కాళ్లు లేని వారిని నడిపిస్తున్న సదా‘సేవా’మూర్తి!..10 వేల మందికి కృత్రిమ కాళ్లు..

19 Mar, 2023 09:18 IST|Sakshi

పాలకొల్లు (సెంట్రల్‌): పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన ఆయన పేరు వేదాంతం సదాశివమూర్తి. పాతికేళ్ల వయసు (1981)లో రైలు దిగుతుండగా కాలుజారి ప్లాట్‌ఫామ్, బోగీ మధ్యలో పడిపోవడంతో ఆయన రెండు కాళ్లూ కోల్పోయారు. పూనేలోని డిఫెన్స్‌ రిహేబిలిటేషన్‌ సెంటర్‌లో మూడు నెలలపాటు చికిత్స చేయించుకున్న సదాశివమూర్తి కృత్రిమ కాళ్లు అమర్చుకున్నారు. 6 నెలల తరువాత కృత్రిమ కాళ్లతోనే బుల్లెట్‌ వాహనాన్ని నడిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

ఆ తర్వాత తాను ధరించే కృత్రిమ కాళ్లకు ఎలాంటి మరమ్మతు వచ్చినా పూనే వెళ్లాల్సి వచ్చేది. అలా 1998 వరకు దాదాపు 17 సంవత్సరాలపాటు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సదాశివమూర్తి పూనే వెళ్లి వస్తుండేవారు. తాను పడుతున్న ఇబ్బందుల్ని తనలాంటి వారు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో స్థానిక రంగమన్నార్‌పేటలో చైతన్య కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అలా మొదలుపెట్టిన ఈ కేంద్రంలో ఇప్పటివరకు సుమారు 10 వేల మందికి కృత్రిమ కాళ్లను అమర్చారు. ఇటీవల ఓ ఆవుకు సైతం కృత్రిమ కాలు అమర్చి ఔరా అనిపించారు సదాశివమూర్తి.

అతి తక్కువ ధరకే..
ఒక్కో కృత్రిమ కాలు ధర రూ.15 వేల నుంచి సుమారు రూ.25 వేల వరకు ఉంటుంది. కాళ్లతో పాటు చేతి వేళ్లు, చెవులు ఇలా ఏ రంగు వారికి ఆ రంగులోనే కృత్రిమ అవయవాలు తయారు చేస్తున్నారు సదాశివమూర్తి. రూ.14 వేలు ఉండే కృత్రిమ కాలిని రూ.900, రూ.3,500 ఉండే కాలి ధరను రూ.120కు తీసుకువచ్చారు. వివిధ కంపెనీలు వేసే రాడ్‌ల స్థానంలో సైకిల్‌కు వాడే కడ్డీలను కట్‌ చేసి కృత్రిమ కాళ్ల పరికరాలు తయారు చేయడం ద్వారా కృత్రిమ కాళ్ల ధరలను నిరుపేదలకు సైతం అత్యంత అందుబాటు ధరల్లోకి తెచ్చారు.

సదాశివమూర్తి సేవలను గుర్తించిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్, ఆర్థోపెడిక్‌ సర్జన్స్‌ 15 ఏళ్ల క్రితం స్వర్ణ పతకాలను అందజేశాయి. కృత్రిమ అవయవాలను కొత్తగా తయారు చేసినందుకు 2010లో ఆలిండియా అవార్డుతో పాటు రూ.2 లక్షల నగదు కూడా అందుకున్నారు. 2007లో పుట్టపర్తి సత్యసాయిబాబా ఆశ్రమ నిర్వాహకులు సదాశివమూర్తిని స్వర్ణ ఉంగరంతో సత్కరించారు.

ఆస్ట్రేలియా వర్సిటీ డాక్టరేట్‌ ప్రదానం
నూతన టెక్నాలజీతో తక్కువ ధరకు.. పేదవారికైతే ఉచితంగానే కృత్రిమ అవయవాలను అందిస్తున్న సమాచారాన్ని సదాశివమూర్తి ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తుండేవారు. అతని ఫేస్‌బుక్‌ ఖాతాను ముంబైలో నివాసం ఉంటున్న డాక్టర్‌ వీవీఎల్‌ఎన్‌ శాస్త్రి చాలాకాలంగా ఫాలో అవుతూ.. ఆ పోస్టులను భద్రపరిచి ఆస్ట్రేలియా యూనివర్సిటీకి పంపించారు. ఆయన అందిస్తున్న సేవలను గుర్తించిన ఆస్ట్రేలియా యూనివర్సిటీ డాక్టరేట్‌ ప్రకటించింది. గత నెల 5వ తేదీన ఢిల్లీలో డాక్టరేట్‌ను అందించడంతోపాటు ‘ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ అవార్డును సైతం సదాశివమూరి్తకి అందజేసింది.

పేదలను ఆదుకోవాలనే తపనతోనే..
ఎంఏ చదువుతున్నప్పుడు కాళ్లు కోల్పోయాను. అనంతరం డిపొ్లమా ఇంజనీరింగ్‌ చేశాను. మోకాలి కింద వరకు కృత్రిమ కాళ్లను ఉచితంగానే అమరుస్తున్నాం. మోకాలి పైవరకు అమర్చాలంటే రూ.45 వేలకు పైగా ఖర్చవుతుంది. పేదలకు ఉచితంగా సేవలందించాలనేదే సంకల్పం. 
– వేదాంతం సదాశివమూర్తి, చైతన్య కృత్రిమ అవయవ కేంద్రం నిర్వాహకుడు, పాలకొల్లు
చదవండి: వేరుశనగలో ‘విశిష్ట’మైనది

మరిన్ని వార్తలు