బొబ్బిలి వీణ.. శిఖరాగ్ర ఆదరణ

9 Mar, 2023 04:05 IST|Sakshi

జీ–20 దేశాల అతిథుల కోసం 200 వీణలకు ఆర్డర్‌

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు హాజరైన అతిథులకూ ఇవే బహుమతి

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన 20 సభ్యదేశాల శిఖరాగ్ర సమావేశాల్లో బొబ్బిలి వీణ వైభవాన్ని చాటుకోనుంది. విశాఖలో ఈ నెల 28, 29వ తేదీల్లో జరగనున్న జీ–20 సదస్సుకు వివిధ దేశాల నుంచి హాజరయ్యే అతిథులను గౌరవించేందుకు 200 బొబ్బిలి వీణలను అధికారులు ప్రత్యేకంగా తయారు చేయిస్తు­న్నారు.

కార్యక్రమానికి ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆయన చేతుల మీదుగా వీటిని ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖ­లో ఈ నెల 3, 4 తేదీల్లో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు దేశం నలుమూలల నుంచి హాజరైన పారిశ్రామిక దిగ్గజాలు, ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బొబ్బిలి వీణలను బహూ­క­రించారు.

బొబ్బిలి పట్టణ పరిధి­లోని గొల్లపల్లికి చెందిన సర్వసిద్ధి ఇంటిపేరు గల కుటుంబీకులే దశా­బ్దా­­లుగా బొబ్బిలి వీణలను తయా­రు­చేస్తూ వస్తున్నారు. వారిని ప్రోత్సహించేందుకు ప్రభు­త్వం ఆంధ్రప్రదేశ్‌ హస్తకళల అభివృద్ధి సంస్థ ద్వారా 1994వ సంవత్సరంలో సొసైటీని ఏర్పాటు చేసింది. 2002లో బొబ్బిలి పట్ణణ పరిధి­లోని గొల్లపల్లిలో వీణల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది
వీణల తయారీయే ఆధారంగా ఉన్న మా కళాకారులకు టీటీడీతో పాటు ప్రభుత్వ ప్రోత్సా­హం బాగుంది. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు సందర్భంలో 200 వీణలను తయా­రుచేసి అందించాం. అతిథుల కోసం మా వీణలతో కచేరీ కూడా ఏర్పాటు చేయించారు. ఈ నెలలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న మరో ప్రతిష్టాత్మక సదస్సు జీ–20 కోసం కూడా 200 వీణలకు ఆర్డర్‌ వచ్చింది.  – సర్వసిద్ధి రామకృష్ణ, ఇన్‌చార్జి,  బొబ్బిలి వీణల కేంద్రం

మరిన్ని వార్తలు