బేషరతుగా పోలవరానికి రూ.2,234.288 కోట్లు విడుదల

3 Nov, 2020 02:59 IST|Sakshi

కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల్లో రూ.2,234.288 కోట్లను ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఆ మేరకు నిధులను బహిరంగ మార్కెట్‌ ద్వారా సమీకరించి.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా ఏపీ ప్రభుత్వానికి ఇవ్వాలని నాబార్డుకు కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎల్కే త్రివేది ఆదేశాలు జారీ చేశారు. పీపీఏ నిర్ధారించిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగానికి తెలియజేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు సూచించారు. ఇకపై పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసేటప్పుడు పీపీఏ నిర్ధారించిన వ్యయాన్ని ఆధారంగా తీసుకుంటామని స్పష్టం చేశారు.

2013–14 ధరల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయాన్ని రూ.20,398.61 కోట్లుగా నిర్ధారిస్తేనే.. రూ.2,234.288 కోట్లను విడుదల చేస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు గత నెల 12న త్రివేది లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రాజెక్టుకు ఖర్చు చేసిన నిధులను కేంద్రం రీయింబర్స్‌ చేయడంలో జరుగుతున్న ఆలస్యం పోలవరం పనులపై పడుతోందని కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తే ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను పీపీఏ కూడా బలపరిచింది. దాంతో ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రాజెక్టు పనులకు విఘాతం కలగకుండా నిధులను విడుదల చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. ఈ క్రమంలో గత నెల 12న జారీ చేసిన షరతును ఉపసంహరించుకుంది.  

మరిన్ని వార్తలు