రూ.250 కోట్లతో ప్లాంట్‌: రోజుకు 600 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి

14 Aug, 2021 04:05 IST|Sakshi

ఎలెన్‌ బర్రీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వరుణ్‌ అగర్వాల్‌ వెల్లడి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న పారిశ్రామిక ఆక్సిజన్‌ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కర్నూలులో మరో ఆక్సిజన్‌ తయారీ యూనిట్‌ను నెలకొల్పుతున్నట్టు ఎలెన్‌ బర్రీ గ్యాసెస్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. రూ.250 కోట్లతో రోజుకు 600 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ఎలెన్‌ బర్రీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వరుణ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ యూనిట్‌ ద్వారా పరిశ్రమలకు అవసరమైన ఆక్సిజన్, నైట్రోజన్, ఆర్గాన్‌ వంటి గ్యాస్‌లను ఉత్పత్తి చేయనున్నారు.

ఫార్మా కంపెనీల నుంచి నైట్రోజన్‌ డిమాండ్‌ పెరుగుతుండటం, వెల్డింగ్, కాస్టింగ్‌లో ఆర్గాన్‌ గ్యాస్‌ వినియోగం కూడా పెరుగుతుండటంతో వీటి ఉత్పత్తిపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. కర్నూలు జిల్లాకు జిందాల్‌ ఇస్పాత్‌ స్టీల్‌ యూనిట్‌తో పాటు రాంకో సిమెంట్‌ ప్లాంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంట్లు వస్తుండటంతో వీటి అవసరాలకు ఉపయోగపడేలా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడేలా ఈ యూనిట్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తున్నారు. 2022 మధ్య నాటికి దీనిని అందుబాటులోకి తెస్తామని కంపెనీ పేర్కొంది. ఇప్పటికే ఈ సంస్థకు విశాఖలో యూనిట్‌ ఉంది.    

మరిన్ని వార్తలు