ఏపీలో ‘ఆంధ్ర గోపుష్టి’ కేంద్రాలు.. విజయవాడలో తొలిస్టాల్‌

3 Sep, 2022 08:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సేంద్రియ దేశీ ఆవుపాల (ఏ–2) ఉత్పత్తులు మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ‘ఆంధ్ర గో పుష్టి’ పేరిట పాలు, వెన్న, నెయ్యి, పన్నీరు ఇలా వివిధ రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విజయవాడలో ఈ నెలాఖరున తొలి కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ఏర్పాటుచేయనున్నారు. జెర్సీ, హెచ్‌ఎఫ్‌ జాతి పశువుల నుంచి వచ్చే పాలను ఏ–1 పాలుగానూ.. ఒంగోలు, పుంగనూరుతో పాటు గిర్, సాహివాల్, రెడ్సింధీ జాతి దేశీ ఆవుల నుంచి వచ్చే పాలను ఏ–2 పాలుగా పిలుస్తారు.
చదవండి: మహా విపత్తుకు ముందస్తు సూచికే.. అడ్డుకోకపోతే వినాశనమే! 

మూపురం  కల్గిన పశువుల పాలల్లో హానికర రసాయనాలు (బీసీఎం–7) ఉండవని, వీటిలో కేసిన్‌ ప్రొటీన్‌ పదార్థం అధికంగా ఉండడంవల్ల క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కొనేందుకు చక్కని ఔషధంగా పనిచేస్తుందని పలు పరిశోధనల్లో నిర్ధారణ కావడంతో ఈ పాలకు అంతర్జాతీయంగా డిమాండ్‌ ఎక్కువ. విజయవాడ, వైజాగ్‌లో లీటర్‌ రూ.80–100 చొప్పున విక్రయిస్తుంటే, హైదరాబాద్‌లో రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తుంటారు. ఇక వీటి పేడ ద్వారా తయారుచేసే ఎరువును కిలో రూ.7 చొప్పున, మూత్రాన్ని లీటరు రూ.75 చొప్పున స్థానికంగా విక్రయిస్తున్నారు.

ఐదేళ్లలో దేశీవాళీ గోజాతి రెట్టింపు లక్ష్యం 
రాష్ట్రంలో 2019 పశుగణన ప్రకారం.. 7.87లక్షల దేశీ ఆవులు, 11.93 లక్షల సంకర, విదేశీ జాతి పశువులున్నాయి. రాష్ట్రానికి చెందిన ఒంగోలు, పుంగనూరుతో పాటు గిర్, సాహివాల్, రాతి, రెడ్సింధీ వంటి అంతరించిపోతున్న దేశీ నాటు ఆవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ సేంద్రీయ పాలు, పాల ఉత్పత్తులను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో 50 శాతం సబ్సిడీపై ఒక్కోటి రూ.30లక్షల అంచనా వ్యయంతో వైఎస్సార్‌ దేశవాళీ గో జాతుల పెంపకం కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేస్తోంది. ఇప్పటికే తొలివిడతలో గతేడాది 57 కేంద్రాలు ఏర్పాటుచేయగా, మలివిడతలో 52 కేంద్రాలు మంజూరు చేశారు. 27 కేంద్రాలు త్వరలో గ్రౌండింగ్‌ కానున్నాయి. ఒక్కో క్షేత్రంలో 20 దేశీ ఆవులు, ఓ ఆంబోతును అందిస్తుండగా, పునరుత్పత్తి ద్వారా వీటి సంతతిని ఐదేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  

ఆంధ్ర గో పుష్టి పేరిట బ్రాండింగ్‌ 
ఒక్కో ఆవు రోజుకు 6–8 లీటర్ల చొప్పున ఏడాదిలో 220 రోజులపాటు పాలు ఉత్పత్తి చేస్తాయి. పాల ఉత్పత్తి, వినియోగం క్రమేపి పెంచడం, ఉప ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడంతో పాటు ఆవుపేడ, గో మూత్రం, పంచగవ్య, జీవామృతం వంటి ఉప ఉత్పత్తులకు ‘ఆంధ్ర గో పుష్టి’ పేరిట ప్రత్యేక బ్రాండింగ్‌ ద్వారా మార్కెట్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వం  సంకల్పించింది. నేషనల్‌ స్టాండర్డ్స్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ప్రొడక్షన్‌ (ఎన్‌ఎస్‌ఓపీ) ప్రమాణాలతో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాలకు అదితి ఆర్గానిక్‌ సరి్టఫికేషన్‌ (బెంగళూరు) ద్వారా ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ చేయిస్తున్నారు.

ఏ–2 పాలు, పాల ఉత్పత్తుల విక్రయాల కోసం రైతుల ద్వారా ‘ఆంధ్ర గో పుష్టి’ పేరిట ప్రముఖ నగరాల్లో ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటుచేస్తున్నారు. విజయవాడలోని పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ కార్యాలయ ఆవరణలో తొలిస్టాల్‌ను ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో సేంద్రీయ పాలతో పాటు నెయ్యి, పన్నీరు వంటి ఉప ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మలివిడతలో విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి 50కు పైగా నగరాల్లో నెలకొల్పేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభించిన ఫిష్‌ ఆంధ్ర రిటైల్‌ అవుట్‌లెట్స్‌తో పాటు త్వరలో ఏర్పాటుచేస్తున్న అమూల్‌ అవుట్‌లెట్స్, రైతుభరోసా కేంద్రాల ద్వారా కూడా మార్కెటింగ్‌ చేసేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. త్వరలో ఈ–కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘జైవిక్‌ ఖేతి’ ద్వారా ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు కసరత్తు జరుగుతోంది.

సేంద్రియ పాల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ 
అంతరించిపోతున్న దేశీవాళీ ఆవుల సంతతిని వృద్ధి చేయడమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ దేశవాళి గో జాతుల పెంపకం కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. ఈ క్షేత్రాల్లోని దేశీ ఆవుల పాలు, పాల ఉత్పత్తులతోపాటు ఉప ఉత్పత్తులను ఆంధ్ర గో పుష్ఠి పేరిట మార్కెటింగ్‌ చేయాలని ప్రభుత్వం సంకలి్పంచింది. పాడి రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో ప్రత్యేకంగా స్టాల్స్‌ను ఏర్పాటుచేస్తున్నాం. తొలిస్టాల్‌ ఈనెలాఖరున విజయవాడలో అందుబాటులోకి రానుంది. 
– పూనం మాలకొండయ్య, స్పెషల్‌ సీఎస్, పశుసంవర్థక శాఖ  

మరిన్ని వార్తలు