ఏపీ వైపు దేశం చూపు 

22 Jul, 2022 03:21 IST|Sakshi

ఆర్బీకేలను పరిశీలించేందుకు రాష్ట్రానికి క్యూ కడుతున్న ఇతర రాష్ట్రాలు 

ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు బృందాల పర్యటన 

ఇటీవలే రాష్ట్రానికి వచ్చిన రాజస్థాన్‌ వ్యవసాయ మంత్రి లాల్‌చంద్‌ కటారియా 

కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ సూచనతో మరిన్ని రాష్ట్రాలు ఏపీకి.. 

త్వరలో ఒడిశా, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, కేరళ, ఉత్తరప్రదేశ్, మిజోరాం, అసోం బృందాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆర్బీకేల్లో రైతులకు అందుతున్న సేవలపై వివిధ రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆర్బీకేల్లో అమలవుతున్న కార్యక్రమాలు, అందిస్తున్న సేవలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రతినిధి బృందాలు ఏపీలో పర్యటించి ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాలను తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటీవల బెంగళూరులో జరిగిన వ్యవసాయ, ఉద్యాన మంత్రుల జాతీయ స్థాయి సదస్సులో మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోన్న సంస్కరణల ఫలితంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులొచ్చాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య చెప్పారు.

ఈ సదస్సు ముగింపు సందర్భంగా కేంద్ర వ్యవసాయ, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ దిశా నిర్దేçశం చేస్తూ.. ఏపీని మోడల్‌గా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు సూచించారు. గ్రామ స్థాయిలో సేవలందించేందుకు ఏర్పాటు చేసిన ఆర్బీకే వ్యవస్థతో పాటు ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్, ఆర్బీకే చానల్, ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌ వంటి సౌకర్యాలను పరిశీలించి, మీ రాష్ట్రాల్లో కూడా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి ఏపీలో అమలవుతున్న కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పడంతో సదస్సుకు హాజరైన వివిధ రాష్ట్రాల మంత్రులు, అధికారులు ఆసక్తి చూపుతున్నారు.

వ్యవసాయ శాఖ మంత్రులు, అధికారుల ఆరా
సదస్సు ముగిసిన మర్నాడే రాజస్థాన్‌ వ్యవసాయ శాఖ మంత్రి లాల్‌చంద్‌ కటారియా తన బృందంతో కలిసి ఏపీలో పర్యటించారు. తిరుపతి జిల్లాలోని ఓ ఆర్బీకేను సందర్శించి, కేంద్రంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలతో పాటు.. గ్రామ స్థాయిలో అందిస్తోన్న సేవలను పరిశీలించి ఆశ్చర్యపోయారు. ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయని కితాబునిచ్చారు. తమ ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే ఉన్నత స్థాయి బృందాన్ని ఏపీ పర్యటనకు పంపిస్తామని ప్రకటించారు. తాజాగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, కేరళ, ఉత్తరప్రదేశ్, మిజోరాం, అస్సోం రాష్ట్రాలు ఆసక్తి చూపిస్తున్నాయి.

ఆయా రాష్ట్రాల మంత్రులు, వ్యవసాయ శాఖ కార్యదర్శులు ఏపీ వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌కు ఫోన్‌ చేసి, ఏపీలో తీసుకొచ్చిన సంస్కరణలు, అమలవుతున్న కార్యక్రమాల గురించి ఆరా తీశారు. ఆర్బీకేల తరహాలోనే తమ రాష్ట్రాల్లో గ్రామ స్థాయిలో సేవలు అందుబాటులోకి తీసుకురావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. రైతు సంబంధిత కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా అందిపుచ్చుకోవాలి.. తదితర విషయాలపై అధ్యయనం చేసేందుకు త్వరలోనే తమ రాష్ట్ర ప్రతినిధి బృందాలు ఏపీలో పర్యటిస్తాయని ప్రకటించారు.

సాంకేతిక సహకారానికి సిద్ధం
కేంద్రంతో సహా వివిధ రాష్ట్రాలు ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలను అందిపుచ్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. తెలంగాణలో కాల్‌ సెంటర్, ఆర్బీకే చానల్‌ తీసుకొస్తున్నారు. తమిళనాడులో గ్రామ స్థాయిలో సేవలందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే తరహాలో మిగిలిన రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. జాతీయ సదస్సు తర్వాత ప్రతి రోజు ఏదో రాష్ట్రం నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఏడు రాష్ట్రాలు ఏపీలో పర్యటించేందుకు ఆసక్తి చూపాయి. మరిన్ని రాష్ట్రాలు ఏపీకి వచ్చే అవకాశాలున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో వరుసగా ఈ బృందాలు రాష్ట్రంలో పర్యటించనున్నాయి. వారికి అవసరమైన సాంకేతికత అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.
– పూనం మాలకొండయ్య, స్పెషల్‌ సీఎస్, వ్యవసాయ శాఖ 

మరిన్ని వార్తలు