'లక్ష్యాన్ని చేరుకున్నప్పుడే కన్నవారు సంతోషిస్తారు'

22 Nov, 2020 12:39 IST|Sakshi

పాలకొండ డీఎస్పీ మల్లంపాటి శ్రావణి 

‘సాక్షి’తో ముఖాముఖి  

లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉండడంతోపాటు.. అందుకు తగ్గట్టుగా సాధన చేస్తే ఉన్నత శిఖరాన్ని చేరుకోవడం ఖాయమని పాలకొండ డీఎస్పీ మల్లంపాటి శ్రావణి అన్నారు. కృషి.. పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చని చెప్పారు. 2018 గ్రూప్‌–1 బ్యాచ్‌కు చెందిన ఈమె అప్పటి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 14, మహిళా విభాగంలో నాలుగో ర్యాంక్‌ సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. తొలుత కృష్ణా జిల్లా బందర్‌ సబ్‌డివిజన్‌ ఇన్‌చార్జి డీఎస్పీగా విధులు నిర్వహించిన శ్రావణి ఈ నెల 19న పాలకొండ పోలీస్‌ సబ్‌డివిజన్‌ అధికారిగా పూర్తి బాధ్యతలు చేపట్టారు. శనివారం ఆమెను కలిసిన ‘సాక్షి’తో ముచ్చటించారు.  – పాలకొండ రూరల్‌

సాక్షి: మీ కుటుంబ నేపథ్యం? 
డీఎస్పీ: మాది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు. హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. అక్కడ బీఈ ఎలక్ట్రానిక్స్‌ చదివా. తండ్రి గాంధీ న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి శేషపద్మ గృహిణి. నాకో సోదరుడు ఉన్నారు. 

సాక్షి: పోలీస్‌ శాఖను ఎంచుకోవడంలో ఉద్దేశం? 
డీఎస్పీ: మిగాతా ప్రభుత్వ ఉద్యోగాలతో పోల్చుకుంటే పోలీస్‌ శాఖ ప్రజలకు దగ్గరగా ఉండి సేవలందించే అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రూప్స్‌కు సిద్ధమై విజయం సాధించాను.  

సాక్షి: భవిష్యత్‌ లక్ష్యాలు? 
డీఎస్పీ: ఉన్నత లక్ష్యంతో పోలీస్‌ ఉద్యోగంలోకి వచ్చాను. అన్నివర్గాల ప్రజలకు చట్టం సమానంగా ఉండాలనేది నా ఉద్దేశం. భవిష్యత్‌లో ఎక్కడ విధులు చేపట్టినా మంచి పేరు తెచ్చుకోవాలి. ఓ ఉద్యోగిగానే కాకుండా ప్రజలు మెచ్చిన అధికారిగా ఉంటా. 

సాక్షి: పాలకొండలో తొలి పోస్టింగ్‌ కదా.. ఏ అంశాలకు ప్రాధాన్యతనిస్తారు? 
డీఎస్పీ: ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లల భద్రత, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటాను. ఏజెన్సీ కలబోసి ఉన్న ఈ సబ్‌డివిజన్‌లో సారా అమ్మకాలు, తయారీపై కఠినంగా వ్యవహరిస్తా. సమస్యల పరి ష్కారం కోరి వచ్చిన వారితో గౌరవంగా సిబ్బంది మెలి గేలా చొరవ తీసుకుంటా. ట్రాఫిక్‌ సమస్యను గాడిలో పెట్టేందుకు ప్రాధాన్యత కల్పిస్తాం. ప్రజలకు పోలీస్‌ వ్యవస్థపై అపోహలు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటా.  

సాక్షి: ఈ సబ్‌డివిజన్‌లో ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతాలున్నాయి. మావోల ప్రభావం కూడా ఉంటుంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? 
డీఎస్పీ: సరిహద్దు గ్రామాల వద్దగల చెక్‌ పోస్టులు మరింత పటిష్టంగా నిర్వహిస్తాం. గస్తీ, ముందస్తు సమాచార సేకరణపై దృష్టిసారిస్తా. మా పరిధిలో గల పోలీస్‌ స్టేషన్లను పరిశీలించి, లోపాలు గుర్తించి ఉన్నతాధికారుల సూచనలతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నాకు తెలిసి మావోయిస్టుల ప్రభావం గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం లేదు.  

సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఎటువంటి చర్యలు చేపడతారు? 
డీఎస్పీ: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరించనుంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపడతాం. గతంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించిన వారిని ముందుగానే బైండోవర్‌ చేస్తాం. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తాం.   

సాక్షి: నేటితరం యువతకు, ఈ ప్రాంత ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నారు? 
డీఎస్పీ: యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. లక్ష్యం కోసం కృషిచేస్తే కోరుకునే ఆనందం దక్కుతుంది. ఆ లక్ష్యం చేరుకున్నప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుంది. కన్నవారు సంతోషిస్తారు. ఈ ప్రాంత ప్రజలకు శాఖా పరంగా అందుబాట్లో ఉంటా. ఏ సమస్య ఉన్నా నేరుగా కలిసి తెలియజేయవచ్చు.  

మరిన్ని వార్తలు