గ్రీన్‌ చానెల్‌లో ఆక్సిజన్‌ ట్యాంకర్‌

13 May, 2021 05:35 IST|Sakshi
పోలీసుల సాయంతో అనంతపురం చేరుకుంటున్న ఆక్సిజన్‌ ట్యాంకర్‌

ఐదు గంటల ప్రయాణం మూడు గంటల్లోనే..

కర్ణాటక రాష్ట్రం తోర్నకల్‌ నుంచి ‘అనంత’కు చేరిన ట్యాంకర్‌ 

అనంతపురం: ఆక్సిజన్‌ నిల్వల విషయంలో అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, కేన్సర్‌ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వలపై ఓ అంచనాకు వచ్చిన అధికారులు కర్ణాటక నుంచి ఆగమేఘాలపై ఆక్సిజన్‌ ట్యాంకర్‌ తెప్పించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలోని తోర్నకల్‌ జిందాల్‌ ఫ్యాక్టరీ నుంచి జిల్లా కేంద్రానికి 16 టన్నుల (13 కిలోలీటర్లు) ఆక్సిజన్‌ ట్యాంకరు రావాల్సి ఉండగా.. ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి నేతృత్వంలో బుధవారం గ్రీన్‌చానెల్‌ ద్వారా ట్యాంకర్‌ను తీసుకురావడం విశేషం. దాదాపు 160 కిలోమీటర్ల దూరం ఉన్న జిందాల్‌ నుంచి ట్యాంకర్‌ ఇక్కడికి రావాలంటే సుమారు ఐదు గంటలు పడుతుంది.

అయితే ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా గ్రీన్‌చానెల్‌ ద్వారా కేవలం 3 గంటల్లోపే అనంతపురానికి చేర్చారు. తెల్లవారుజామున 5.50 గంటలకు బయలుదేరిన వాహనం 9 గంటలకంతా ఇక్కడికి వచ్చేసింది. కరోనా నేపథ్యంలో కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుంది. ఈ కారణంగా ఉదయం పూట ట్రాఫిక్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా ఎక్కడా ఇబ్బంది లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. చెక్‌పోస్టు వద్ద కూడా ఆక్సిజన్‌ ట్యాంకరుకు ఆటంకం కలగకుండా జాగ్రత్తపడ్డారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు