మేం స్వతంత్రంగా వ్యవహరించలేం 

17 Dec, 2021 05:33 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వ వైఖరే మా వైఖరి 

హైకోర్టుకు నివేదించిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం

సాక్షి, అమరావతి:  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరే తమ వైఖరి అని స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం గురువారం హైకోర్టుకు నివేదించింది. తమది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయినందువల్ల స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదని స్టీల్‌ ప్లాంట్‌ తరఫు న్యాయవాది డబ్ల్యూబీ శ్రీనివాస్‌ హైకోర్టుకు నివేదించారు. ప్రైవేటీకరణకు అనుకూలంగాకానీ, వ్యతిరేకంగాకానీ తమ వైఖరిని చెప్పలేమన్నారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌నే తాము అన్వయింప చేసుకుంటున్నామని ఆయన వివరించారు.

స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం తన వైఖరిని స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రైవేటీకరణపై ఫిబ్రవరి 2న తుది విచారణ మొదలు పెడతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ లోపు ప్రైవేటీకరణ విషయంలో ఏవైనా కీలక పరిణామాలు ఉంటే వాటిని కోర్టు దృష్టికి తీసుకొచ్చి, ముందస్తు విచారణ కోరవచ్చునంటూ పిటిషనర్లకు హైకోర్టు స్వేచ్ఛనిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను సవాలు చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో పాటు మరొకరు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది.

ఈ సందర్భంగా కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఎన్‌.హరినాథ్‌ వాదనలు వినిపిస్తూ, స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్‌ దాఖలు చేసిందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం ఇంకా కౌంటర్‌ దాఖలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం తరఫు న్యాయవాది స్పందించారు. జేడీ లక్ష్మీనారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయంగా పలు మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం సూచించగా.. వాటిని కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఈ వ్యాజ్యాలపై వీలైనంత త్వరగా విచారణ జరిపి కేంద్రం నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరారు. 

మరిన్ని వార్తలు