కెమెరాలకు చిక్కిన అరుదైన ఏటి కుక్కలు.. ఎప్పుడైనా చూశారా?

22 Aug, 2022 15:27 IST|Sakshi
కొండకర్ల ఆవలో డిజిటల్‌ కెమెరాలకు చిక్కిన ఏటి కుక్కలు 

సాక్షి, విశాఖపట్నం: ఏటి కుక్కలను ఎప్పుడైనా చూశారా? వాటి పేరైనా విన్నారా? ఏ కొద్దిమందికో తప్ప వీటి గురించి అసలు తెలియనే తెలియదు. ఎందుకంటే ఇవి అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయి. అలాంటి అత్యంత అరుదైన ఏటి కుక్కలు మన ఉమ్మడి విశాఖ జిల్లా (ప్రస్తుత అనకాపల్లి జిల్లా)లోని అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవలో ఉన్నట్టు వెలుగులోకి వచ్చాయి. అక్కడే అవి ఆవాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కృష్ణా రివర్‌ బేసిన్‌లోను, తూర్పు గోదావరి జిల్లా కోరింగ మడ అడవుల ప్రాంతంలోనూ ఇవి ఉనికిలో ఉన్నాయి. తాజాగా కొండకర్ల ఆవలోనూ ఇవి మనుగడలో ఉన్నట్టు ఈస్ట్‌ కోస్ట్‌ కన్జర్వేషన్‌ టీమ్‌ (ఈసీసీటీ), గ్రీన్‌ పా సంస్థలు గుర్తించాయి.
చదవండి: ఇద్దరి పిల్లల తల్లి.. ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. చివరకు..

కెమెరాతో బంధించి.. 
ఏటి కుక్కలు పగటి పూట మనుషులకు కనిపించే పరిస్థితి లేకపోవడంతో కొండకర్ల ఆవలో వాటి జాడ తెలుసుకోవడానికి మూడు చోట్ల ఈసీసీటీ సభ్యులు ప్రత్యేక డిజిటల్‌ కెమెరాలను అమర్చారు. కొన్ని రోజులకు అవి ఈ కెమెరాలకు చిక్కాయి. దీంతో వాటిని అంతరించిపోతున్న ఏటి కుక్కలు (స్మూత్‌ కోటెడ్‌ ఆటర్స్‌)గా నిర్ధారణకు వచ్చారు. ఇందుకోసం నలుగురు ఈసీసీటీ, గ్రీన్‌ పా సభ్యులు దాదాపు నాలుగు నెలల పాటు అధ్యయనం చేశారు. ఇక్కడ అరుదైన ఏటి కుక్కల జాడ గురించి ఇటీవల ఐయూసీఎన్‌/ఎస్‌ఎస్‌సీ ఆటర్‌ స్పెషలిస్టు గ్రూప్‌ బులెటిన్‌ (జర్నల్‌)లోనూ ప్రచురించారు.

ఏమిటీ ఏటి కుక్కలు? 
ఏటి కుక్కలు ముంగిసను పోలిన ఆకారంలో వాటికంటే పెద్దగా, ఊరకుక్కలకంటే చిన్నవిగా ఉంటాయి. నీటిలోనే ఎక్కువగా మనుగడ సాగిస్తాయి. ఈదుకుంటూ తిరుగుతుంటాయి. నదులు, సరస్సులుండే ప్రాంతాల్లో ఇవి నివశిస్తాయి. 37–43 సెం.మీల తోక, 59–64 సెం.మీల పొడవుతో, 7–11 కిలోల బరువును కలిగి ఉంటాయి. పగటి పూట మనుషులకు కనిపించకుండా మడ అడవులు, జమ్ము గడ్డి వంటి దట్టంగా ఉండే ప్రాంతాల్లోను, గట్లకు చిన్నపాటి గోతులు చేసుకుని వాటిలో ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. రాత్రి వేళ నదులు/సరస్సుల్లోని చేపలను ఎక్కువగా తింటాయి. అప్పుడప్పుడు పాములు, పక్షులను కూడా ఆహారంగా చేసుకుంటాయి.

సంతతి పెరుగుతోంది.. 
కొండకర్ల ఆవలో ఏటి కుక్కల జాడ వెలుగు చూడడం ఒక విశేషమైతే వాటి సంతతి పెరుగుతుండడం మరో విశేషం. ఇక్కడ ఆరేడేళ్ల క్రితంకంటే ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయని ఆవలో చేపలవేట సాగించే మత్స్యకారులు చెబుతున్నారు. అయితే ఇవి మనుషులకు ఎలాంటి హాని చేయనందువల్ల వీటిని చూసి వీరు భయపడం లేదు. కానీ వలలో పడిన చేపలను తినడానికి వలలను పాడు చేస్తుండడంతో వీరికి నష్టాన్ని చేకూరుస్తున్నాయి.

అవి అరుదైన ఏటి కుక్కలే.. 
కొండకర్ల ఆవలో వెలుగులోకి వచ్చిన ఏటి కుక్కలు అంతరించి పోతున్న జాతులకు చెందినవే. ఇవి ఇప్పటివరకు రాష్ట్రంలో కోరింగ మడ అడవులు, కృష్ణా రివర్‌ బేసిన్‌ తదితర ప్రాంతాల్లోనూ ఉంటున్నట్టు గుర్తించారు. ఏటి కుక్కలు ఈ ఆవలో మనుగడ సాగించడానికి అనువైన ప్రాంతం. మనుషుల నుంచి వీటికి హాని జరగకుండా సంరక్షించాల్సిన అవసరం ఉంది.  
– అనంత శంకర్, డీఎఫ్‌ఓ, విశాఖపట్నం

మరిన్ని వార్తలు