YSR Kadapa: ఆ వైద్యుడు పేదల కంటి వెలుగు.. వందల మందికి ఉచిత ఆపరేషన్లు 

9 Aug, 2022 11:34 IST|Sakshi
పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్‌ ప్రదీప్‌కుమార్‌ 

ప్రతి శనివారం ఉచిత పరీక్షలు 

రెండు దశాబ్దాలకు పైబడి సాగుతున్న సేవలు

సాక్షి, కడప సెవెన్‌రోడ్స్‌: గోరంత సాయం చేసి కొండంత ప్రచారం పొందాలనుకునేవారు చాలామంది. తమను తాము ప్రముఖ సంఘ సేవకులుగా చెప్పుకునే ఈ కోవకు చెందిన వారిని నిత్యం చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా నిస్వార్థ సేవలు అందిస్తూ కూడా పబ్లిసిటీకి ఇష్టపడని వ్యక్తులు సైతం ఉంటారంటే ఒకింత ఆశ్చర్యమేస్తుంది. రెండు దశాబ్దాలకు పైబడి పేదలకు ఉచిత వైద్య పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహిస్తున్న కడప నగరానికి చెందిన ప్రముఖ కంటి వైద్యులు గగ్గుటూరు ప్రదీప్‌కుమార్‌ ఇందుకు నిదర్శనం.

కడప నగరం రమేష్‌ థియేటర్‌ ఎదురు వీధిలో డాక్టర్‌ ప్రదీప్‌ కుమార్‌ తన తండ్రిపేరిట శ్రీ గగ్గుటూరు పిచ్చయ్య నేత్ర వైద్యశాలను చాలా ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. తన ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎంతో ఓపికగా కంటి పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన సేవలు అందిస్తుంటారు.

20 ఏళ్లుగా ఉచిత సేవలు
పేదలకు వారంలో ఒకరోజు ఉచిత వైద్య పరీక్షలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు నిర్వహించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అలా 2001 నుంచి ప్రతి ఆదివారం ఉచిత కంటి పరీక్షలు, వైద్యం అందించేవారు. మాజీమంత్రి బిజివేముల వీరారెడ్డి అల్లుడు డాక్టర్‌ రవికుమార్‌రెడ్డి క్లాస్‌మేట్‌. దీంతో ప్రతి ఆదివారం బద్వేలులోని వీరారెడ్డి ఆస్పత్రికి వెళ్లి ఉచిత కంటి పరీక్షలతోపాటు అవసరమైన వారికి ఆపరేషన్లు చేసేవారు. ఇలా 19 సంవత్సరాలు అక్కడ సేవలు అందించారు. ఇప్పుడు ప్రతి శనివారం కడప నగరం ఎర్రముక్కపల్లెలోని తన ఇంటి వద్ద ఉచిత పరీక్షలు చేస్తున్నారు.

ప్రారంభంలో ఉచిత ఆపరేషన్లు చేశారు. అయితే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వద్ద అనుమతులు పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుతానికి ఆపరేషన్లు నిర్వహించడం లేదు. కంటి పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు అవసరమైతే ఇతర వైద్యుల వద్దకు పంపుతున్నారు. ప్రతి శనివారం ఉచిత క్యాంపునకు 60–90 మంది పేషంట్లు వస్తుంటారు. కడప నగరంతోపాటు కమలాపురం, మైదుకూరు, ఎర్రగుంట్ల, గుత్తి, బ్రహ్మంగారిమఠం ప్రాంతాల నుంచి రోగులు వస్తారు. గతంలో  బద్వేలులో పనిచేయడం వల్ల ఆ ప్రాంతం వారు ఎక్కువ వస్తారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు అవసరమైతే మరికొంత సమయాన్ని ఉచిత సేవలకు వినియోగిస్తున్నారు.

చదవండి: (ఫలించిన ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కృషి.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు)

సామాజిక బాధ్యతగా భావించాను
నేను పుట్టి పెరిగింది కడప నగరం ఎర్రముక్కపల్లె. వైద్య పట్టా పుచ్చుకున్నాక మా ఇంటి చుట్టుపక్కల ఉన్న పేదలకు ఉచిత పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించడం బాధ్యతగా భావించాను. ఇప్పుడు కడపకు చెందిన వారేకాకుండా ఇతర ప్రాంతాల వారు కూడా వస్తున్నారు. శుక్లాలు, అద్దాల చెకప్, గ్లాకోమా తదితర కంటి పరీక్షలు నిర్వహిస్తాను. 
– డాక్టర్‌ ప్రదీప్‌కుమార్, కంటి వైద్య నిపుణులు, కడప

పేదలకు ఎంతో మేలు
ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్యం ఖరీదై పోయింది. డబ్బున్న వారికే వై ద్యం అన్నట్లు తయారైంది. గతంలో ఒకటి లేదా రెండు రూపాయల నామమాత్రపు ఫీజు తీసుకునే వైద్యులను చూశాను. ఇప్పుడు డాక్టర్‌ ప్రదీప్‌కుమార్‌ వారంలో పూర్తిగా ఒకరోజు ఉచిత సేవలు అందించడం పేదలకు ఎంతో మేలు చేసే అంశం.
– సీఆర్‌వీ ప్రసాద్‌రావు, నాగరాజుపేట, కడప

మరిన్ని వార్తలు