'ఆ పార్టీల వైఖరిని ప్రతి హిందువు ఛీత్కరించే రోజు వచ్చింది'

8 Jan, 2021 13:18 IST|Sakshi

సాక్షి, తిరుపతి: రామతీర్థం ఘటనపై టీడీపీ, బీజేపీ నాయకులు రాజకీయ క్రీడ ఆడుతున్నారని టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ మండిపడ్డారు. మఠాధిపతులు, పీఠాధిపతులు ఒక్కొక్కరు ఒక్కో పార్టీ తరపున మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేవాలయాలపై దాడులు చేయిస్తున్నారని రాజకీయ పార్టీలు చెప్పడం రాజకీయ కుట్రే. గతంలో చంద్రబాబునాయుడు దేవాలయాలను కూల్చివేస్తే హిందూ ధర్మం అని ఆనాడు టీడీపీ నాయకులు పేర్కొన్నారని తెలిపారు. చదవండి: (మత విద్వేషాలకు భారీ కుట్ర)

రాజకీయ పార్టీలు నేడు వాటి అవసరాల కోసం, స్వార్థం కోసం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ తీరు ఎలా ఉందంటే ఏడు కొండలు కావాలా, రెండు కొండలు కావాలా, భగవద్గీత కావాలా, బైబిల్‌ కావాలా అనడం మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తామని కుల, మతాలకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికలు అయిపోగానే సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ, బీజేపీ పార్టీలు జైశ్రీరాం అనడం సరికాదన్నారు. బీజేపీ ఉపఎన్నికల్లో లబ్ధి కోసమే హిందూ దేవాలయాలను అడ్డుపెట్టుకొని హిందూ మనోభావాలు దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ జై శ్రీరాం అని కాకుండా ప్రజలకు మేము ఈ సంక్షేమ పథకాలు తెచ్చాం, అభివృద్ధి చేశామని చెప్పలేదు. వారు ఏనాడు అభివృద్ధి పనులను చేసింది లేదన్నారు. టీడీపీ, బీజేపీ వైఖరిపై ప్రతి హిందువు కూడా మిమ్మల్ని ఛీత్కరించే రోజు వచ్చిందన్నారు. చదవండి: (చరిత్రలో తొలిసారిగా.. దేవాలయానికి ప్రభుత్వ నిధులు)

మరిన్ని వార్తలు