బాబోయ్‌ స్మార్ట్‌ఫోన్‌ లోబ్యాటరీ! ఇదెక్కడి లొల్లి! మీకు ‘నోమోఫోబియా’ ఉందా?

29 May, 2023 18:04 IST|Sakshi

ప్రతి నలుగురిలో ముగ్గురికి ఫోబియా.. స్మార్ట్‌ఫోన్‌ ‘లో–బ్యాటరీ’లో పడితే.. 

బ్యాటరీ చార్జింగ్‌పై భయం పెట్టుకుంటున్న వినియోగదారులు 

దీనినే ‘నోమోఫోబియా’గా పేర్కొంటున్న ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ 

‘ఒప్పో, కౌంటర్‌ పాయింట్‌’ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడి 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కాసేపు ఫోన్‌ కనపడకపోతే.. ప్రపంచానికి మనం దూరమైపోయినట్టు తల్లడిల్లిపోతుంటాం. అదే.. ఫోన్‌లో లో–బ్యాటరీ అనే సింబల్‌ కనిపిస్తే.. చాలామందిలో ఆందోళన పెరిగిపోతుంటుంది. దీనినే నోమోఫోబియో (నో మొబైల్‌ భయం) అని పిలుస్తారంట. నాలుగేళ్ల క్రితం ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో ఈ పదాన్ని చేర్చినా.. ఇప్పుడు ప్రతి నలుగురు భారతీయుల్లో ముగ్గురు ఈ నోమోఫోబియోతో బాధపడుతున్నారని ఓ సర్వేలో తేలింది.

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో ఇండియా, మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ కౌంటర్‌ పాయింట్‌తో కలిసి దేశంలోని నగరాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఫోన్‌ బ్యాటరీ లెవల్స్‌ పడిపోయినప్పుడు వినియోగదారులు ఎలా స్పందిస్తున్నారనే దానిపై టైర్‌–1, టైర్‌–2 నగరాల్లోని 1,500 మంది ఫోన్‌ యూజర్ల నుంచి వివరాలు సేకరించారు.

  

బ్యాటరీ అయిపోతే.. ఫోన్‌ వాడలేం! 
ఈ అధ్యయనం ప్రకారం.. సెల్‌ఫోన్‌ బ్యాటరీ చార్జింగ్‌ అయిపోతే ఫోన్‌ వాడలేం కదా.. ఇప్పుడెలా అనే ఆందోళనతో ఎక్కువ మంది బాధపడుతున్నారట. ఈ క్రమంలో లో–బ్యాటరీ అనే సిగ్నల్‌ కనిపిస్తే చాలు టెన్షన్‌తో ఇబ్బందులు పడుతున్నారని వెల్లడైంది. 100 శాతం బ్యాటరీ ఉన్నప్పుడు ఆనందంగా ఉండే వినియోగదారులు.. ఫోన్‌ చార్జింగ్‌ 20 శాతానికి తక్కువగా కనిపిస్తే ఫోబియోతో బాధపడుతున్నారని తేలింది. 100 మందిలో 75 మంది ఫోన్‌ చార్జింగ్‌ తగ్గిపోతున్న కొద్దీ స్విచ్‌ఆఫ్‌ అయిపోతుందన్న ఆందోళనతో కనిపిస్తున్నారని ఈ అధ్యయనంలో తేలింది.   

సర్వే ఇంకేం చెప్పిందంటే.. 
► ‘లో బ్యాటరీ’ నోమోఫోబియో భయం 31 నుంచి 40 ఏళ్లలోపు వయసు వారిలో 77 శాతం వరకూ ఉండగా.. 25 నుంచి 30 ఏళ్లలోపు వారిలోనూ ఈ భయం గుర్తించినట్టు సర్వేలో వెల్లడించింది. 
► 87 శాతం మంది ఫోన్‌ని చార్జింగ్‌ పెట్టి మరీ ప్రమాదకరంగా వినియోగిస్తున్నారు. 
► ఫోన్‌ బ్యాటరీ పనిచేయకుంటే భయంభయంగా ఉంటుందని 82% మంది పురు­షులు చెప్పగా.. 74 శాతం మంది మహిళా యూజర్లు అదే ఆందోళన వెలిబుచ్చారు. 
► 60 శాతం మంది వినియోగదారులైతే ఫోన్‌ బ్యాటరీలో చార్జింగ్‌ తక్కువ సమయం వస్తుంటే.. వెంటనే 100లో 60 మంది కొత్త ఫోన్‌ కొనుగోలు చేసేస్తున్నారు.  
► 100లో 46 మంది వినియోగదారులు తమ ఫోన్‌లో చార్జింగ్‌ ఉన్నప్పటికీ రోజుకు రెండు­సార్లు చార్జింగ్‌ పెడుతున్నారు. 0 92 శాతం మంది తమ ఫోన్‌లో పవర్‌ సేవింగ్‌ మోడ్‌ వినియోగిస్తున్నారు.  
► ఇంటికి చేరేలోపు లో–బ్యాటరీ సిగ్నల్‌ వస్తుందేమోనన్న భయంతో 82 శాతం మంది యూజర్లు సోషల్‌ మీడియా వినియోగ సమయాన్ని తగ్గించేసుకుంటున్నారు. 
► సోషల్‌ మీడియా కోసమే స్మార్ట్‌ ఫోన్‌ అని 78 శాతం మంది చెప్పారు. 
► ఎంటర్‌టైన్‌మెంట్, మూవీస్, సీరియల్స్, టీవీషోస్‌ చూసేందుకు ఎక్కువగా వినియోగిస్తు­న్నా­­మని 42% మంది వినియోగదారులు చెప్పారు. 

ఆందోళన తగ్గించుకోవాలి 
స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో వస్తున్న మార్పులపై అధ్యయనం చేసేందుకు సర్వే నిర్వహించాం. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లు జీవితాలపై ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తాయని గుర్తించాలి. గంటలకొద్దీ ఫోన్‌ని వినియోగించకుండా అవసరం మేరకే ఫోన్లని వాడాలి. స్మార్ట్‌ ఫోన్ల విషయంలో కలిగే ఆందోళనలను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్‌ వాడకానికి అప్పుడప్పుడూ గ్యాప్‌ ఇస్తూ కుటుంబసభ్యులు, స్నేహితులు, కొలీగ్స్‌తో మమేకమవుతూ మానవ సంబంధాలకు విలువనివ్వాలి. ఫోన్ల వాడకంపై అవగాహనతో పాటు జాగ్రత్తగా ఉండటం ద్వారా నోమోఫోబియోని అధిగమించడం సులువు. 
   – దమయంత్‌ సింగ్‌ ఖనోరియా, సీఎంవో, ఒప్పో ఇండియా  

మరిన్ని వార్తలు