Narasaraopeta: చిన్నతురకపాలెం ప్రత్యేకత ఏంటో తెలుసా?

15 Nov, 2022 20:13 IST|Sakshi

ఇంటిపేరు ముందు పూర్వీకుల ఊరిపేరు

పలు ప్రాంతాల నుంచి వలస వచ్చి స్థిరనివాసాలు  

సాక్షి, నరసరావుపేట: పూర్వీకుల ఊరి పేరు అడిగితే ఎవరైనా చెప్పడానికి కాస్త తడుముకుంటారు. కానీ ఆ గ్రామంలో ఇంటి పేరు ముందు ఊరిపేరు పెట్టుకుంటారు. పూర్వీకులను నిత్యం తలచుకుంటారు అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది నిజం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని చినతురకపాలెం ప్రత్యేకత ఇది. ఎందుకలా.. ఏమా కథా.. కమామిషు.. అంటే.. 

వందల ఏళ్ల క్రితం సుదూర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారంతా కలసి ఆ గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చినతురకపాలెం అని పేరు పెట్టుకున్నారు. అందరూ ముస్లింలే. రోజులు గడిచేకొద్దీ పేర్లన్నీ ఒకేలా ఉండడంతో పిలవడంలో గందరగోళం తలెత్తింది. దీంతో ఇంటిపేరు ముందు గానీ, తర్వాత గానీ ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో ఆ ఊరిపేరు చేర్చడం అలవాటు చేశారు అప్పటి పెద్దలు.. ఉదాహరణకు షేక్‌ సలాముద్దీన్‌ అనే వ్యక్తి మధిర నుంచి వచ్చినవాడనుకోండి. షేక్‌ ముందో తర్వాతో మధిర పేరును కలిపారు.


అలా మొదలైన ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. ప్రస్తుతం ఈ గ్రామంలో సుమారు 750 కుటుంబాలు ఉండగా, 550కుపైగా కుటుంబాలు తమ ఇంటిపేరు ముందో తర్వాతో పూర్వీకుల ఊరిపేరు చేర్చుకుంటున్నారు. ఆధార్, రేషన్‌ కార్డుల్లోనూ ఇవే పేర్లను నమోదు చేయిస్తుండడం విశేషం. ఇప్పుడు పుట్టే బిడ్డలకూ ఈ సంప్రదాయం కొనసాగిస్తుండడం గమనార్హం.  

ఇరవై ఊళ్ల నుంచి వలసలు 
ఈ గ్రామంలో పొదిలి, చావపాటి, పెట్లూరివారిపాలెం, కూరపాడు, ముప్పాళ్ళ, అనంతవరప్పాడు, గురిజేపల్లి, మధిర, చిరుమామిళ్ళ, తూబాడు వంటి అనేక గ్రామాల నుంచి వలసలు వచ్చిన వారు ఉన్నారు. ఇలా ఇక్కడ ఇరవై ఊళ్ల నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు.  (క్లిక్: జోరుగా సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌లు, కార్ల అమ్మకాలు.. కారణాలు ఇవే!)


ఆనవాయితీగా వస్తోంది  

మా పేర్లకు ముందు ఇంటి పేరుతోపాటు పూర్వీకుల గ్రామం పేరు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని మేమూ కొనసాగిస్తున్నాం. మాకు పుట్టే బిడ్డలకూ అన్ని గుర్తింపు కార్డుల్లోనూ ఇదే తరహాలో నమోదు చేయిస్తున్నాం.   
– షేక్‌ పొదిలే ఖాజా మొహిద్దీన్, చిన్న తురకపాలెం గ్రామస్తుడు 


సౌలభ్యం కోసం... 

ఒకే పేరుతో ఎక్కువ మంది ఉండడంతో ఊరుపేర్లతో పిలవడం మొదలెట్టారు. మేమంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారం కావడంతో ఖాజా, సైదా, మస్తాన్‌వలి వంటి పేర్లు ఎక్కువగా పెడుతుంటాం. అందుకే ఇంటి పేరు ముందు పూర్వీకుల ఊరి పేరు పెట్టి పిలవడం మొదలెట్టారు. అదే కొనసాగుతోంది. ఇది కొందరికి విచిత్రంగా అనిపించినా మాకు మాత్రం సౌలభ్యంగా ఉంది.  
– పెట్లూరివారిపాలెం మహబూబ్‌ సుభానీ, చిన్నతురకపాలెం గ్రామస్తుడు 

మరిన్ని వార్తలు