వేర్వేరుగా ఉత్తర్వులు..

23 May, 2021 05:48 IST|Sakshi

15 పేజీల ఉత్తర్వులు జస్టిస్‌ లలితవి.. ఒక పేజీలో ఉత్తర్వులిచ్చిన జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌

జస్టిస్‌ లలిత వ్యక్తం చేసిన ఆక్షేపణలు, అభిప్రాయాల జోలికెళ్లని జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌

ఎంపీ రఘురామకు బెయిల్‌ వచ్చాక బయటకొచ్చిన ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో ఏపీ సీఐడీ అదనపు డీజీ, ఎస్‌హెచ్‌వోలపై కోర్టు ధిక్కార చర్యలకు ఆదేశాలిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీ శనివారం బయటకొచ్చింది. ఈ నెల 19న జారీచేసిన ఈ ఉత్తర్వులు.. రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన మరుసటి రోజు బయటకు రావడం విశేషం. జాతీయ లీగల్‌ వెబ్‌సైట్‌లలో ఈ ఉత్తర్వులు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. హైకోర్టు తన ఉత్తర్వుల్లో ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి హితబోధ చేసింది. న్యాయమూర్తులు జస్టిస్‌  ప్రవీణ్‌కుమార్, జస్టిస్‌ లలితలు వేర్వేరుగా ఉత్తర్వులు వెలువరించారు. 16 పేజీల ఉత్తర్వుల్లో 15 పేజీలు జస్టిస్‌ లలితకు సంబంధించిన ఉత్తర్వులు కాగా, ఒక పేజీ జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఉత్తర్వులకు సంబంధించినది.

జస్టిస్‌ లలిత తన ఉత్తర్వుల్లో ఏఏజీ సుధాకర్‌రెడ్డి తీరును ఆక్షేపిస్తూ పలు వ్యాఖ్యలు చేయగా, జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాత్రం వాటి జోలికి వెళ్లలేదు. వాదనల సందర్భంగా స్వీయ నియంత్రణ పాటించడం అన్నది ఓ ప్రమాణ చిహ్నమని ప్రవీణ్‌కుమార్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాదనల సమయంలో ఆచితూచి పద ప్రయోగం చేయాలన్నారు. సుధాకర్‌రెడ్డి వాదనల సందర్భంగా హుందా, మంచి పదాలను ఉపయోగించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. 12 లైన్లలో ఆయన తన ఉత్తర్వులను ముగించారు. జస్టిస్‌ లలిత ఉత్తర్వులు మాత్రం ఇందుకు భిన్నంగా సాగాయి.  

న్యాయవాది ఏ విధంగా వ్యవహరించాలి.. న్యాయవాది భాష ఎలా ఉండాలన్న దానిపై ఆమె తన ఉత్తర్వుల్లో పలు వ్యాఖ్యలు చేశారు. సుధాకర్‌రెడ్డి వాదనలు ప్రాథమికంగా చూస్తే.. అవి కోర్టు ధిక్కార స్వభావాన్ని కలిగి ఉన్నాయని, ఆయనపై చర్యల నిమిత్తం బార్‌ కౌన్సిల్‌కు నివేదించేందుకు ఈ కేసు తగినదని పేర్కొన్నారు. ఆయన తీరు పునరావృతమైతే తగిన చర్యలు తీసుకునేందుకు ఈ కోర్టు వెనుకాడబోదన్నారు. సుధాకర్‌రెడ్డి స్వరం పెద్దది చేసి వాదనలు వినిపించడాన్ని జస్టిస్‌ లలిత తన ఉత్తర్వుల్లో ఆక్షేపించారు.   

మరిన్ని వార్తలు