కృష్ణపట్నం చేరుకున్న ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌

22 May, 2021 05:59 IST|Sakshi
పోర్టుకు చేరుకున్న ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌

60.66 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ దిగుమతి

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్‌ కృష్ణపట్నం పోర్టుకు శుక్రవారం ఒడిశా నుంచి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ వచ్చింది. ఈ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ ద్వారా రెండు ట్యాంకర్లలో నింపిన 60.66 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను ఒడిశాలోని రూర్కెలా నుంచి రాష్ట్రానికి తరలించారు. ఈ రైలు 1,305 కిలోమీటర్ల దూరాన్ని 22 గంటల వ్యవధిలో ప్రయాణించి కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంది.

ఇప్పటివరకు విజయవాడ డివిజన్‌కు వచ్చిన ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లలో ఇది నాలుగోది. ఈ నాలుగు ప్రత్యేక రైళ్ల ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 275 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రాష్ట్రానికి దిగుమతి జరిగింది. ఈ సందర్భంగా డీఆర్‌ఎమ్‌ పి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రీన్‌ కారిడార్‌లను ఏర్పాటు చేసి అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో నిర్దేశించిన గడువులోగా ఇవి గమ్యస్థానాలకు చేరుకునేలా కృషి చేస్తున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు