వికేంద్రీకరణ బిల్లులపై ఎప్పుడేం జరిగిందంటే..

23 Nov, 2021 08:05 IST|Sakshi

సాక్షి, అమరావతి: 2019 సెప్టెంబరు 13: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు రిటైర్డు ఐఏఎస్‌ అధికారి జీఎన్‌రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.

2019 డిసెంబర్‌ 20: రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని, అమరావతిలో శాసన రాజధాని, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఇచ్చింది.

2019 డిసెంబర్‌ 27: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై జీఎన్‌ రావు కమిటీ ఇచ్చిన నివేదిక, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) ఇవ్వనున్న నివేదికలపై అధ్యయనం చేసేందుకు హైపవర్‌ కమిటీకి మంత్రివర్గం ఆమోదం.

2019 డిసెంబర్‌ 29: జీఎన్‌ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై అధ్యయనం చేసి.. నివేదిక ఇచ్చేందుకు మంత్రులతో హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.

2020 జనవరి 3: రాష్ట్ర సమగ్ర, సమతుల అభివృద్ధికి పరిపాలన వికేంద్రీకరణే ఏకైక మార్గమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు నివేదిక ఇచ్చిన బీసీజీ.  అమరావతిలో శాసన రాజధాని, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని సిఫార్సు.
 

2020 జనవరి 17: జీఎన్‌ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై అధ్యయనం చేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు నివేదిక ఇచ్చిన హైపవర్‌ కమిటీ.

2020 జనవరి 20: హైపవర్‌ కమిటీ నివేదికపై చర్చించిన మంత్రివర్గం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన మంత్రివర్గం. ఆ బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. బిల్లును ఆమోదించిన శాసనసభ.

2020 జనవరి 22: శాసనమండలి ముందుకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లు

2020 జూన్‌ 16: రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును రెండోసారి శాసన సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. ఆమోదించిన శాసన సభ.

2021 నవంబర్‌ 22: రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం, ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ.. మనోభావాలను గౌరవిస్తూ తెచ్చిన వికేంద్రీకరణ బిల్లుపై కొందరు అపోహలు, అనుమానాలు, న్యాయపరమైన చిక్కులు సృష్టిస్తుండటంతో వాటిని నివృత్తి చేస్తూ సమగ్ర బిల్లును సభ ముందుకు తేవడం కోసం శాసన సభలో వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్న ప్రభుత్వం. 

మరిన్ని వార్తలు