టీడీపీ సభ్యుల తిట్లపురాణం.. తాము చెప్పినట్లే సభ జరగాలని హంగామా!

17 Sep, 2022 07:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: శాసనసభలో రెండో రోజు శుక్రవారం కూడా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. స్పీకర్‌ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేస్తూ సభ జరగకుండా అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాంను ఏకవచనంతో సంబోధిస్తూ అవమానకరంగా మాట్లాడారు. సభలో ప్రభుత్వం ప్రారంభించిన చర్చ జరగకుండా అడ్డుకోవడం, గొడవ చేయడం ద్వారా సస్పెన్షన్‌ వేటు వేయించుకుని సభ నుంచి బయటకు వెళ్లిపోవడమే లక్ష్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు హంగామా చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత తాము వాయిదా తీర్మానం ఇచ్చిన ధరల పెరుగుదలపై చర్చ జరగాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దాన్ని తిరస్కరించినట్లు చెప్పిన స్పీకర్‌ బిల్లులు ప్రవేశపెట్టేందుకు అనుమతించారు.

ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా ప్ల కార్డులు పట్టుకుని బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేసుకుంటూ స్పీకర్‌ పోడియంపైకి ఎక్కారు. ఒకవైపు మంత్రులు బిల్లులు ప్రవేశపెడుతున్నా పట్టించుకోకుండా వారు మాట్లాడే విషయాలు వినపడకుండా పోడియంను కొడుతూ పెద్దగా నినాదాలు చేశారు. స్పీకర్‌ను తిడుతూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ జోక్యంచేసుకుని ఉద్దేశపూర్వకంగా సభలో గందరగోళం సృష్టిస్తున్నారని సభను ఆర్డర్‌లో పెట్టాలని స్పీకర్‌ను కోరారు. స్పీకర్‌ ఎంతచెప్పినా వినకుండా టీడీపీ ఎమ్మెల్యేలు గొడవచేస్తూనే ఉన్నారు. దీంతో శాసనసభా వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి జోక్యం చేసుకుని కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం ఉన్న విషయం తెలిసి కూడా ధరల గురించి టీడీపీ సభ్యులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని తెలిపారు.

బిల్లులు ప్రవేశపెట్టకుండా అడ్డుకునేలా టీడీపీ సభ్యులు మరింత రెచ్చిపోవడంతో సభ సజావుగా జరిగేందుకు వారిని సస్పెండ్‌ చేయాలని బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రతిపాదించారు. ఈ సమయంలోనూ టీడీపీ సభ్యులు స్పీకర్‌పైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని ఆపుతున్న మార్షల్స్‌ని నెట్టేస్తూ వారితో వాగ్వాదానికి దిగి దుర్భాషలాడారు. మార్షల్స్‌ ఐడీ కార్డులు అడుగుతూ వారిని తోసేయడంతో గందరగోళం నెలకొంది.

దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, కింజరాపు అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, వేగుళ్ల జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయస్వామిలను సభ నుంచి ఒకరోజు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. ఆ తర్వాత కూడా వారు బయటకెళ్లకుండా మార్షల్స్‌తో తోపులాటకు దిగారు. తన అనుమతితోనే మార్షల్స్‌ సభలోకి వచ్చారని వారిని ఐడీ కార్డులు అడగడం ఏమిటని గట్టిగా హెచ్చరించడంతో టీడీపీ సభ్యులు గట్టిగా అరుపులు, కేకలు వేసుకుంటూ బయటకెళ్లిపోయారు. 

టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ ఆవేదన 
స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెడుతుంటే అవేంటో కూడా తెలియకుండా సభను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది చాలా బాధాకరమని ప్రతిరోజు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి గొడవ చేస్తున్నారని వాపోయారు. వాళ్లవల్ల మిగిలిన సభ్యులంతా ఇబ్బంది పడుతున్నారన్నారు. వారిపట్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని శాసనసభా వ్యవహారాల మంత్రికి సూచించారు. సంస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారని, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న తనకు చాలా బాధగా ఉందన్నారు.   

మరిన్ని వార్తలు