నెరవేరుతున్న పేదల సొంతింటి కల... రూపాయికే రిజిస్ట్రేషన్‌

8 Sep, 2022 21:05 IST|Sakshi

శరవేగంగా టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

వైఎస్సార్‌ జిల్లాలో పూర్తయిన టిడ్కో ఇళ్లు 5,556

300 చదరపు అడుగుల ఇళ్లు తీసుకున్న 2352 మందికి రూపాయికే రిజిస్ట్రేషన్లు

ఒక్కో ఇంటిపై రిజిస్ట్రేషన్‌ ఖర్చు రూ. 50 వేలను ప్రభుత్వమే భరిస్తున్న వైనం

కడప కార్పొరేషన్‌(వైఎస్సార్‌ జిల్లా): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన మరో హామీ అమలు జరుగుతోంది.  ముఖ్యమంత్రి ఇచ్చిన మాట మేరకు అధికారులు  టిడ్కో ఇళ్లను రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తున్నారు. తద్వారా ఒక్కో ఇంటిపై రిజిస్ట్రేషన్‌కు అయ్యే సుమారు రూ.50 వేలను ప్రభుత్వమే భరిస్తోంది. పదిరోజులుగా  జిల్లాలో ఈ ప్రక్రియ  శరవేగంగా సాగుతోంది.  

∙గత ప్రభుత్వం పేదల కోసమని చెప్పి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో 300, 365, 425 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని యోచించింది.  అయితే 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేపట్టిన ఈ నిర్మాణాలు ఆ ప్రభుత్వం దిగిపోయేనాటికి పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయాయి. 

ప్రజా సంకల్పయాత్రలో పేదలందరికీ ఉచితంగా ఇళ్లు ఇస్తామని  ప్రకటించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, టీడీపీ ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లలో మొదటి కేటగిరికి చెందిన 300 చదరపు అడుగుల ఇళ్లను రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన  ఈ మూడేళ్లలో మొండిగోడలు, వసతుల లేమితో ఉన్న టిడ్కో ఇళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.  కరెంటు, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, కాలువలు వంటి మౌళిక వసతులు సమకూర్చి టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్‌ చేపట్టారు.  

టిడ్కో ఇళ్లకు దరఖాస్తు చేసుకొని ఎవరైనా మరణించి ఉంటే వారి వారసులకు ఇళ్లను ఇచ్చేలా అధికారులు  చర్యలు చేపట్టారు.కడపలో 2432, జమ్మలమడుగులో 1440, ఎర్రగుంట్లలో 1584, ప్రొద్దుటూరులో 144 ఇళ్ల చొప్పున మొత్తం 5,556 ఇళ్లు పూర్తయ్యాయి.  ఇందులో మొదటి విడతగా కడపలో 1776, జమ్మలమడుగులో 576, యర్రగుంట్లలో 1584 ఇళ్లను రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. కాగా కడప, జమ్మలమడుగులో మాత్రమే రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. ఈ మేరకు  జిల్లాలో ఆగష్టు 25వ తేది నుంచి ఇళ్ల రిజిస్ట్రేషన్‌ ప్రారంభించి శరవేగంగా పూర్తి చేస్తున్నారు.  

సాధారణంగా ఒక సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఒకరోజుకు 20 రిజిస్ట్రేషన్లు జరిగాయంటే చాలా గొప్పగా చెబుతుంటారు. అలాంటిది ఇప్పుడు  ఒక్కో సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలో  రోజుకు 30కి తక్కువగాకుండా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.  

కడపలో ఆగష్టు  25వ తేది 39, 26వ తేది 74, 27వ తేది 92, 28వ తేది 83, 29వ తేది 65, 30వ తేది 31 రిజిస్ట్రేషన్లు జరిగాయి. 26, 27, 28 తేదీలలో 70 మార్కు దాటడం విశేషంగా చెప్పవచ్చు.  ఇలా మొదటి దశలో 480 ఇళ్లకుగాను 384 ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. అలాగే రెండవ దశలో 1200 ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి 435 రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. జమ్మలమడుగులో 246 ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. ఇంకా 330 రిజిస్ట్రేషన్లు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  తమ సొంత ఇంటికల నెరవేరుతున్నందుకు లబ్ధిదారులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.  

పదిరోజుల్లో రిజిస్ట్రేషన్లు పూర్తి చేసేందుకు చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు రూపాయికే  రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని నిర్ణయించడం శుభ పరిణామం. టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లు మరో పది రోజులకు పూర్తి చేసేలా కసరత్తు పూర్తి చేశాం. కడపలో ఇప్పటికే 819 రిజిస్ట్రేషన్లు పూర్తి చేశాము. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నిర్దేశించిన సమయానికి రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 
– సూర్యసాయి ప్రవీణ్‌చంద్, కమిషనర్, కడప నగరపాలక సంస్థ

మరిన్ని వార్తలు