పాతికేళ్ల అనుబంధానికి తెర 

24 Apr, 2022 19:06 IST|Sakshi

పలాస ఆర్‌డబ్ల్యూఎస్‌ డివిజన్‌ కేంద్రం మార్పు

జిల్లాల విభజన నేపథ్యంలో అనకాపల్లికి తరలింపు

ఈఈతో పాటు ఆరుగురు ఇంజినీర్లకు బదిలీ

మిగిలిన ఉద్యోగులకు శ్రీకాకుళంలో పోస్టింగులు

ఉద్దానం ప్రాజెక్టులన్నీ    శ్రీకాకుళం డివిజన్‌ పరిధిలోకి.. 

పలాస:  రెండు దశాబ్దాలుగా పలాస కేంద్రంగా ఉన్న పలాస గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) శాఖ డివిజన్‌ కేంద్రం ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో అనకాపల్లికి తరలి వెళ్లిపోయింది. దీని పరిధిలోని ప్రాజెక్టులను శ్రీకాకుళం డివిజన్‌లో విలీనం చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఈఈతో సహా మొత్తం 28 ఏఈలు, డీఈలు, ఇతర సిబ్బంది కూడా బదిలీ అయ్యారు. దీంతో సుమారు 25 ఏళ్ల అనుబంధానికి తెరపడినట్లయ్యింది. ఈ మేరకు అమరావతి ఇంజినీరింగ్‌ చీఫ్‌ నుంచి ఈ నెల 6న ఉత్తర్వులు రావడంతో ఉద్యోగులు కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది.


  
విభజనే కారణం.. 
పలాస డివిజన్‌ కేంద్రం 1997లో ఏర్పాటైంది. దీని పరిధిలో నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాలోని మొత్తం 20 మండలాలు ఉన్నాయి. ప్రధానమైన ఉద్దానం మంచినీటి ప్రాజెక్టుతో పాటు సుమారు 807 గ్రామాలు ఈ కేంద్రం పరిధిలో ఉన్నాయి. ఉద్దాన ప్రాంత ప్రజలకు శుద్ధజలం అందించేందుకు సుమారు రూ.700 కోట్ల భారీ ఖర్చుతో మెగా ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. డీపీ, పీడబ్ల్యూఎస్, ఎంపీడబ్ల్యూఎస్‌ల ద్వారా మరో 2వేల గ్రామాలకు నీరు సరఫరా అవుతోంది. సీపీడబ్ల్యూఎస్‌ పథకాలు మరో 25 ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ శ్రీకాకుళం డివిజన్‌ కేంద్రం పరిధిలోకి వెళ్లాయి. 

శ్రీకాకుళం డివిజన్‌ కేంద్రలో 18 మండలాలు ఉండేవి. అందులో పాలకొండ, సీతంపేట, వీరఘట్టం, భామిని మండలాలు పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనమయ్యాయి. రాజాం నియోజకవర్గంలోని రాజాం, వంగర, రేగిడి, సంతకవిటి మండలాలు విజయనగరం జిల్లాలో విలీనమయ్యాయి. దీంతో 38 మండలాలతో ఉన్న ఈ రెండు డివిజన్‌ కేంద్రాలకు బదులు ప్రస్తుతం 30 మండలాలతో కేవలం శ్రీకాకుళం డివిజన్‌ కేంద్రంగానే ఉండబోతుందని ప్రస్తుత శ్రీకాకుళం ఈఈ రామకృష్ణ చెప్పారు. ప్రస్తుతం పలాసలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులను జిల్లా పరిషత్‌కు బదిలీ చేశారు. ఈఈతో పాటు ఆరుగురు ఇంజినీర్లను అనకాపల్లికి బదిలీ చేశారు. మిగతా వారిని ఎస్‌సీ ఆఫీసుకు సరెండర్‌ చేశారు. పలాసలో ఉన్న ప్రస్తుత డివిజన్‌ కేంద్రం గతంలో ఉద్దానం ప్రాజెక్టు పరిధిలో ఉండేది. ఇక్కడి నుంచే ఉద్దానం ప్రాజెక్టు అధికారులు విధులు నిర్వర్తించేవారు. మళ్లీ వారి చేతుల్లోకి ఈ కార్యాలయం వెళ్లబోతుందని ఇక్కడ తాత్కాలికంగా పనిచేస్తున్న ఈఈ పి.పి సూర్యనారాయణ చెప్పారు.  

మరిన్ని వార్తలు