ఇలా విని... అలా నియామకం

13 Jul, 2022 15:59 IST|Sakshi
వేర్లమామిడి గ్రామస్తులు, చిన్నారులతో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ

వేర్లమామిడి పాఠశాలకు తాత్కాలిక ఉపాధ్యాయుడిని నియమిస్తూ ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ ఉత్తర్వులు 

సాక్షి, పాడేరు: గిరిజనుల సమస్యల పరిష్కారంలో ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలకృష్ణ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. తన పరిధిలో వాటికి ఆగమేఘాల మీద పరిష్కారం చూపుతూ సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం వేర్లమామిడి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బదిలీ కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మంగళవారం పాడేరు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. వీరంతా అక్కడ ఉండటాన్ని పీవో గమనించి పిలిచి ఎందుకు వచ్చారని అడిగారు.

ఇటీవల తమ ఉపాధ్యాయుడిని చింతపల్లి మండలం ఉమరాసగొంది పాఠశాలకు బదిలీ చేశారని వాపోయారు. వెంటనే గిరిజన సంక్షేమ శాఖ విద్యా విభాగం అధికారులకు ఫోన్‌ చేసి ఉపాధ్యాయుడిని నియమించాలని ఆదేశించారు. అయితే అదే రోజు సాయంత్రం పాఠశాలకు తాత్కాలిక ఉపాధ్యాయినిగా ఎం.రాజేశ్వరిని నియమిస్తూ పీవో ఆదేశాలు జారీ చేశారు. కొక్కిరాపల్లి ఆశ్రమ పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆమెను బుధవారం విధుల్లోకి చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించిన ఐటీడీఏ పీవోకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.  

శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేయాలి
ఏజెన్సీలో చేపట్టిన నిర్మాణపు పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ ఇంజినీర్లను ఆదేశించారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, అంగన్‌వాడీ, డిజిటల్‌ లైబ్రరీ భవనాలు, మిషన్‌ కనెక్ట్‌ పాడేరు, రెండో దశ నాడు–నేడు నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వీటికి సంబంధించి బిల్లులు సమర్పిస్తే త్వరితగతిన చెల్లిస్తామన్నారు. 58 గ్రావిటీ తాగునీటి పథకాలను నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీర్లను ఆదేశించారు. ఎప్పటికప్పుడూ పనులను పర్యవేక్షించాలన్నారు. కొత్త జిల్లాలో ప్రభుత్వ అంచనాల మేరకు పని చేయాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఈఈలు డీవీఆర్‌ఎం రాజు, కె.వేణుగోపాల్, పంచాయతీరాజ్‌ ఈఈ కె.లావణ్యకుమార్, గృహ నిర్మాణ శాఖ ఈఈ రఘుభూషణరావు పాల్గొన్నారు.  

హెచ్‌ఎన్‌టీసీల అభివృద్ధికి ప్రణాళికలపై ఆదేశం  
ఐటీడీఏ పరిధిలోని ఉద్యానవన విభాగాల(హెచ్‌ఎన్‌టీసీ) అభివృద్ధికి సమగ్రమైన కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ ఆదేశించారు. తన కార్యాలయంలో చింతపల్లి, కొత్తవలస హెచ్‌ఎన్‌టీసీల అభివృద్ధిపై ఉద్యానవన, డ్వామా అధికారులతో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలోని అగ్రి టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. హెచ్‌ఎన్‌టీసీల్లో పండ్ల, పూలమొక్కలు, మెడిసిన్‌ ప్లాంట్ల నర్సరీలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీటి ని పర్యాటకులు, స్థానిక గిరిజన రైతులకు సరఫరా చేస్తా మన్నారు. ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ ఎన్‌.రమేష్‌రామన్, పీహెచ్‌వో అశోక్, డ్వామా ఏపీడీ రామారావు, ఉద్యానవన శాస్త్రవేత్త బిందు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు