అనకాపల్లి టు అమెరికా.. భలే గిరాకీ 

12 Jun, 2022 03:57 IST|Sakshi
పాకం చిక్కదనాన్ని పరిశీలిస్తున్న ఉద్యోగి, అందంగా అమర్చిన బెల్లం దిమ్మెలు

సేంద్రియ పద్ధతిలో బెల్లం తయారీ, ఎగుమతులు 

వినూత్న రీతిలో తయారు చేస్తున్న వేగి శ్రీనివాసరావు 

నాణ్యత, అత్యున్నత ప్రమాణాలకు పెద్దపీట 

విటమిన్లు, ఫ్లేవర్లు జత చేసి మార్కెట్లోకి..

ఆఫ్రికా, యూరప్‌ తదితర దేశాలకు బెల్లంతో పాటు ఉప ఉత్పత్తుల ఎగుమతులు 

తాజాగా అమెరికా నుంచీ ఆర్డర్లు  

చెరకు రైతుకూ ఎక్కువ ధర ఇస్తున్న శ్రీనివాసరావు 

అనకాపల్లి: తాతల నుంచి వచ్చిన వృత్తి.. దానికి వినూత్న ఆలోచనలు జత కలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలగలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం విటమిన్లు వేశారు. వెరసి అనకాపల్లి బెల్లం దేశదేశాలకు వెళ్తోంది. ఆంధ్రా నుంచి అమెరికాకు బెల్లాన్ని అందిస్తున్న ఆ రైతు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయనే వేగి శ్రీనివాసరావు.

ప్రధాన వాణిజ్య పంటల్లో ఒకటయిన చెరకు సాగు, ఉత్పత్తుల్లో ఆయన అద్భుతాలు సృష్టిస్తున్నారు. అత్యధిక నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఎటువంటి కలుషితం కాని బెల్లాన్ని అమెరికాకు కూడా ఎగుమతి చేస్తున్నారు. బీఏ, మెటలర్జీలో డిప్లొమా చదివిన శ్రీనివాసరావు సొంతూరు అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం రాజుపేట.  శ్రీనివాసరావుది వ్యవసాయ కుటుంబం.

తాతల కాలం నుంచి బెల్లం తయారీలో నిమగ్నమైన కుటుంబమది. శ్రీనివాసరావు కూడా వ్యవసాయం చేశారు. పామాయిల్, జీడిమామిడి, సరుగు సాగు చేశారు. అవి పెద్దగా కలిసి రాకపోవడంతో మళ్లీ బెల్లం తయారీపై దృష్టి సారించారు. తాతయ్య కాలం నుంచి వినియోగిస్తున్న బెల్లం క్రషర్‌తో బెల్లం తయారీ ప్రారంభించారు. ఇక్కడే ఆయన వినూత్నంగా ఆలోచించారు. మిగతా తయారీదారులకంటే తాను మరింత నాణ్యమైన సరుకు ఎలా తయారుచేయాలో ఆలోచించారు.

బెల్లం తయారీలో సహజంగా సల్ఫర్, పంచదార వినియోగిస్తుంటారు. అయితే మనిషి ఆరోగ్యానికి హాని కలగజేసే ఈ పదార్థాలను శ్రీనివాసరావు ఉపయోగించరు. సుక్రోజు, విటమిన్‌ ఏ, విటమిన్‌ సీ తగిన మోతాదులో కలిపి అత్యున్నత ప్రమాణాలతో బెల్లం తయారీ ప్రారంభించారు. పంచదారతో సంబంధం లేకుండా, రంగుకు ప్రాధాన్యమివ్వకుండా, హైడ్రోస్‌ కలపకుండా బెల్లం అందించడమే ఆయన లక్ష్యం.

ఇందుకోసం ఆయన తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో పర్యటించి ఆధునిక పద్ధతుల్లో బెల్లం తయారు చేసే యూనిట్లను పరిశీలించారు. మహారాష్ట్ర, కర్ణాటక, అనకాపల్లి పరిశోధన కేంద్రాల్లో విలువ ఆధారిత బెల్లం తయారీ గురించి తెలుసుకున్నారు.  

రూ.10 లక్షలతో ప్రారంభం 
సంప్రదాయ పద్ధతిలో బెల్లం తయారీకి మొదట రూ.10 లక్షలతో యూనిట్‌ను ప్రారంభించారు. 5 గ్రాముల నుంచి 850 గ్రాముల బరువు బెల్లం దిమ్మలు, కుందులు, పౌడర్, బెల్లం ద్రావణాన్ని తయారీ మొదలెట్టారు. క్రమంగా వ్యాపారం పెంచుకుంటూ పోయారు. భారత దేశం నుంచి ప్రపంచ దేశాలకు 8 మిలియన్‌ టన్నుల బెల్లం డిమాండ్‌ ఉంది.

ఆరు మిలియన్‌ టన్నుల బెల్లాన్ని మాత్రమే ఎగుమతి చేయగలుగుతున్నారు. దీంతో బెల్లం ఎగుమతి పైనా శ్రీనివాసరావు దృష్టి పెట్టారు. విదేశీయులు ఇష్టపడే ఫ్లేవర్లలో బెల్లం తయారు చేయాలని నిర్ణయించారు. రూ. 2.5 కోట్లతో కొత్త యూనిట్‌ నెలకొల్పారు. శ్రీనివాసరావు ఎరుకునాయుడు ఆగ్రోస్‌ కంపెనీ పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో బెల్లం తయారీ మొదలెట్టారు.

ఇందుకోసం అత్యాధునిక యంత్రాలు తెప్పించారు. 40 మంది నిపుణులైన ఉద్యోగులను నియమించారు. చక్కని ప్యాకింగ్‌తో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ముందుగా మారిషస్‌కు, తర్వాత ఆఫ్రికా, యూరోప్‌ దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటించినందుకు గాను ఐఎస్‌వో 22000, హెచ్‌ఏసీసీపీ, ఐఎస్‌వో 1001 పత్రాలను పొందారు. ప్రస్తుతం అమెరికా నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఏడాదికి 5 వేల టన్నుల చెరకు క్రషింగ్‌తో బెల్లం, ఉప ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు.

బెల్లం సరఫరాకు శ్రీనివాసరావుకు ఆఫ్రికా దేశం ఘనా నుంచి అందిన టెండర్‌ సర్టిఫికెట్‌   

రైతుకూ ఎక్కువ ధర 
ఒకవైపు చక్కెర కర్మాగారాలు గిట్టుబాటు కాక నష్టాల బాటన పడుతున్నాయి. చెరకు కొన్నందుకు రైతులకు కనీస ధర ఇవ్వలేకపోతున్నాయి. ఇదే సమయంలో శ్రీనివాసరావు చెరకు టన్నుకు రూ.2,800 వరకు ఇస్తున్నాడు. మాకవరపాలెం, నాతవరం, యలమంచిలి, గొలుగొండ, రోలుగుంట ప్రాంతాల నుంచి చెరకు కొంటున్నారు. శ్రీనివాసరావును ఆదర్శంగా తీసుకుంటే ప్రతి రైతు ఆదర్శ పారిశ్రామికవేత్త కావచ్చు.  

చెరకు సాగును కాపాడుకుందాం 
వాణిజ్య పంటైన చెరకు సాగును మనం కాపాడుకోవాలి. మా తాతగారు, తండ్రి ఆదర్శంగా బెల్లాన్ని నాణ్యత ప్రమాణాలతో తయారు చేస్తున్నా. రూ.10 లక్షలతో మా తండ్రి పేరిట ఆగ్రోస్‌ యూనిట్‌ నెలకొల్పా.

ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేసిన బెల్లాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నా. తాజాగా అమెరికా నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. మా దగ్గర తయారయ్యే బెల్లం నాణ్యతతో కూడుకొన్నది. సేంద్రియ పద్ధతుల్లో తయారు చేస్తున్నాం. అందువల్లే డిమాండ్‌ పెరుగుతోంది. 
– వేగి శ్రీనివాసరావు 

మరిన్ని వార్తలు