సేంద్రీయ స్వదేశీ నాటు ఆవు పెంపకం క్షేత్రాలు

17 Feb, 2021 05:01 IST|Sakshi

అదనపు మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

అన్ని యూనిట్లకు ఒకే రీతిలో ఏర్పాటుకు చర్యలు

13 జిల్లాల్లో 58 యూనిట్లు ఏర్పాటుకు ఆదేశాలు

ఒక్కో యూనిట్‌ రూ.30 లక్షల అంచనాతో రూ.17.40 కోట్లతో ఏర్పాటు

ఆంధ్ర గో పుష్టి బ్రాండింగ్‌తో ఏ2 పాల ఉత్పత్తి మార్కెటింగ్‌

అమూల్, మత్స్య అవుట్‌లెట్స్, జనతా బజార్ల ద్వారా విక్రయాలు

సాక్షి, అమరావతి: సేంద్రీయ ఏ2 పాల ఉత్పత్తి లక్ష్యంగా స్వదేశీ ఆవుల పెంపకం క్షేత్రాలను ఏర్పాటు చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఇందుకు సంబంధించి అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం రాత్రి జీవో జారీ చేశారు. గతంలో నేషనల్‌ ఎడాప్షన్‌ ఫండ్‌ ఫర్‌ క్లైమేమెట్‌ చేంజ్‌ (ఎన్‌ఏఎఫ్‌సీసీ) ప్రాజెక్టు కింద నెల్లూరు, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో రూ.5.40 కోట్ల అంచనాతో 18 యూనిట్లు, మిగిలిన పది జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రూ.12 కోట్ల అంచనాతో 40 యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాగా, తాజా గైడ్‌లైన్స్‌లో ఆర్‌కేవీవై, ఎన్‌ఏఎఫ్‌సీసీ ఆర్థిక చేయూతతో అన్ని జిల్లాల్లోనూ ఒకే రీతిలో 58 యూనిట్లు ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలను జారీ చేశారు. లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో కమిటీలను ఏర్పాటు చేశారు. 

25 దేశీయ ఆవులు అందజేత
ఈ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. వీరికి ఒక్కొక్కటి రూ.75 వేల అంచనాతో రూ.17.50 లక్షల అంచనాతో 25 దేశీయ ఆవులు (గిర్, సాహివాల్, ఒంగోలు, పుంగనూరు తదితర జాతులు) అందజేస్తారు. ఇలా 58 యూనిట్ల కోసం రూ.10.15 కోట్లు ఇవ్వనున్నారు. ఈ గోవుల కోసం నిర్మించే షెడ్లు, ఫెన్సింగ్‌ కోసం ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షల చొప్పున రూ.5.80 కోట్లు, పాలు, పాల ఉత్పత్తిల తయారీ కోసం ఉపయోగించే పరికరాల కోసం ఒక్కో యూనిట్‌కు రూ.1,12,750 చొప్పున రూ.65.54 లక్షలు, నిర్వహణ ఖర్చుల కోసం ఒక్కో యూనిట్‌కు రూ.1,37,250 చొప్పున రూ.79.46 లక్షలు చెల్లించనున్నారు. ఈ విధంగా ఒక్కోయూనిట్‌ రూ.30 లక్షలుగా నిర్ణయించగా, దీంట్లో రూ.3 లక్షలు లబ్ధిదారులు భరించాల్సి ఉంది. రూ.18 లక్షలను ఆర్‌కేవీవై, ఎన్‌ఏఎఫ్‌సీసీ నిధుల నుంచి సమకూర్చనుండగా, రూ.9 లక్షలను వాణిజ్య బ్యాంకుల నుంచి రుణంగా మంజూరు చేయనున్నారు. 

కన్సల్టెంట్‌గా సురభి గోశాల నిర్వాహకుడు
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరకలపూడికి చెందిన సురభి గోశాల నిర్వాహకుడు వి.రవికుమార్‌ను కన్సల్టెంట్‌గా నియమించారు. లబ్ధిదారులకు శిక్షణనిచ్చే బాధ్యతను విశాఖపట్నం స్మైల్‌ అడిషనల్‌ డైరెక్టర్‌గు అప్పగించారు. ఈ ఆవులకు అవసరమైన ఇన్‌పుట్స్‌ను ఆర్‌బీకేల ద్వారా అందించనున్నారు. ఈ క్షేత్రాల నుంచి వచ్చే ఏ2 పాలు, పాల ఉత్పత్తులను ఆంధ్ర గో పుష్టి బ్రాండ్‌ నేమ్‌తో మార్కెటింగ్‌ చేయనున్నారు. అలాగే అమూల్, ఫిషరీస్‌ అవుట్‌లెట్స్‌తో పాటు జనతా బజార్లు, ఈ–మార్కెటింగ్‌ ద్వారా విక్రయాలను ప్రోత్సహించనున్నారు. మార్కెటింగ్‌ విక్రయాల కోసం జైవిక్‌ భారత్, ఇండియా ఆర్గానిక్‌ అనే యూనిఫైడ్‌ లోగోలను గుర్తించారు. ఇందుకోసం హైదరాబాద్‌కు చెందిన ఎన్‌ఐఎన్‌ సంస్థతో పశుసంవర్థక శాఖ ఎంవోయూ చేసుకోనుంది.  

మరిన్ని వార్తలు