లే‘టేస్ట్‌’ ట్రెండ్‌..!

8 Sep, 2023 04:56 IST|Sakshi

ఉద్యోగం చేస్తూనే నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీను చేపల పెంపకం 

ఆరు సెంట్ల స్థలంలో ఆర్గానిక్‌ పద్ధతిలో సాగు 

అదనపు ఆదాయం ఆర్జిస్తున్న సివిల్‌ ఇంజినీర్‌

మండపేట: నాటుకోడి... కౌజుపిట్ట... కొర్రమీను... ఇదీ ఇప్పుడు ట్రెండ్‌.. అటు రెస్టారెంట్లలో అందరి దృష్టి వీటిపైనే ఉంటోంది. ఇటు పెంపకంలోనూ వీటిపైనే యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. కొందరు ఉద్యోగం చేస్తూనే తమకున్న ఆసక్తి మేరకు కొద్దిపాటి స్థలంలో గేదెలు, ఆవులు, నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీను చేపలు వంటివి ఒకేచోట పెంచుతూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ఇదే తరహాలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మండలం పాలతోడు గ్రామానికి చెందిన పిల్లా విజయ్‌కుమార్‌ కేవలం ఆరు సెంట్ల స్థలంలో నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీను చేపలను ఆర్గానిక్‌ పద్ధతి­లో పెంచుతున్నాడు.

నెలకు రూ.40­వేల వరకు ఆదాయం పొందుతున్నాడు. డిప్లొమా సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివిన విజయ్‌కుమార్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సివిల్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. చిన్నతనం నుంచి పశుపోషణ, కోళ్ల పెంపకంపై ఆసక్తి కలిగిన అతను తన సొంతూరులో ఆరు సెంట్ల స్థలంలో నాలుగేళ్ల కిందట మూడు గేదెలు, రెండు ఆవులతో డెయిరీఫాం, నాటుకోళ్ల పెంపకం ప్రారంభించాడు. డెయిరీఫాం బాగానే ఉన్నా కార్మికుల సమస్యతో దానిని మధ్యలోనే ఆపేశాడు. అనంతరం కోళ్ల పెంపకంపై దృష్టి పెట్టాడు.

భీమవరం నుంచి మేలుజాతి కోడిపుంజులు, పెట్టలను తీసుకువచ్చి గుడ్లు ఉత్పత్తి చేయించి ఆర్గానిక్‌ తరహాలో పెంచడం ప్రారంభించాడు. ఆ తర్వాత హోటళ్లలో కౌజుపిట్టలకు మంచి గిరాకీ ఉందని గుర్తించి... రెండేళ్లుగా వాటిని కూడా పెంచుతున్నాడు. అంతటితో ఆగకుండా గతంలో ఏర్పాటుచేసిన డెయిరీ ఫాంలో పశువుల కోసం నిర్మించిన నీటి తొట్టెలలో ఏడాది నుంచి కొర్రమీను చేపల పెంపకం ప్రారంభించాడు.

హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూనే వారానికి ఒకసారి ఒకసారి వచ్చి అన్నీ చూసుకుని వెళతాడు. ఆయనకు కుటుంబ సభ్యులు సాయం చేస్తున్నారు. యూట్యూబ్‌ వీడియోల ఆధారంగా ఎప్పటికప్పుడు మెళకువలు తెలుసుకుంటూ కోళ్లు, చేపలు, కౌజుపిట్టల పోషణ చేస్తున్నాడు. యూట్యూబ్‌లో చూసి గుడ్లను పొదిగించేందుకు ఇన్వర్టర్‌పై పని చేసే ఇంక్యుబేటర్‌ను సొంతంగా ప్లేవుడ్‌తో తయారు చేసుకున్నాడు. దానిలోనే కోడిగుడ్లు, కౌజుపిట్ట గుడ్లు పొదిగిస్తున్నారు.

ఆదాయం బాగుంది 
నాటుకోళ్లు, కౌజుపిట్టలు, కొర్రమీనుల పెంపకం లాభసాటిగా ఉంది. వీటిని పూర్తి ఆర్గానిక్‌ పద్ధతుల్లో పెంచుతాం. గుడ్ల ఉత్పత్తికి వినియోగించే కోడి పుంజు రూ.75 వేలు కాగా, పెట్ట రూ.25 వేలు చొప్పున భీమవరంలో కొనుగోలు చేశా. ప్రస్తుతం వందకు పైగా కోళ్లు, 2,500 నుంచి 3,000 వరకు కౌజుపిట్టలు, 1,000 నుంచి 1,200 వరకు కొర్రమీను చేపలు పెంచుతున్నాం. మేత, ఇతర ఖర్చులు పోనూ ప్రతి నెలా రూ.35 వేల నుంచి రూ.40 వేల వరకు ఆదాయం వస్తోంది.  – పిల్లా విజయ్‌కుమార్,  పాలతోడు, మండపేట మండలం

మరిన్ని వార్తలు