లేదా వంటివన్నీ ఇక జేసీలే చూస్తారు.

376 ఆస్పత్రులు అందుబాటులోకి..
ఈ నెల 26 నాటికి 376 ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 4,395 ఐసీయూ పడకలు ఏర్పాటు చేస్తే 2,022 పడకలు మాత్రమే నిండాయి. 16,352 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులోకి తేగా ఇందులో 7,943 మాత్రమే నిండాయి. రెమ్‌డెసివిర్‌ అవసరం ఉన్నవారికి మాత్రమే వేయాలని చెప్పాం. అవసరం ఉంటేనే ఆస్పత్రిలో చేర్చుకోవాలని, మిగతా వారిని కోవిడ్‌కేర్‌ సెంటర్లకు పంపించాలని సూచించాం. 104 కాల్‌సెంటర్‌ నిర్వహణపై గంట గంటకూ పర్యవేక్షణ ఉంటుంది. అంతేకాకుండా జిల్లాలో ఐదారు ఆస్పత్రులను ఒక క్లస్టర్‌గా చేసి, ఒక ప్రత్యేక అధికారిని పెడుతున్నాం. దీంతోపాటు ముగ్గురు అధికారులతో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను నియమించి జిల్లాలో ఆస్పత్రులను తనిఖీలు చేయిస్తాం. ప్రైవేటు ఆస్పత్రుల పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కమిటీ పనిచేస్తుంది.   

మరిన్ని వార్తలు