మరణించి.. నలుగురిలో జీవించి..

11 Jun, 2021 05:36 IST|Sakshi
సన్యాసినాయుడు మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి సత్యవతి, కుటుంబసభ్యులు

బ్రెయిన్‌ డెడ్‌ అయిన యువకుని అవయవాలు దానం

గుండె, ఊపిరితిత్తులు సికింద్రాబాద్‌ తరలింపు

మృతుని తల్లిదండ్రుల ఔదార్యం

అచ్యుతాపురం/అక్కిరెడ్డిపాలెం : మృత్యువు ఒడి చేరుతూ ఆ యువకుడు మరికొందరికి జీవం పోశాడు. కన్నకొడుకు అవయవాలను దానం చేసి ఆ తల్లిదండ్రులు పెద్దమనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్‌ డెడ్‌ అయిన విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పెదపాడు గ్రామానికి చెందిన కట్టమూరి సన్యాసినాయుడు అలియాస్‌ వాసు (21) అవయవాలు గుండె, ఊపిరితిత్తులను గురువారం సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఐకాన్‌ ఆస్పత్రికి విమానంలో తరలించారు. వీటిని 67 ఏళ్ల వ్యక్తికి అవయవ మార్పిడి చేయనున్నట్లు విశాఖలోని ఐకాన్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వాసు ఈనెల 5న నల్లమారమ్మ గుడి వద్ద ట్రాక్టర్‌ ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని విశాఖలోని ఐకాన్‌ ఆస్పత్రికి తరలించారు. బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.

బతికే అవకాశం లేనందువల్ల అవయవాలను దానంచేస్తే మరికొందరికి ప్రాణదానం చేసినట్లు అవుతుందని అక్కడి వైద్యులు వాసు తల్లిదండ్రులు సత్యవతి, సత్యారావులకు తెలిపారు. కుమారుడు చనిపోయాడన్న బాధను దిగమింగుకుని అవయవ దానానికి వారు ముందుకొచ్చారు. గుండె, కాలేయం, కిడ్నీలు, నేత్రాలు, తదితర భాగాలను తొలగించి వాసు భౌతికదేహాన్ని వైద్యులు గురువారం కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. వాసు ఎస్‌ఈజెడ్‌లోని పరిశ్రమలో పనిచేస్తున్నాడు. తన చెల్లికి ఇటీవలే పెళ్లి చేశాడు. అవయవాలు దానం చేసి ఔదార్యం చాటుకున్న వాసు తల్లిదండ్రులను గ్రామస్తులు కొనియాడారు. 

మరిన్ని వార్తలు