లావైపోతున్నారు! ముంచేస్తున్న ఆహారపు అలవాట్లు..చుట్టుముడుతున్న వ్యాధులు

7 Feb, 2023 10:08 IST|Sakshi

ఊబకాయం.. ఇప్పుడు సాధారణమైపోయింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ సమస్య పీడిస్తోంది. దీని ప్రభావం శరీరంలోని మిగతా అవయవాల మీద పడుతోంది. ఫలితంగా గుండె, కిడ్నీ, మధుమేహం వంటి వ్యాధులకు మూలమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఊబకాయం నివారణకు జీవనశైలిని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుత ఆహారపు అలవాట్లు లావు కావడానికి ఒక కారణమైతే, సరైన వ్యాయామం లేకపోవడం మరో కారణమని జాతీయ ఆరోగ్య మిషన్‌ చేసిన సర్వేలో తేలింది. శ్రమగల జీవన విధానం, సమతులాహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ సర్వే స్పష్టం చేసింది.   

సాక్షి, చిత్తూరు రూరల్‌: ప్రస్తుత పరిస్థితుల్లో ఊబకాయం పెరిగిపోతోంది. దానికి తోడు వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అధిక బరువు ఉన్న వారిని గుండె జబ్బులతో పాటు, బ్రెయిన్‌ స్ట్రోక్, కిడ్నీ, కీళ్ల సమస్యలు వెంటాడుతున్నాయి. ఊబకాయులు ఇటీవల అనేక దుష్ఫలితాలతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి క్యూ కడుతున్నారు. కార్డియాలజీ రోగుల్లో 25 శాతం మంది ఊబకాయులే ఉంటున్నారు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, తగిన వ్యాయామం లేకపోవడం వల్ల ఈ ఊబకాయం బారిన పడుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ నిర్వహిస్తున్న నాన్‌ కమ్యూనికల్‌ డిసీజెస్‌ (ఎన్‌ఎసీడీ) సర్వేలో సైతం ఒబెసిటీ కారణంగా రక్త పోటు, మధుమేహం, గుండె జబ్బులు సోకుతున్నట్లు తేలింది.

జిల్లాలో 17,54,254 మంది ఉండగా 12,99,758 మందిని ఎన్‌సీడీ సర్వే చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా సర్వే 74.09శాతం పూర్తయింది. అయితే ఈ సర్వేలో బీపీతో బాధపడుతున్నవారు 1,96,772 మంది, మధుమేహంతో 1,96,957 మంది, రెండు ఉన్నవారు 17,675 మంది ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధులు ప్రబలడానికి ప్రధాన కారణం ప్రజల ఆహార అలవాట్లు, జీవనశైలి, అధికబరువు వంటివి అని వైద్యులు చెబుతున్నారు.   

బరువుతో గుండె బలహీనత  
గుండె జబ్బుల బారిన పడుతున్న వారిలో ఊబకాయులే ఎక్కువగా ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో కార్డియాలజీ ఓపీల సంఖ్య పెరుగుతోంది. రోజుకు జిల్లాలో 200 నుంచి 250 మంది వరకూ రోగులు వస్తున్నట్లు వైద్యులు లెక్కలు చెబుతున్నాయి. వారిలో 25 శాతం మంది అంటే 55 మంది ఊబకాయులే. వారిలో గుండె రక్తనాళాలు సన్నబడి బ్లాకులు ఏర్పడటం, గుండెపై తీవ్ర ఒత్తిడి, పల్మనరీ ఎంబోలిజమ్, పల్మనరీ హైపర్‌ టెన్షన్‌ వంటి సమస్యలను వైద్యులు గుర్తిస్తున్నారు. రక్తనాళాల్లో బ్లాకులు ఉన్న వారికి వాటిని తొలగించి స్టెంట్లు వేస్తున్నారు.  

కిడ్నీ సమస్యలు 
ఒబెసిటీ కారణంగా కిడ్నీలపై ఒత్తిడి పడుతోంది. ఆ కారణంగా ఫిల్టర్లు దెబ్బతింటున్నాయి. దీంతో యూరిన్లో ప్రొటీన్లు లీకవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. కాళ్ల వాపులు రావడం, కిడ్నీలు పూర్తిగా పాడైన వారిని చూస్తున్నారు. ఊబకాయుల్లో వచ్చే మధుమేహం, రక్తపోటు కారణంగా కిడ్నీలు దెబ్బతిన్న వారు డయాలసిస్‌ కోసం వస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిత్యం 50 నుంచి 65 మంది డయాలసిస్‌ చేయించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.   

ఇతర వ్యాధులు 

  •  ఒబెసిటీ వారిలో రక్తపోటు, మధుమేహం వలన వచ్చే దుష్ఫలితాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.  
  •  ఒబెసిటీ ఉన్న వారిలో పదిశాతం మందికి గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడుతున్నాయి.  
  • ఫ్యాటీ లివర్‌ ఏర్పడి, దీర్ఘకాలంలో తీవ్రమైన లివర్‌ సమస్యలు తలెత్తుతున్నాయి.  
  • మోకీళ్లపై ప్రభావం చూపి, నాలుగు పదుల వయసులోనే మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తోంది.   

బరువు పెరగడానికి కారణాలు 
పట్టణాల నుంచి పల్లెల వరకు జంక్‌ఫుడ్‌ వినియోగం పెరిగింది. పిజ్జాలు, బర్గర్లు, ప్యాకేజ్డ్‌ఫుడ్, ఐస్‌క్రీమ్‌లు, వేపుళ్లు తెచ్చుకుని తినడం ఫ్యాషన్‌గా మారింది. మనసు కోరుకుంటే చాలు వెంటనే చేతిలోని మొబైల్‌లోని కొన్ని యాప్‌లద్వారా జంక్‌ఫుడ్‌ను ఆర్డర్‌ పెడితే  క్షణాల్లో గుమ్మం ముందు డెలివరీ చేస్తున్నారు. దీనికి తోడు రెస్టారెంట్లలో విక్రయించే ఆహారాల్లో బిర్యానిదే మొదటిస్థానం. ఇందులో అధిక శాతం క్యాలరీలు ఉండడం, వీటికి తోడు కూల్‌డ్రింక్‌లు తాగడం వల్ల తక్కువ సమయంలోనే మగవారితోపాటు అధికంగా మహిళలకు ఊబకాయం వచ్చేస్తోంది.   

ఇలా చేస్తే మేలు  

  •  దేశంలో బాడీ మాస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) 23.5 దాటిన వారందరినీ ఊబకాయులుగా భావిస్తారు.  
  •  వారు బరువు తగ్గేందుకు శ్రమగల జీవన విధానం, సమతుల ఆహారం తీసుకుంటే సత్పలితాలు రాబట్టవచ్చు. 
  • బరువు తగ్గేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక విధానాలు ఉన్నాయి. దీర్ఘకాల విధానంలో వారానికి మూడు, నాలుగు గంటలు వ్యాయామం ద్వారా బరువు చేయడం తగ్గించుకోవచ్చు. 
  • స్వల్పకాలంలో రోజుకు వెయ్యి కేలరీల కంటే తక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. బీఎంఐ27 శాతం కంటే ఎక్కువ ఉన్న వారికి మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ పద్ధతులను అనుసరించినా బరువు తగ్గకుంటే బీఎంఐ 30 శాతం దాటిన వారికి బేరియాట్రిక్‌ (మెటబాలిక్‌) సర్జరీలతో సత్ఫలితాలు సాధిస్తున్నారు.   

బరువు తగ్గితే మంచిది 
ఊబకాయం ఉన్న మధుమేహులు తమ బరువులో ఐదు శాతం తగ్గించుకోగా తక్కువ మందులతో మెరుగైన వ్యాధి నియంత్రణా ఫలితాలు రాబట్టవచ్చు. హృద్రోగ సమస్యలను నివారించుకోవచ్చు. సమతుల ఆహారం, క్రమగల జీవన విధానం, జీవనశైలిలో మార్పులు పాటించడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. ఊబకాయుల్లో మధుమేహ నియంత్రణకు ఆధునిక మందులు అందుబాటులోకి వచ్చాయి.  
– డాక్టర్‌ అరుణ్‌కుమార్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ 


      

మరిన్ని వార్తలు